సంగీత ‘సుధా’నిధి

సామాన్యులకు సైతం సంగీతం అర్థం కావాలని తాపత్రయపడే కళాకారులు అరుదుగానే ఉంటారు. విశాఖకు చెందిన ‘మండ సుధారాణి’ కూడా ఆ కోవకు చెందినవారే.

Published : 12 Mar 2024 13:16 IST

సామాన్యులకు సైతం సంగీతం అర్థం కావాలని తాపత్రయపడే కళాకారులు అరుదుగానే ఉంటారు. విశాఖకు చెందిన ‘మండ సుధారాణి’ కూడా ఆ కోవకు చెందినవారే. కర్ణాటక సంగీతం, భారతీయ సంస్కృతి, విలువల్ని... భవిష్యత్తు తరాలకు అందేలా కృషి చేస్తున్నారు. తాజాగా కేంద్ర సంగీత నాటక అకాడెమీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆమె తన అనుభవాలను వసుంధరతో పంచుకున్నారు...

మాది విశాఖపట్నం. నాన్న ఏవీ రమణమూర్తి కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసేవారు. అమ్మ కల్యాణి. మా తాతయ్య కావ్యాలు, పుస్తకాలు రాసేవారు. ఆయన ప్రభావంతో చిన్నప్పుడే పాటలు పాడేదాన్ని. నాన్నకి కూడా సంగీతమంటే ఇష్టం. నా ఆసక్తిని గుర్తించి సంగీతం నేర్పించాలనుకున్నారు. మూడు సంవత్సరాల వయసులోనే రంగాచారి వద్ద శిక్షణకు చేర్పించారు. పన్నెండో ఏట నుంచే ప్రదర్శనలు ప్రారంభించా. ప్రభుత్వ కళాశాలలో సంగీత ఆచార్యులు శేషుమణి వద్ద మూడేళ్లు పాఠాలు నేర్చుకున్నా. పద్నాలుగేళ్ల వయసులోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కల్చరల్‌ టాలెంట్‌ సెర్చ్‌ స్కీమ్‌ స్కాలర్‌షిప్‌ను పదేళ్లపాటు అందుకున్నా. చదువుకుంటూనే వారాంతాల్లో విశాఖ వెళ్లి ఇవటూరి విజయేశ్వరరావు వద్ద సంగీతం నేర్చుకునేదాన్ని. 16 ఏళ్ల వయసులో  ఆలిండియా రేడియో పోటీలో జాతీయస్థాయిలో మొదటి బహుమతిని పొందాను. డిగ్రీతో చదువు ఆపేశాను కానీ ఆంధ్రా యూనివర్సిటీ నుంచి సంగీతంలో ఎంఏ పూర్తిచేశా. 1989లో పెళ్లయ్యాక విశాఖలో స్థిరపడ్డాం. మావారు రామప్రసాద్‌ విశ్రాంత వైద్యులు. ఆయనకూ సాహిత్యమంటే మక్కువే. ఇంట్లో సంగీత పాఠాలు నేర్పేదాన్ని. చాలా కష్టమని భావించే, అరుదైన రాగాలను సులువుగా పాడేదాన్ని. మద్రాసు సంగీత అకాడెమీ వార్షికోత్సవాల్లో అనేక బహుమతులందుకున్నా. దేశంలో.. ఏపీ, దిల్లీ, కోల్‌కతా, ముంబయి, తదితర ప్రాంతాలతోపాటు అంతర్జాతీయ స్థాయిలో.. ఆస్ట్రేలియా, అమెరికా, ఐర్లాండ్‌ దేశాల్లో అనేక సెమినార్లు, ప్రదర్శనలిచ్చా. నా దగ్గర శిక్షణ పొందిన విద్యార్థుల్లో సుమారు 15 మంది ప్రముఖ కళాశాలల్లో ప్రిన్స్‌పల్స్‌గానూ, ప్రొఫెసర్లుగానూ పనిచేస్తున్నారు.

ప్రాచుర్యంలోకి తెచ్చి...

మనోధర్మ సంగీతం, కల్పిత సంగీతం మధ్య అనుబంధంపై చేసిన రచనకు కేంద్ర ప్రభుత్వం ఫెలోషిప్‌ను అందజేసింది. శ్యామశాస్త్రి స్వరజతులపై పరిశోధన చేశా. గాన కళాభారతి, విజయ సంగీతరత్న, సునద సుధానిధి, సంగీత సుధానిధి తదితర బిరుదులందుకున్నా. పోతన భాగవతంలోని 70 పద్యాలకు రాగం కట్టా.

శిష్యులతో కలసి 2015లో ‘హంస అకాడెమీ ఆఫ్‌ మ్యూజిక్‌, స్క్రిప్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌’ ప్రారంభించా. సంగీతంతోపాటు వేదాలు, ఇతర కళల్లో ఆసక్తి ఉన్నవారికి ఆదివారాల్లో ‘జిజ్ఞాస’ పేరిట తరగతులు నిర్వహిస్తుంటాం. మా దగ్గర పిల్లలతో పాటూ తల్లిదండ్రులు కూడా పాఠాలు నేర్చుకుంటారు. విద్యార్థులకు సంగీతంతోపాటు మంచి నడవడిక అలవాటు చేస్తాం. మా అకాడెమీలో ఇప్పటి వరకూ 1000 మందికిపైగా శిక్షణిచ్చాం. సంగీతం, ప్రాణాయామం, వ్యాయామం వల్లనే నేను ఆరోగ్యంగా ఉన్నా. మా పాప శృతిరవళి ఐర్లాండ్‌లో స్థిరపడి అక్కడ పిల్లలకి సంగీత పాఠాలు నేర్పిస్తుంది.

కేతిరెడ్డి రాజ్యలక్ష్మి, విశాఖపట్నం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్