కరోనా నాకు రాదులే అనుకోవద్దు.. అలా అనుకునే ఆస్పత్రి పాలయ్యా!

కనికరం లేకుండా విరుచుకుపడుతోన్న కరోనా యావత్‌ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. మొదటి దశ కంటే రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతూ అందరినీ భయాందోళనలకు గురి చేస్తోంది. చిన్నా-పెద్దా, పేద-ధనిక, ఆడ-మగ, సామాన్యులు-సెలబ్రిటీలు అన్న తేడాలేవీ చూపించడం లేదీ మహమ్మారి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న వారందరినీ అలర్ట్‌ చేయడానికి తన కరోనా కథను పంచుకోవడానికి మన ముందుకొచ్చింది గురుగ్రామ్‌కు చెందిన ఓ మహిళ.

Published : 24 Jun 2021 14:02 IST

Image for Representation

కనికరం లేకుండా విరుచుకుపడుతోన్న కరోనా యావత్‌ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. మొదటి దశ కంటే రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతూ అందరినీ భయాందోళనలకు గురి చేస్తోంది. చిన్నా-పెద్దా, పేద-ధనిక, ఆడ-మగ, సామాన్యులు-సెలబ్రిటీలు అన్న తేడాలేవీ చూపించడం లేదీ మహమ్మారి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న వారందరినీ అలర్ట్‌ చేయడానికి తన కరోనా కథను పంచుకోవడానికి మన ముందుకొచ్చింది గురుగ్రామ్‌కు చెందిన ఓ మహిళ. వైరస్‌ కలిగించే తీవ్ర పర్యవసానాలతో పాటు దీనిని కట్టడి చేసేందుకు కనీస జాగ్రత్తలు పాటించాలని వేడుకుంటూ తన కొవిడ్‌ అనుభవాలను ఇలా నెమరువేసుకుంది.

అదెంత పెద్ద తప్పో ఆ తర్వాతే తెలిసొచ్చింది!

హాయ్... నా పేరు రంజితా బిష్ణోయ్‌. దిల్లీలోని గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఇండస్ట్రియల్‌ డిజైనర్‌గా పని చేస్తున్నాను. నా భర్తతో కలిసి గురుగ్రామ్‌లో నివాసముంటున్నాను. కొద్దిరోజుల క్రితం కరోనా నిర్ధారిత పరీక్షల్లో మా ఆయనకు పాజిటివ్‌ అని తేలింది. దీంతో నేనూ తప్పనిసరిగా కరోనా టెస్ట్‌కు వెళ్లాల్సి వచ్చింది. అయితే నా శరీరంలో కరోనా లేదని నాకెంతో నమ్మకం. అందుకే ఎలాంటి భయం, ఆందోళన లేకుండా కరోనా నిర్ధారిత పరీక్ష చేయించుకున్నా. అయితే ఆశ్చర్యకరంగా టెస్ట్‌లో నాకూ పాజిటివ్‌ ఉందని తేలింది. అప్పటిదాకా ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉన్న నా మనసులో కరోనా రిపోర్ట్‌ రాగానే ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఏదో తెలియని భయం నన్ను చుట్టుముట్టింది. ఆ ఆలోచనలతోనే బాగా నీరసించిపోయాను. బలహీనంగా మారిపోయాను. కరోనా సోకిన వారు రుచి, వాసన చూసే సామర్థ్యాన్ని కోల్పోతారని చాలామంది నాతో చెప్పారు. అయితే నాకు అలాంటి లక్షణాలేవీ ఎదురుకాలేదు. కరోనా బాధితులు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలంటారు. కానీ నేనేమీ తినలేకపోయాను. బహుశా కరోనా వల్ల కలిగిన భయమే నన్ను అలా మార్చేసిందేమో! అయితే అదెంత పెద్ద తప్పిదమో ఆ తర్వాతే నాకు అర్థమైంది.’

ఆస్పత్రి అనగానే భయమేసింది!

అనవసర ఆలోచనలు, భయంతో క్రమంగా నా ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. తీవ్ర జ్వరం బాగా వేధించింది. ఎనిమిదో రోజు నా ఆక్సిజన్‌ లెవెల్స్‌ 87 శాతానికి పడిపోయాయి. దీంతో నా భర్త నన్ను ఆస్పత్రికి వెళదామన్నారు. ఆయన అలా అనేసరికి నాలో మరింత భయం మొదలైంది. అలా అని నాకు హాస్పిటల్‌ ఫోబియా ఏం లేదు. కరోనా వల్ల నాలో కలిగిన ఒక రకమైన భయం నన్ను ఆస్పత్రిలో అడుగుపెట్టడానికి వెనకడుగు వేసేలా చేసింది. కానీ రోజురోజుకీ నా ఆరోగ్యం దిగజారిపోతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది’.

నడిచే రోబోల్లా కనిపించారు!

‘ఇక ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యాక నేను ఊహించినట్లే జరిగింది. ఎన్నో వింత అనుభవాలు, కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి. వైద్యులు, నర్సులతో పాటు ఆస్పత్రి సిబ్బంది అంతా పీపీఈ కిట్లు ధరించే ఉన్నారు. ఆస్పత్రిలో వారిని చూస్తుంటే నడిచే రోబోల్లా కనిపించారు. అసలు నా దగ్గరకు ఎవరు వస్తున్నారో... ఎవరు మాట్లాడుతున్నారో కూడా గుర్తుపట్టలేకపోయాను. సాధారణంగా నర్సులు అంటే మహిళలే ఎక్కువగా ఉంటారు. అయితే అక్కడి నర్సింగ్‌ స్టాఫ్‌లో ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనార్హం. పైగా వారికెలాంటి అనుభవం లేదు. అత్యవసర సేవల్లో భాగంగా అప్పుడే వారిని కొత్తగా నియమించుకున్నట్లు తెలిసింది. కొద్ది రోజుల తర్వాత నేనున్న ఫ్లోర్‌ను శానిటైజ్‌ చేసి కరోనా బాధితుల కోసం జనరల్‌ వార్డుగా మార్చేశారు. అంతకుముందే నాతో పాటు ఓ క్యాన్సర్‌ రోగిని ఐసీయూ వార్డుకు తరలించారు’.

వెంటిలేటర్ పెట్టడం మర్చిపోయేవారు!

‘చికిత్సలో భాగంగా కొందరు ఆస్పత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు వాళ్లపై అపనమ్మకం కలిగేలా చేసింది. ఐసీయూలో ఉన్నప్పటికీ ఒక్కోసారి నాకు వెంటిలేటర్‌ను అమర్చడం మర్చిపోయేవారు. మరొకసారి వెంటిలేటర్‌ అమర్చినా ఆక్సిజన్‌ లెవెల్స్‌ను రెగ్యులేట్‌ చేసేవారు కాదు. పైగా ఐసీయూ సిబ్బందిలో కొందరు మమ్మల్ని అంటరానివారిలా భావించేవారు. మందులు, ఆహారం దూరం నుంచే అందించేవారు. అయితే జనరల్‌ వార్డు సిబ్బంది మాత్రం మమ్మల్ని ఎంతో ప్రేమతో చూసుకున్నారు. మా అవసరాలను గుర్తించి సేవలు అందించారు. సాధారణంగా ఆస్పత్రిలో ఉన్నప్పుడు డాక్టర్‌ గురించే మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం. ఆయన అందించే చికిత్స పైనే ప్రధానంగా దృష్టి సారిస్తుంటాం. వీటితో పాటు అక్కడి నర్సింగ్‌ సిబ్బంది మనతో ఎలా వ్యవహరిస్తున్నారన్న విషయం కూడా మన రికవరీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆస్పత్రిలో ఉన్నప్పుడు నాకు ఈ విషయం బాగా అవగతమైంది’.

నాలో సానుకూల దృక్పథాన్ని నింపారు!

‘నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు నా భర్త, ఇద్దరు పిల్లలు హోం ఐసొలేషన్‌లో ఉండిపోయారు. దీంతో వారిని చూసే అవకాశమే లేకుండా పోయింది. నిత్యం వారి ఆలోచనలే వస్తుండేవి. ముఖ్యంగా ‘నా పిల్లలు ఎలా ఉన్నారో? ఏం తింటున్నారో?’ అని తెగ ఆలోచించేదాన్ని. అయితే మా ఆయన ఎప్పటికప్పుడు పిల్లల క్షేమ సమాచారాన్ని నాకు ఫోన్‌లో చెప్తుండేవారు. ‘పిల్లలు క్షేమంగా ఉన్నారు... ఎవరి ప్లేట్లలో వారు తింటున్నారు... ఎవరి దుస్తులు వారు శుభ్రపరచుకుంటున్నారు. కరోనా నుంచి రక్షణ పొందేందుకు అన్ని రకాల స్వీయ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఆన్‌లైన్‌ క్లాసులకు కూడా హాజరవుతున్నారు’ అని ఆయన చెప్పడంతో ఎంతో హ్యాపీగా ఫీలయ్యేదాన్ని. ఇది నాలో ఓ రకమైన సానుకూల దృక్పథాన్ని నింపింది. కరోనా నుంచి త్వరగా కోలుకునేలా చేసింది.

మొత్తమ్మీద నేను చెప్పేదేంటంటే- కరోనా మన దాకా రాదని ఎవరూ అనుకోవద్దు. నేను అలాగే భావించాను. ఇక్కట్ల పాలయ్యాను. కాబట్టి కరోనా పూర్తిగా అంతమయ్యేంత వరకు అప్రమత్తంగా ఉందాం. కనీస జాగ్రత్తలు పాటిద్దాం’ అంటూ చెప్పుకొచ్చిందీ కరోనా యోధురాలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్