Published : 22/09/2021 16:03 IST

కోడలికి ఇలా అమ్మవ్వండి!

అత్తాకోడళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే నానుడి ఎప్పట్నుంచో ఉంది. పెళ్లయ్యాక కోడలు తన కొడుకును ఎక్కడ కొంగున కట్టేసుకుంటుందోనని అత్తగారు.. అత్త హోదాలో తననెక్కడ రాచి రంపాన పెడుతుందోనని కోడలు.. ఇలా వీళ్లిద్దరి మధ్య ముందు నుంచే ఒక రకమైన అంతర్యుద్ధం మొదలవుతుంది. అయితే ఇది చినికి చినికి గాలి వానలా మారి కుటుంబాలు వేరుపడేదాకా లాగడం కంటే అత్తాకోడళ్లిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని మెలగడం మేలంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. ఈ క్రమంలో కోడలు అత్తను తన తల్లిలా ప్రేమించడం ఎంత ముఖ్యమో.. అత్తగారు కూడా తన కోడలిని కన్న కూతురికంటే ఎక్కువగా చూసుకోవాలంటున్నారు. అంతేకాదు.. తన కోడలికి తానే అన్ని విషయాల్లోనూ రోల్‌మోడల్‌ కావాలని, ప్రతి విషయంలోనూ ఆమెను ప్రోత్సహించాలని అంటున్నారు. మరి, అత్తగారు తన కోడలిని అమ్మలా ఆదరించాలంటే ఇంకా ఏమేం చేయాలి? రండి.. తెలుసుకుందాం..!

కూతురి కంటే ఎక్కువగా..!

అప్పటిదాకా పుట్టింట్లో గారాబంగా పెరిగిన అమ్మాయి మెట్టినింట్లో అడుగుపెట్టే క్రమంలో ఒక రకమైన భయాందోళనలకు లోనవడం సహజం. అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో, అత్తింటి వాళ్లు తనతో ఎలా మెలగుతారో, వాళ్ల ఇష్టాయిష్టాలేంటో, నేను ఆ ఇంట్లో ఇమడగలనో లేదో.. ఇలా ఎన్నో సందేహాలు కొత్త కోడలి మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇలాంటి సమయంలోనే అత్తగారు ఓ అమ్మలా తన కోడలికి భరోసా ఇవ్వాలంటున్నారు నిపుణులు. ‘ఇదీ నీ పుట్టిల్లు లాంటిదే.. ఇక నుంచి నేనే నీకు అమ్మను.. ఇక్కడ నీకు నచ్చినట్లు ఉండచ్చు..’ అంటూ ఆమెలో ఉన్న బిడియాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. ఇలాంటి మాటలు కోడలికి కలుపుగోలుతనాన్ని అలవాటు చేస్తాయి. ఇప్పటిదాకా మీ అమ్మగారితో ఎలాగైతే కష్టసుఖాలు పంచుకునేదానివో.. వాటిని ఇకపై నాతో నిర్మొహమాటంగా పంచుకోవచ్చన్న ధైర్యాన్ని కోడలిలో నింపాలి. అత్తగారి మనసు లోతుల్లో నుంచి వచ్చే ఈ మాటలు కొత్త కోడలికి పుట్టింటిపై ఉన్న బెంగను దూరం చేసి.. మెట్టినింటినే పుట్టింటిలా భావించేలా చేస్తాయనడంలో సందేహం లేదు.

మీరే మార్గదర్శి!

ఆడపిల్లలు చిన్నతనం నుంచి చాలా విషయాల్లో అమ్మనే అనుసరిస్తుంటారు. చదువు-ఉద్యోగం, వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌, గౌరవమర్యాదలు, కోడలిగా తాను నిర్వర్తించే బాధ్యతలు, పిల్లల్ని పెంచిన విధానం.. ఇలా ప్రతి విషయంలోనూ తల్లుల ప్రభావం తమ కూతుళ్లపై ఉంటుంది. అయితే ఇవన్నీ చూస్తూ పెరిగిన కూతుళ్లు తామూ పెళ్లి తర్వాత తన తల్లిలా మెట్టినింటి వారితో కలిసిపోవాలని అనుకుంటుంటారు. అయితే మెట్టినింట్లో అడుగుపెట్టాక ఇకపై అత్తగారే అన్నీ కాబట్టి.. ఈ క్రమంలో కోడలికి ఆమే మార్గదర్శి కావాలంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా.. తమ తరఫు బంధాలు-బంధుత్వాలు, తమ ఆచారవ్యవహారాలు-సంప్రదాయాలు, కొత్త కాపురంలో ఎదురయ్యే సవాళ్లు - వాటిని ఎదుర్కొనే విధానం, ఇతర కుటుంబ సభ్యులతో కలుపుగోలుగా ఎలా మెలగాలి?.. వంటివన్నీ అత్తగారే కొత్త కోడలికి మార్గనిర్దేశనం చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఇలాంటి విషయాల్లో మీకున్న అనుభవాలను కూడా కోడలితో పంచుకోవచ్చు. ఫలితంగా ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది.. మెట్టినింట్లో అత్తాకోడళ్ల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఇదే కీలకం..!

ప్రశంసిస్తే పోయేదేముంది!

మెట్టినింట్లో కొత్త కోడలికి మొదట్లో అన్ని విషయాలూ కొత్తగానే అనిపిస్తాయి. అత్తింటి వాళ్ల అభిరుచులేంటో, వాళ్లకు ఎలా వండితే నచ్చుతుందో, ఏవైనా సమస్యలొస్తే మధ్యలో కలగజేసుకొని పరిష్కారం చెప్పడం మంచిదో, కాదో.. ఇలాంటి సందేహాలు కోడలి మనసులో బోలెడుంటాయి. అయితే ఈ క్రమంలో అత్తగారు కోడలిపై కురిపించే ప్రశంసలు ఇద్దరి మధ్య దూరాన్ని దగ్గర చేస్తాయంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. కోడలు చేసిన కొత్త వంటకం మీకు నచ్చినా, మీ సమస్యలకు తనొక మంచి పరిష్కార మార్గం చూపినా, మిమ్మల్ని-ఇతర కుటుంబ సభ్యుల్ని తను ప్రేమగా చూసుకున్న తీరు నచ్చినా.. ఆ ఆనందాన్ని మనసులో దాచుకోవడం కంటే.. ఆమెను ప్రశంసించి చూడండి.. తనెంతో హ్యాపీగా ఫీలవుతుందో ప్రత్యక్షంగా చూడచ్చు. కాబట్టి ‘కోడలిగా ఆ మాత్రం చేయడం తన బాధ్యత!’ అని కొట్టి పారేయకుండా.. ఇలా పాజిటివ్‌గా ప్రశంసించి చూడండి.. ఫలితంగా అత్తాకోడళ్ల మధ్య అనురాగం క్రమక్రమంగా మెరుగుపడడం ఖాయం!

అన్నింట్లోనూ తోడుగా..!

పెళ్లికి ముందు ఉద్యోగం చేసినా, పెళ్లి తర్వాత అత్తింటి వాళ్లు ఒప్పుకోలేదన్న నెపంతో చాలామంది అమ్మాయిలు ఉద్యోగం మానేస్తుంటారు. అది కూడా తమ మనసుకు ఇష్టం లేకపోయినా! మరి, మీరూ మీ కోడలి విషయంలో ఇంత కటువుగా ఉన్నారా? అయితే వెంటనే మీ ప్రవర్తన మార్చుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే మెట్టినింట్లో తల్లిలా అన్నింట్లో ప్రోత్సహించాల్సిన మీరే మీ కోడలిని నిరుత్సాహపరిస్తే ఎలా? కాబట్టి ఒక్క ఉద్యోగం విషయంలోనే అని కాదు.. వ్యాపారం, కుటుంబ బాధ్యతలు, ఇతర విషయాల్లోనూ కోడలిని ప్రోత్సహించాలి. వాళ్లు తమ వృత్తిప్రవృత్తుల్ని సమర్థంగా నిర్వర్తించేలా అండగా నిలవాలి. ఇంటిని, పనిని బ్యాలన్స్‌ చేసుకునే క్రమంలో తనపై ఒత్తిడి పడకుండా కొన్ని పనులు/బాధ్యతల్ని మీరూ మీ కోడలితో సమానంగా పంచుకోవడంలో తప్పు లేదు. ఇలా అత్తింటి వారి అండదండలుండి అటు కెరీర్‌లో, ఇటు ఇతర విషయాల్లో విజయం సాధించిన కోడళ్ల గురించి అప్పుడప్పుడూ వింటుంటాం. కాబట్టి కోడలి సక్సెస్‌లో మీరూ తల్లిలా పాలుపంచుకోండి.. కుటుంబ అభివృద్ధిలో ఆమెకు అండగా నిలవండి.

గొడవ పడినా కలిపేయండి!

భార్యాభర్తల మధ్య వచ్చే గొడవల్లో మూడో వ్యక్తి కలగజేసుకోవడం కరక్ట్‌ కాదంటారు. అయితే కొన్ని సీరియస్‌ విషయాల్లో మాత్రం అత్తగారు తన కొడుకు-కోడలికి సర్దిచెప్పడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు. అసలే కొత్త కాపురం.. దంపతులిద్దరూ ఒకరి ఇష్టాయిష్టాలతో, అభిరుచులతో మరొకరు ఇమడలేకపోవచ్చు. ఇందుకు కాస్త సమయం పట్టచ్చు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కొన్ని గొడవలు, పొరపచ్ఛాలు దొర్లచ్చు. కాబట్టి ఇలాంటి సమయంలో ఇద్దరికీ సర్దిచెప్పే బాధ్యతను అత్తయ్యలు తమ భుజాలపై వేసుకోవాలి. అలాగని పూర్తిగా తన కొడుకు పక్షం, లేదంటే కోడలి పక్షం వహించకుండా.. అసలు తప్పెవరిదో తెలుసుకొని దాన్ని బట్టి ఇద్దరి మధ్యా సఖ్యత కుదర్చాలి.

అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఎంత కలుపుగోలుగా ఉన్నా అత్తాకోడళ్ల మధ్య కూడా కొన్ని సార్లు చిన్న చిన్న గొడవలు రావడం సహజం. ఇలాంటి సమయంలో భర్తలు కలుగజేసుకోవడం సబబు కాదంటున్నారు నిపుణులు. కాబట్టి అత్తాకోడళ్లే మాట్లాడుకొని తమ గొడవను సద్దుమణిగేలా చేసుకుంటే అది మరింత పెద్దది కాకుండా ఉంటుంది. అత్తైనా, కోడలైనా తమ తప్పు తెలుసుకొని.. పెద్దా చిన్నా తారతమ్యం లేకుండా ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుంటే సరిపోతుంది.

ఇదేవిధంగా కోడళ్లు కూడా తమ అత్తగారిని అమ్మలా ప్రేమించాలి.. అప్పుడే అత్తాకోడళ్ల మధ్య మంచి అవగాహన, అనుబంధం ఏర్పడుతుంది. నిజానికి అత్తాకోడళ్లందరూ ఇలా కలిసిపోతే ఈ వేరు కాపురాలు, విడాకులు, గృహహింస.. వంటివేవీ ఉండవు. ఆ కుటుంబంలో అందరి మధ్య అనుబంధాలు వెల్లివిరుస్తాయి కూడా! మరి, మీరేమంటారు?!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని