చీరతో పరుగు...

పరుగు పెట్టడమంటే ట్రాక్‌ సూట్‌, స్నీకర్స్‌ ఉండాలనుకుంటాం. అలాకాకుండా చీర ధరించి పరుగుపెడితే? అదెలా వీలవుతుందని ఆశ్చర్యపోతున్నారా... శారీరకసామర్థ్యాన్ని పెంచే పరుగుకు సంప్రదాయాన్ని జోడిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది ఓ మహిళా బృందానికి.

Updated : 16 Mar 2024 07:53 IST

పరుగు పెట్టడమంటే ట్రాక్‌ సూట్‌, స్నీకర్స్‌ ఉండాలనుకుంటాం. అలాకాకుండా చీర ధరించి పరుగుపెడితే? అదెలా వీలవుతుందని ఆశ్చర్యపోతున్నారా... శారీరకసామర్థ్యాన్ని పెంచే పరుగుకు సంప్రదాయాన్ని జోడిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది ఓ మహిళా బృందానికి. అలా మొదలైన ‘ద శారీ రన్‌’ ఆలోచన ప్రముఖ నగరాలకూ విస్తరించింది. అదిప్పుడు భాగ్య నగర వీధుల్లోనూ సందడి చేస్తోంది. మహిళల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన కలిగించడానికి నిర్వహిస్తున్న ఈ రన్నింగ్‌ హైదరాబాద్‌లో ఈ ఆదివారం జరగనుంది... 

ట్రాక్‌సూట్‌, స్నీకర్స్‌తో రన్నింగ్‌ చేసే సంప్రదాయం మారి, చీరతోనూ పరుగుపెట్టొచ్చంటున్నారు అతివలు. ‘సాధారణ దుస్తులతో కాకుండా చీరతో పరుగుపెట్టాలనే ఆలోచన తనకు ఐదేళ్ల క్రితమే వచ్చిందంటారు బెంగళూరుకు చెందిన జయశ్రీ ముదలియార్‌. అప్పుడామె బృందంలో నలుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఒక్క అడుగుతోనే వేల మైళ్ల దూరం మొదలవుతుందని ఆలోచించారీమె. దాంతో ఆ నలుగురే ‘జయనగర్‌ జాగ్వార్స్‌’ గ్రూపుగా మారారు. చీరలు ధరించి హాఫ్‌ మారథాన్‌ పేరుతో బెంగళూరులో మొదటిసారిగా పరుగుపెట్టారు. ‘మూడు పదులు నిండేటప్పటికి మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి. అందుకే వ్యాయామంలో భాగమైన పరుగుపై అవగాహన కలిగించేలా ఏటా ‘ద శారీ రన్‌’ నిర్వహిస్తున్నాం. క్రమేపీ మా బృందం సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. గతేడాది 7,500మంది చేరడం మహిళలందరిలో మరింత ఉత్సాహాన్ని నింపింది. వీరిలో కొందరు తమ సంప్రదాయ కట్టుతోనే పరుగుపెట్టగా, దక్షిణాది ప్రాంతాలకు చెందిన మరి కొందరు తొమ్మిది అడుగుల చీరతోనూ పాల్గొన్నారు. సామాజిక సరిహద్దులను ఛేదించి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై అవగాహనలా మారిందీ శారీ రన్‌. కులమతబేధం లేకుండా మహిళలందరినీ ఒక్కటి చేయగలిగే శక్తి చీరకుంది. బెంగళూరులో మేం ప్రారంభించిన ఈ పరుగు పుణె, కోల్‌కతావంటి నగరాలకూ విస్తరించి మరికొందరిలో అవగాహన పెరగడానికి కారణమైందంటున్నా’రు జయశ్రీ. హైదరాబాద్‌లో మార్చి 17న ఉదయం ఆరు గంటలకు ప్రారంభించనున్న ‘తనీరా శారీ రన్‌’లో పాల్గొనాలనుకునే సభ్యులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. పీపుల్స్‌ ప్లాజా-నెక్లెస్‌ రోడ్‌ నుంచి ప్రారంభమయ్యే మూడు కిలోమీటర్ల పరుగులో చీరతో పాల్గొనాల్సి ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్