పోషకాల ‘స్టీల్‌ బాక్సు’ల్ని అందిస్తూ...

క్యాన్సర్‌ అనగానే ‘దాన్నుంచి బయటపడితే చాలు’ అనుకుంటారెవరైనా! ఆమె మాత్రం వేరే వాళ్ల గురించీ ఆలోచించారు. ఎన్నోరకాల అనారోగ్యాలకు తిండీ కారణమవుతోందని గ్రహించిన మేకల పద్మ పోషకాహారం అందించడంపై దృష్టిపెట్టారు.

Published : 13 Mar 2024 01:36 IST

క్యాన్సర్‌ అనగానే ‘దాన్నుంచి బయటపడితే చాలు’ అనుకుంటారెవరైనా! ఆమె మాత్రం వేరే వాళ్ల గురించీ ఆలోచించారు. ఎన్నోరకాల అనారోగ్యాలకు తిండీ కారణమవుతోందని గ్రహించిన మేకల పద్మ పోషకాహారం అందించడంపై దృష్టిపెట్టారు.

‘అమ్మా నీ చేతి వంట బాగుంటుంది. మనమేదైనా ఫుడ్‌ బిజినెస్‌ చేద్దామా?’ వాళ్లబ్బాయి అనిల్‌ ఈ మాట ఎన్నిసార్లు అన్నా పద్మ ‘సర్లే చూద్దాం’ అని వదిలేసేవారట. కచ్చితంగా చేయాలి అన్న ఆలోచన రావడానికి క్యాన్సరే కారణమంటారామె. వీళ్లది మహబూబ్‌నగర్‌ జిల్లా. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఒంటరి తల్లి. బేబీ సిట్టింగ్‌, వండిపెట్టడం ద్వారా కుటుంబాన్ని పోషించేవారు. సెకండ్‌ వేవ్‌లో కరోనా బారిన పడ్డాక తరచూ అనారోగ్యాలు పలకరించేవి. ఈ క్రమంలో రొమ్ములో ఏదో గడ్డలా కనిపిస్తోంటే పరీక్ష చేయించుకున్నారు. తీరా చూస్తే క్యాన్సర్‌ అని తేలింది. ‘అప్పటికే ఆరునెలలు ఖాళీగా ఉన్నా. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీనికితోడు సర్జరీ, కీమోథెరపీ, రేడియో థెరపీ చేయించాలన్నారు. ఏ దారీ తోచలేదు. కానీ నిమ్స్‌లో కీమోకి వెళ్లినప్పుడు ఇంతమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారా అని ఆశ్చర్యమేసింది. మనం తినే ఆహారం కూడా కొన్నిసార్లు క్యాన్సర్‌కి కారణమవుతుందని విన్నా. శుభ్రత భయంతో బయటి ఆహారం తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడను. అలాంటి నేనే క్యాన్సర్‌ బారిన పడ్డానంటే మిగతావాళ్ల సంగతేంటి అనిపించింది. అప్పుడే పోషకాహారం అందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అప్పటిదాకా మా బాబు చిన్న ట్రక్‌ లాంటిది పెడదామా అనేవాడు. కానీ దుమ్మూ, శుభ్రత సమస్యలు వస్తాయి కదా! అందుకే వేరే మార్గాలు వెతికాం’ అంటారు పద్మ.

గత ఏడాది క్లౌడ్‌కిచెన్‌ ప్రారంభించి, ఈ-కామర్స్‌ వేదికల ద్వారా ఫుడ్‌ డెలివరీ ప్రారంభించారు. ‘ఇంటికి దూరంగా ఉన్నవారికీ, ఉరుకుల, పరుగుల జీవనశైలితో వండుకునే తీరిక లేనివారికి అమ్మ చేతి వంట అందించాలనుకున్నా. అలాంటిది ప్లాస్టిక్‌ డబ్బాల్లో వేడి వేడి ఆహారం కూడా ప్రమాదమేగా అనిపించింది. అప్పుడు ‘టిఫిన్‌ బాక్స్‌’ ఆలోచన వచ్చింది. స్టీల్‌ బాక్సుల్లో మధ్యాహ్న, రాత్రి భోజనాలు అందించాలనుకున్నాం. మా బాబు ఇన్‌స్టాలో ఖాతా తెరిచి ప్రచారం చేశాడు. అలా వినియోగదారులొచ్చారు. వాట్సప్‌లో ఆ వారం ఏం చేయబోతున్నామన్నది ముందే చెబుతాం. ఎవరికైనా నచ్చకపోతే దాన్ని మారుస్తాం. వెజ్‌, నాన్‌వెజ్‌ను బట్టి నెలకు ఇంత అని తీసుకుంటాం. ప్యాకేజ్‌డ్‌ మసాలాలు, వాడిన నూనెలు, ప్రిజర్వేటివ్స్‌ వాడం. మేము తిననిది మీకు పెట్టం అని చెప్పా. దక్షిణాది వాళ్లే కాదు, ఉత్తరాది వాళ్లూ మా వినియోగదారుల్లో ఉన్నారు. తెలియనివి తెలుసుకొని మరీ తింటోంటే ఆనందంగా ఉంటుంది. తొలిరోజుల్లో మా బాబే డెలివరీ చేసేవాడు. ఇప్పుడు మరొకరిని నియమించుకున్నాం. ప్రస్తుతం చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితం చేశాం. విస్తరించే ఆలోచనలో ఉన్నా’మనే పద్మ... సిబ్బంది ఉన్నా స్వయంగా వండటానికే ఇష్టపడతారట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్