లక్షద్వీప్‌ తలవంచింది...

యానిమేషన్‌ సినిమాలకు డైరెక్టర్‌గా, రచయిత్రిగా కెరియర్‌ మొదలుపెట్టిన గోలి శ్యామల ఆ తరవాత ఈతపై ఆసక్తి పెంచుకున్నారు. ఆలస్యంగా మొదలుపెట్టినా అంతర్జాతీయ స్విమ్మర్‌గా ఈతలో రికార్డులు సృష్టిస్తున్నారామె.

Updated : 09 Mar 2024 01:23 IST

యానిమేషన్‌ సినిమాలకు డైరెక్టర్‌గా, రచయిత్రిగా కెరియర్‌ మొదలుపెట్టిన గోలి శ్యామల ఆ తరవాత ఈతపై ఆసక్తి పెంచుకున్నారు. ఆలస్యంగా మొదలుపెట్టినా అంతర్జాతీయ స్విమ్మర్‌గా ఈతలో రికార్డులు సృష్టిస్తున్నారామె. తాజాగా లక్షద్వీప్‌లోని కిల్తాన్‌ నుంచి కడమత్‌ ద్వీపం వరకు ఈది శభాష్‌ అనిపించుకున్నారు గోలి శ్యామల... 

గంభీరమైన సముద్రాన్ని చూస్తేనే భయం వేస్తుంది. అలాంటిది లక్షద్వీప్‌లోని ఒక ద్వీపం నుంచి మరొక ద్వీపానికి అవలీలగా ఈదారు శ్యామల. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన 51 ఏళ్ల శ్యామల ఎంఏ సోషియాలజీ చదివారు. వివాహమైన తరవాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. చాలాకాలం నిర్మాతగా, యానిమేషన్‌ సిరీస్‌లకు డైరెక్టర్‌గా, రచయిత్రిగా పనిచేశారు. 2016లో గచ్చిబౌలిలోని స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత నేర్చుకున్నారు. ‘అప్పటివరకు ఈత అంటే ఏంటో తెలియదు. మా కాకినాడలో సముద్రం ఉన్నా ఎప్పుడూ వెళ్లేదాన్ని కాదు. ఈతలో ఆసక్తి పెరిగాక అందులో రికార్డులు నెలకొల్పాలనుకున్నా’ అనే శ్యామల ప్రధాని నరేంద్రమోదీ లక్షద్వీప్‌ పర్యటన పురస్కరించుకుని ఒక అడుగు ముందుకేశారు.

లక్షద్వీప్‌ పర్యాటక రంగానికి ప్రచారం కల్పించడంతోపాటు మహిళా సాధికారత చాటాలనే సంకల్పంతో గత నెల 29న కిల్తాన్‌ ద్వీపం నుంచి కడమత్‌ ద్వీపం వరకు లోతైన సముద్రంలో 38 కిలోమీటర్ల దూరాన్ని 18 గంటల్లో ఈది, ఆ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఎన్నో ఇబ్బందులు, ప్రతికూలతలు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ పటేల్‌ నుంచి పతకం అందుకున్నారు. దీనికంటే ముందు 2021లో రామసేతు ప్రాంతాన్ని ఈదారు. శ్రీలంక నుంచి భారత భూభాగం వరకు ఉన్న 30 కిలోమీటర్ల దూరాన్ని 13గంటల 43 నిమిషాల్లో పూర్తిచేసి.. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు మహిళగా గుర్తింపు పొందారు. అలాగే అత్యంత కష్టసాధ్యమైందిగా చెప్పే... క్యాటీలినా ఛానల్‌నూ 19 గంటల్లో పూర్తి చేశారీమె. ‘గడ్డ కట్టేంత చలి. వేళ్లు వంకర్లు పోయేవి. నా వెనక ఓ తెల్లని డాల్ఫిన్‌ నన్నే వెంబడిస్తుంటే రికార్డు సమయంలో నా లక్ష్యాన్ని పూర్తిచేశా. అమ్మాయిలను ప్రోత్సహిస్తే వాళ్లు ఏదైనా సాధిస్తారు’ అంటారు శ్యామల.

 ఎండీ రియాజ్‌పాషా, పెద్దాపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్