అందుకే మెట్లెక్కాలి!

ఆఫీసైనా, ఇల్లైనా పైఅంతస్తులకు వెళ్లడానికి ఎక్కువమంది ఉపయోగించుకునే మార్గం లిఫ్టు. కేవలం ఇక్కడే కాదు.. షాపింగ్ మాల్స్, థియేటర్స్‌కు వెళ్లినప్పుడు కూడా మెట్లకు బదులుగా ఎస్కలేటర్లు, లిఫ్టులు ఉపయోగిస్తాం.

Published : 04 Nov 2023 21:47 IST

ఆఫీసైనా, ఇల్లైనా పైఅంతస్తులకు వెళ్లడానికి ఎక్కువమంది ఉపయోగించుకునే మార్గం లిఫ్టు. కేవలం ఇక్కడే కాదు.. షాపింగ్ మాల్స్, థియేటర్స్‌కు వెళ్లినప్పుడు కూడా మెట్లకు బదులుగా ఎస్కలేటర్లు, లిఫ్టులు ఉపయోగిస్తాం. ఇలా కాళ్లకు పని చెప్పాల్సిన అవసరం లేకుండానే అనుకున్న ఫ్లోర్‌కి క్షణాల్లో చేరుకునేలా సకల సదుపాయాలతో కూడిన టెక్నాలజీ ప్రస్తుతం అభివృద్ధి చెందింది. కానీ ఎప్పుడూ వీటినే ఉపయోగించుకోవడం అటు ఆరోగ్యానికి, ఇటు శారీరక దృఢత్వానికి అంత మంచిది కాదు. రోజులో కొన్నిసార్లైనా వీటిని ఉపయోగించుకోకుండా మెట్లు ఎక్కిదిగడం అలవాటు చేసుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల శరీరంలో అనవసర క్యాలరీలు కరిగి, బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణుల అభిప్రాయం. మరి మెట్లెక్కడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం రండి..

ఎంతసేపు??

అటు ఆరోగ్యంగా, ఇటు ఫిట్‌గా ఉండాలంటే వారానికి మూడు నుంచి ఐదు రోజులు.. రోజూ కనీసం అరగంట పాటు మెట్లెక్కే వ్యాయామం చేయాలంటున్నారు నిపుణులు. ఈ వ్యాయామం చేసేటప్పుడు కూడా షూ ధరించడం చాలా మంచిది. అయితే ఇవి మడమ భాగంలో మందంగా, మెత్తగా, ఫ్లెక్సిబుల్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇలా సౌకర్యవంతంగా ఉంటే మెట్లెక్కినా పెద్దగా ఇబ్బంది ఎదురవకుండా ఉంటుంది.

దృఢమైన కండరాలకు..

శరీరంలోని కండరాలు దృఢంగా, మంచి ఆకృతిలో ఉంటేనే శారీరక దారుఢ్యం సొంతమవుతుంది. మరి ఇది సాధ్యం కావాలంటే రోజూ మెట్లెక్కాల్సిందేనంటున్నారు నిపుణులు. చాలామంది తొడలు లావుగా ఉండి.. మిగిలిన శరీరమంతా నార్మల్‌గా ఉంటుంది. అలాంటి వాళ్లకు రోజూ మెట్లెక్కడం వల్ల మంచి ప్రయోజనాలు అందుతాయి. మెట్లెక్కే క్రమంలో శరీర బరువంతా మోకాళ్లు, తొడ కండరాల పైనే ఎక్కువగా పడుతుంది. దీంతో ఆయా భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోవడంతో పాటు కండరాలు కూడా దృఢంగా మారతాయి. కాబట్టి మంచి శరీరాకృతిని సొంతం చేసుకోవడానికి కూడా మెట్లెక్కే వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది.

క్యాలరీల ఖర్చు..

రోజూ మెట్లెక్కడం వల్ల అనవసర క్యాలరీలు శరీరంలో పేరుకుపోకుండా సులభంగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా బరువు కూడా అదుపులో ఉంటుంది. అలాగే లావుగా ఉన్న వాళ్లు బరువు తగ్గించుకోవాలన్నా లిఫ్టులు, ఎస్కలేటర్లను వదిలి మెట్లను ఆశ్రయించాల్సిందే. మెట్లు ఎక్కడం వల్ల నిమిషానికి ఏడు క్యాలరీల వరకు ఖర్చవుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లు వీలైనంత ఎక్కువగా మెట్లను ఉపయోగించుకోవడం మంచిది.

వేగంగా వద్దు..

మెట్లెక్కడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. తద్వారా గుండెకు రక్తప్రసరణ సరిగ్గా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. అలాగని మరీ వేగంగా కాకుండా సాధారణ వేగంతోనే మెట్లెక్కడం ఉత్తమం. త్వరగా బరువు తగ్గాలని వేగంగా ఎక్కడం వల్ల గుండె కొట్టుకునే వేగం మరింతగా పెరిగి శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మెట్లెక్కేటప్పుడు సాధారణ వేగంతో ఎక్కడం మంచిది.

నిపుణుల సలహా మేరకు..

మెట్లెక్కడం వల్ల ఎన్ని లాభాలున్నా.. గుండె సంబంధిత సమస్యలు, మోకాలు, మడమ, నడుము.. వంటి భాగాల్లో నొప్పి, ఇతరత్రా సమస్యలు ఉన్న వాళ్లు మెట్లెక్కకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ ప్రక్రియ వల్ల ఇలాంటి సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫిట్‌నెస్ ట్రైనర్ సలహా మేరకు మెట్లెక్కడానికి బదులుగా మరో వ్యాయామాన్ని ఎంచుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్