నైట్‌ వాక్‌... ఓ ఉద్యమం!

‘అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా ఎప్పుడైతే నడవగలదో..  అప్పుడే మనదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు’ అన్న మాటను నిజం చేయాలనుకున్నారు ఆ మహిళలంతా.

Published : 09 Mar 2024 01:15 IST

‘అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా ఎప్పుడైతే నడవగలదో..  అప్పుడే మనదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు’ అన్న మాటను నిజం చేయాలనుకున్నారు ఆ మహిళలంతా. ఎనిమిదివేల మంది తొలిసారిగా సామూహిక నైట్‌ వాక్‌ చేసి చూపించారు. ‘పొదు ఇదం ఎన్‌దేదుం (ఈ పబ్లిక్‌ స్పేస్‌ నాది కూడా)’ పేరుతో కేరళ రాష్ట్ర మాతా శిశుసంక్షేమ అభివృద్ధి విభాగం నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఆ అర్ధరాత్రి వీధుల్లో మహిళలంతా నడక సాగించారు. అతివల్లో  చైతన్యం నింపే దిశగా జరిగిన ఈ కార్యక్రమం ఓ ఉద్యమంలా మారింది. అది అక్కడితో ఆగిపోకుండా ఇతర ప్రాంతాలకూ ‘నైట్‌ వాక్‌’ వ్యాపించింది.

క్షకవ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో మహిళల హక్కులు... వంటి విషయాలపై అందరిలోనూ అవగాహన నింపాలనుకుంది కేరళ ప్రభుత్వం. 2012లో ప్రాణాలొదిలిన అత్యాచార బాధితురాలు నిర్భయను స్మరిస్తూ 2019, డిసెంబరు 29న ఈ నైట్‌వాక్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 100కుపైగా ప్రాంతాల్లో మహిళలు నడవాలంటూ పిలుపునిచ్చి, వలంటీర్ల సాయాన్ని అందించింది. ఇప్పటికీ కొన్ని బహిరంగ ప్రదేశాల్లో కేవలం పురుషులే ఎక్కువగా సంచరించడంతో మహిళలు ఆయా ప్రాంతాల్లో అడుగుపెట్టడానికి వెనకడుగు వేస్తున్నారు. అటువంటిచోట్ల రాత్రుళ్లు నడవడానికి భయపడటమనేదాన్ని ఆ ప్రభుత్వం దూరం చేయాలనుకుంది. ప్రతివారం ఈ వాక్‌ను కొనసాగించేలా ఏర్పాట్లు కూడా చేసింది. టాయ్‌లెట్స్‌ గురించి సమాచారమివ్వడం, గుంపు నుంచి తప్పినవారిని తిరిగి గుర్తించి అందరితో కలపడం వంటి బాధ్యతలను వలంటీర్లకు అప్పగించింది.

ఇతర నగరాల్లోనూ...

బెంగళూరు సెంట్రల్‌ కాలేజ్‌ మెట్రోస్టేషన్‌ ప్రాంతం సమీపంలో చీకటి పడిందంటే చాలు.. మహిళలెవరూ అడుగుపెట్టలేరు. ఇటువంటి ప్రాంతాలు ఆ నగరంలో చాలానే ఉన్నాయి. టీజింగ్‌ ఎక్కువగా ఉండే అక్కడికి రాత్రుళ్లు మహిళలు వెళ్లేలా చేయాలనుకున్నారు పార్వతి భట్‌ గిలియాల్‌. అదే ఆమెను ‘గల్లీ టూర్స్‌’ ప్రారంభించేలా చేసింది. అర్ధరాత్రి ఏయే ప్రాంతాలు మహిళలు నడవడానికి వీలు లేకుండా ఉన్నాయో అటువంటి చోట్ల మహిళా బృందాలతో నైట్‌వాక్‌ చేయించడం ఈ సంస్థ ముఖ్యోద్దేశం. ఆసక్తి ఉన్నవారు గల్లీ టూర్స్‌లో భాగస్వాములు కావొచ్చు. అలా బృందాలుగా ఏర్పడి, ఎంపిక చేసిన చోట్ల  మహిళల నైట్‌వాక్‌ను పార్వతి ఏర్పాటుచేస్తున్నారు. నిర్మానుష్యంగా ఉన్న రహదారులు మాత్రమే కాకుండా బిజీగా ఉండే మార్కెట్‌ రోడ్లను కూడా కొన్నిసార్లు ఈ బృందాలు ఎంచుకొని నడుస్తున్నాయి. అటువంటి చోట్ల కూడా మగవారి నుంచి టీజింగ్‌నెదుర్కోవాలనేదే వీరి ఉద్దేశం. అలాగే బెంగళూరులో వీధి వేధింపులను ఎదుర్కోవడానికి జాస్మిన్‌ ఫతేజా రూపొందించిన కమ్యూనిటీ ప్రాజెక్టు ‘బ్లాంక్‌ నాయిస్‌’ ద్వారా మహిళా బృందాలు నైట్‌వాక్‌ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ఓ ఉద్యమంలా మారి ప్రస్తుతం బెంగళూరుసహా హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, ఛండీగఢ్‌, లఖ్‌నవూ వంటి నగరాలకూ విస్తరించింది. మహిళలకు సురక్షితమైన, స్వేచ్ఛావాతావరణాన్ని సాధించాలనే లక్ష్యంతో ఈ ‘బ్లాంక్‌ నాయిస్‌’ పనిచేస్తుండగా,  పలు ట్రావెల్‌ సంస్థలు కూడా నైట్‌వాక్‌ టూర్స్‌ పేరుతో పర్యాటకులను ఆయా ప్రాంతాల్లో నడిచేలా చేసి అక్కడి ప్రత్యేకతలను చూపిస్తున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్