కథ వెనక కథ

రాత్రుళ్లు రంగుల ప్రపంచం... పగలు అదే ప్రపంచం వెలవెలబోతూ నిర్జీవంగా మారిపోతుంది! ప్రపంచంలో ఏ వేశ్యావాటికలని చూసినా ఈ తీరుగానే ఉంటాయేమో.

Updated : 09 May 2024 14:45 IST

రాత్రుళ్లు రంగుల ప్రపంచం... పగలు అదే ప్రపంచం వెలవెలబోతూ నిర్జీవంగా మారిపోతుంది! ప్రపంచంలో ఏ వేశ్యావాటికలని చూసినా ఈ తీరుగానే ఉంటాయేమో. ప్రస్తుతం హీరామండీది అలాంటి కథే! పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న ఈ హీరామండీ కథని సంజయ్‌లీలా బన్సాలీ తెరకెక్కించడానికి అసలు స్ఫూర్తి ‘ది డ్యాన్సింగ్‌ గర్ల్స్‌ ఆఫ్‌ లాహోర్‌’ అనే పుస్తకం.

లండన్‌కి చెందిన ప్రొఫెసర్‌, సోషియాలజిస్ట్‌ లూయీజ్‌ బ్రౌన్‌ ఈ పుస్తకాన్ని రచించారు. ఏళ్ల తరబడి ఆమె చేసిన పరిశోధనల ఫలితమే ఈ పుస్తకం. మొగలుల కాలంలో ఆస్థానంలో ఉండే కళాకారులకోసం ఏర్పాటు చేసిందే హీరామండీ. భారతీయ నృత్యాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన ఆ కళాకారిణుల వైభవం మహారాజా రంజీత్‌సింగ్‌ కాలంలో అత్యున్నత దశకు చేరుకుంది. ఆ కళాకారిణుల్లో ఒకరైన మోరన్‌ సర్కార్‌ని ఆయన వివాహం కూడా చేసుకున్నారు. ఆమె అసలు పేరు అదికాదు. నెమలిలా వయ్యారంగా నాట్యం చేస్తుందనే ఆమెకు మోరన్‌ అనే పేరు వచ్చింది. ఆమె కోసం కట్టించిన వంతెన ఇప్పటికీ భారత్‌- పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉంది. అంత గొప్పగా బతికిన వారు ఆంగ్లేయుల రాకతో పొట్టపోసుకొనేందుకు వేశ్యలుగా మారారు. ఇక్కడ నుంచే లూయీజ్‌ తన కథ ప్రారంభించారు. దీనికోసం హీరామండీలోని మహా అనే వేశ్యతో నాలుగేళ్లపాటు స్నేహం చేశారు బ్రౌన్‌. మహా 12 ఏళ్ల వయసులో దుబాయ్‌ సేఠ్‌కి అమ్ముడుపోయి ఎన్నో కష్టాలు పడింది.

ఆమెకి ముగ్గురు కూతుళ్లు. తన కూతురు నేనాని ఈ ఊబిలోకి దింపుతుందా లేదా అనేది కథ. లూయీజ్‌ యూకేలోని బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తూనే... భారత్‌లోని కోల్‌కతా, ముంబయి, దిల్లీ నగరాలతోపాటు, బంగ్లాదేశ్‌, నేపాల్‌ల్లోనూ రెండు దశాబ్దాల పాటు తిరుగుతూ ఇక్కడి వేశ్యల జీవితాలపై పరిశోధనలు చేశారు. బ్రిటిషర్ల రాకతో కోల్‌కతాలోని కళాకారిణులు వేశ్యలుగా మారిన తీరుని తన మొదటి పుస్తకం ఈడెన్‌ గార్డెన్స్‌లో వివరించారు. తర్వాత పుస్తకమే ఈ ‘ది డ్యాన్సింగ్‌ గర్ల్స్‌ ఆఫ్‌ లాహోర్‌’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్