Summer Fruit: ఈ పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

ఆరోగ్యం, అందం, ఫిట్‌నెస్‌.. ఈ మూడు ప్రయోజనాల్ని అందించే పండ్లలో లిచీ ఒకటి. వేసవి కాలంలో విరివిగా లభించే ఈ పండ్లలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు బరువునూ అదుపులో....

Published : 05 Jun 2023 20:52 IST

ఆరోగ్యం, అందం, ఫిట్‌నెస్‌.. ఈ మూడు ప్రయోజనాల్ని అందించే పండ్లలో లిచీ ఒకటి. వేసవి కాలంలో విరివిగా లభించే ఈ పండ్లలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు బరువునూ అదుపులో ఉంచుతాయి. అందాన్నీ ద్విగుణీకృతం చేస్తాయి. పైగా వీటిలో నీటి శాతం కూడా ఎక్కువే! మరి, ఈ పండు తినడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో తెలుసుకుందాం రండి..

ప్రయోజనాలు బోలెడు!

‘సి’, ‘డి’.. వంటి విటమిన్లతో పాటు మెగ్నీషియం, రైబోఫ్లేవిన్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌.. వంటి పోషకాలు అధికంగా ఉండే లిచీ పండును రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

హైపర్‌టెన్షన్‌ సమస్యకు లిచి మంచి విరుగుడు అంటున్నారు నిపుణులు. ఇందుకు దీనిలో ఉండే పొటాషియమే కారణం. ఇది బీపీని అదుపు చేయడంలో సహకరిస్తుంది.

వేసవిలో చాలామంది కడుపుబ్బరం సమస్యతో బాధపడుతుంటారు. దీనికి చెక్‌ పెట్టాలంటే ఫైబర్‌ అధికంగా ఉండే లిచీ పండును తీసుకోవాల్సిందే! ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి.. కడుపుబ్బరంతో పాటు పలు జీర్ణ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది.

లిచీలో ఫైబర్‌, నీటి శాతం ఎక్కువ.. కొవ్వులు, క్యాలరీలు తక్కువ. ఈ సుగుణాలే బరువును అదుపులో ఉంచేందుకు దోహదం చేస్తాయి. తద్వారా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండచ్చు.

లిచీలో ఉండే విటమిన్‌ ‘సి’ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తుంది. తద్వారా వివిధ రకాల అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండచ్చు.

లిచీ పండులో ఉండే ఫ్లేవనాయిడ్స్‌లో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.

ఇతర పండ్లతో పోల్చితే లిచీలో పాలీఫినోల్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, క్యాన్సర్‌-మధుమేహ ముప్పును తప్పించడంలో సహకరిస్తాయి.

ఈ పండులో ఉండే మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, కాపర్‌, మాంగనీస్‌.. వంటి ఖనిజాలు.. మనం తీసుకున్న ఆహారం నుంచి క్యాల్షియంను శరీరం సులభంగా గ్రహించేందుకు తోడ్పడతాయి. ఫలితంగా ఎముకలు దృఢమవుతాయి.

ఆరోగ్యానికే కాదు.. అందానికీ లిచీ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్‌ ‘సి’.. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించి, వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడుతుంది.

కాలుష్యం నుంచి జుట్టును కాపాడి కుదుళ్లకు పోషణనందిస్తుందీ పండు. తద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇందుకోసం లిచీ రసంలో కలబంద గుజ్జు కలుపుకొని కుదుళ్లు, జుట్టుకు పట్టించచ్చు.. లేదంటే పండు తిన్నా, లిచీ జ్యూస్‌ తాగినా ప్రయోజనం ఉంటుంది.

తొక్కలూ వృథా కావు!

లిచీ పండ్లే కాదు.. వాటిపై ఉండే తొక్కలూ వృథా కావంటున్నారు నిపుణులు. అదెలాగంటే..!

లిచీ తొక్కల్ని స్క్రబ్‌గా ఉపయోగించుకోవచ్చు. ఈ క్రమంలో లిచీ తొక్కల్ని ఎండబెట్టి పొడిచేసుకోవాలి. ఇందులో బియ్యప్పిండి, కలబంద గుజ్జు వేసి.. బరకగా పేస్ట్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత కడిగేయాలి. ఈ చిట్కా పాటించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

లిచీ తొక్కల్ని మొక్కలకు ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. ఈ క్రమంలో ఈ తొక్కల్ని కొన్ని నీళ్లలో రోజంతా నానబెట్టాలి. ఆపై దీనికి సమపాళ్లలో నీళ్లు కలుపుకొని.. ఈ మిశ్రమాన్ని మొక్కలపై స్ప్రే చేసుకోవచ్చు. ఇందులో ఉండే పొటాషియం, క్యాల్షియం, మాంగనీస్‌, జింక్‌.. వంటి ఖనిజాలు మొక్కలు ఏపుగా పెరిగేలా చేస్తాయి.

లిచీ తొక్కల పొడికి నిమ్మరసం కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని మాడిపోయిన గిన్నెకు పట్టించి.. కాసేపటి తర్వాత కడిగేయాలి. తద్వారా ఫలితం ఉంటుంది.

గమనిక : లిచీలో చక్కెర శాతం ఎక్కువ. అలాగే ఇది కొంతమందిలో హార్మోన్ల అసమతుల్యతకు కూడా కారణమవుతుందట! అందుకే మధుమేహులు, గర్భిణులు.. వీటిని నిపుణుల సలహా మేరకు మాత్రమే తీసుకోవడం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్