మహిళల వేడుకలు అక్కడ అలా!

మార్చి 8... అంతర్జాతీయ మహిళా దినోత్సవం. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో మన దిశ, దశల గురించి చర్చించే ప్రత్యేకమైన రోజు.

Updated : 07 Mar 2024 12:53 IST

మార్చి 8... అంతర్జాతీయ మహిళా దినోత్సవం. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో మన దిశ, దశల గురించి చర్చించే ప్రత్యేకమైన రోజు. మరి ఈ రోజును ఏయే దేశాల్లో ఎలా జరుపుకొంటారో మీకు తెలుసా!


ఇటలీ... మమోసా

పేరేంటో కొత్తగా ఉందనుకుంటున్నారా! మమోసాలంటే పసుపుపచ్చ రంగులో ఉండే పూలు. ఈ పూల గుత్తులనే ఇటలీ మహిళలు ఈ రోజున ఒకరికొకరు బహుమతిగా ఇచ్చుకుని సంఘీభావం తెలుపుతారట. మహిళా శక్తికి ప్రతిరూపంగా వీటిని భావించడం అక్కడి సంప్రదాయం. అంతేకాదు కేకులు, పాస్తా...వంటి వాటిని మమోసాలను తలపించేలా పసుపురంగులో, అదే ఆకారంలో తయారుచేసుకుని, ఒకరికొకరు పంచుకుంటారట.


యూఎస్‌లో... నెలంతా

ఈరోజున మహిళలకు అధికారిక సెలవు కానప్పటికీ, మార్చి నెలను ‘విమెన్స్‌ హిస్టరీ మంత్‌’గా జరుపుకొంటారు. మహిళలు సాధించిన, సాధిస్తోన్న విజయాలపై ర్యాలీలు, కాన్ఫరెన్సులూ, బిజినెస్‌ ఈవెంట్లూ నిర్వహించి, భవిష్యత్తులో ఇంకా ఏం చేయాలనే దాని గురించి ప్రణాళికలు వేసుకుంటారు.


యూకే.. వావ్‌

వక్తలు, ఉద్యమకారిణులు ఓ చోట సమావేశమై మహిళలు ఎదుర్కొంటోన్న సమస్యలపై చర్చిస్తారు. ఇంకా మార్చిలో వావ్‌(డబ్ల్యూఓడబ్ల్యూ) సిస్టర్‌ ఫెస్టివల్స్‌ పేరుతో మహిళలందరూ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసుకోవడం, పలు అంశాలపై చర్చలు జరపడం వంటివి చేస్తారు.


చైనా... రెంటినీ కలిపి

మార్చి 7ను ‘గర్ల్స్‌ డే’గా ఇక్కడ నిర్వహించుకుంటారు. 1949 నుంచే వీళ్లు మహిళా దినోత్సవం జరుపుకోవడం ప్రారంభించారు. అయితే మహిళల విజయాలను సెలబ్రేట్‌ చేయరు. మగవారు తమ జీవితంలోని ఆడవాళ్లకు బహుమతులు ఇవ్వడం ఇక్కడ సంప్రదాయం. ఒక రకంగా చెప్పాలంటే వాలెంటైన్స్‌ డే, మదర్స్‌ డే రెండింటినీ కలిపి సెలబ్రేట్‌ చేసుకుంటారు అన్నమాట.


భారత్‌... బహుమతులు

పలు రంగాల్లో మహిళల విజయాలను సెలబ్రేట్‌ చేస్తాం. కొన్ని సంస్థలు పలు విభాగాల్లో అద్భుత ప్రతిభ చూపిన మహిళలకు బహుమతులు ఇస్తాయి. స్వీట్లు, చాక్లెట్లు, పూలు...వంటి వాటిని మహిళలు ఒకరికొకరు ఇచ్చుకుని శుభాకాంక్షలు తెలుపుకొంటారు. 


స్పెయిన్‌... పర్పుల్‌ ధర్నా

2018లో ‘ఇఫ్‌ వియ్‌ స్టాప్‌, ది వరల్డ్‌ స్టాప్స్‌’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా అతిపెద్ద ధర్నా చేపట్టారు స్పెయిన్‌ అమ్మాయిలు. గృహహింస, వేతనాల్లో తేడా, లింగ వివక్ష... వంటి సమస్యలపై చేసిన ఈ ధర్నాలో 50లక్షలకు పైగా మహిళలు పాల్గొన్నారట. ఏటా పర్పుల్‌ రంగు దుస్తుల్లో ఈరోజు ధర్నా నిర్వహిస్తారు.


పోలండ్‌... పూలు

ఈరోజుని మహిళల గౌరవాన్ని పెంపొందించే రోజుగా భావిస్తారట. మగవాళ్లు మహిళలకు కార్నేషన్‌ పూలనూ లేదా తులిప్‌లనూ బహుమతిగా ఇచ్చి తమ గౌరవాన్ని చాటుకుంటారట.


ఆస్ట్రేలియా... పిలుపునిస్తూ

1970ల నుంచీ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఊరేగింపులకు ప్రాచుర్యం ఎక్కువ. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలందరూ కలిసి రకరకాల బహిరంగ చర్చలూ, బ్రేక్‌ఫాస్ట్‌ ఈవెంట్లూ, నిర్వహిస్తారు. సమానత్వం, సాధికారత దిశగా పిలుపునిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్