వర్షాకాలంలో షూస్ ఇలా శుభ్రం చేయండి...

వానాకాలంలో కురిసే చినుకులు మనసుకి హాయి కలిగించినా పాదాలకు మాత్రం ఇబ్బందులు తెచ్చిపెట్టడం సహజం. రోడ్డుపై చేరే బురద, మట్టి.. వంటివి పాదాలకు, పాదరక్షలకు అంటుకుంటే వాటి నుంచి ఇన్ఫెక్షన్లు చాలా సులభంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. పైగా వర్షం నీటిలో ఎక్కువ సమయం పాదరక్షలు తడిస్తే వాటి నాణ్యత కూడా దెబ్బతిని తొందరగా పాడైపోతాయి.

Published : 06 Sep 2021 18:27 IST

వానాకాలంలో కురిసే చినుకులు మనసుకి హాయి కలిగించినా పాదాలకు మాత్రం ఇబ్బందులు తెచ్చిపెట్టడం సహజం. రోడ్డుపై చేరే బురద, మట్టి.. వంటివి పాదాలకు, పాదరక్షలకు అంటుకుంటే వాటి నుంచి ఇన్ఫెక్షన్లు చాలా సులభంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. పైగా వర్షం నీటిలో ఎక్కువ సమయం పాదరక్షలు తడిస్తే వాటి నాణ్యత కూడా దెబ్బతిని తొందరగా పాడైపోతాయి. ముఖ్యంగా షూస్ విషయంలో అయితే వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో షూస్ ఎలా శుభ్రం చేసుకోవాలి? వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?.. వంటి అంశాల గురించి తెలుసుకోవడం తప్పనిసరి. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

మురికి తొలగిస్తూ..

వర్షాకాలంలో రహదారులపై చేరే బురద బూట్ల అడుగుభాగంలో అంటుకొని ఉండిపోతుంది. వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే.. ఫంగస్ చేరి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. పైగా వాటిని పాదాలకు తొడుక్కున్నప్పుడు ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశాలు కూడా లేకపోలేవు. అందుకే ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మెత్తని బ్రష్ ఉపయోగించి షూపై చేరిన మురికిని పూర్తిగా తొలగించాలి. వాటిని తిరిగి మంచినీటితో శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.

పూర్తిగా ఆరేలా..

వర్షపు నీటిలో తడిసిన చెప్పులు లేదా షూస్‌ను పూర్తిగా ఆరిన తర్వాతే వాటిని షూకేస్‌లో భద్రపరచాలి. లేదంటే వాటిపై ఫంగస్ చేరి ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశాలున్నాయి. కేవలం షూ లోపలి వైపు తడి ఆరితే సరిపోదు. బాగా పొడిగా ఆరనివ్వాలి. దీనికోసం టిష్యూపేపర్‌ని షూ లోపలి భాగంలో పెట్టి.. నీటిని పూర్తిగా పీల్చుకొనేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత దాన్ని బయటకు తీసేయాలి. పూర్తిగా ఆరేంతవరకు ఇలాగే చేయాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా టాల్కం పౌడర్ చల్లాలి. ఇది లోపలి భాగంలో మిగిలిపోయిన తేమను పీల్చేస్తుంది. ఇలా వారానికి రెండు నుంచి మూడుసార్లు చేయడం ద్వారా వర్షాకాలంలో షూ పాడవకుండా కాపాడుకోవచ్చు.

పాలిష్ చేస్తూ..

నీటిలో ఎక్కువ సేపు తడవడం వల్ల షూ మెరుపు తగ్గిపోతుంది. అందుకే షూస్‌ని ఎప్పటికప్పుడు పాలిష్ చేయడం తప్పనిసరి. దీనివల్ల అవి కొత్త మెరుపును సంతరించుకోవడంతోపాటు.. బూట్ల పై భాగాన్ని తేమ నుంచి సంరక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందుకు షూ వ్యాక్స్‌ని ఉపయోగించినా ఇదే ఫలితం కనిపిస్తుంది. అయితే దీనికోసం నాణ్యమైన ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది.

ఆకృతి కోల్పోకుండా..

నీటిలో ఎక్కువ సేపు తడిస్తే ఒక్కోసారి బూట్ల ఆకృతిలో మార్పు వచ్చి వేసుకోవడానికి వీలుగా లేకుండా అయిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే షూస్‌ని శుభ్రం చేసిన తర్వాత కాగితాలను ఉండలుగా చుట్టి షూ లోపల పెట్టాలి. మార్కెట్లో సైతం బూట్ల ఆకృతి మారకుండా చేసే షూట్రీస్ లభ్యమవుతున్నాయి. వాటిని కూడా ఇందుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.

లెదర్ షూస్ విషయంలో..

మిగిలిన వాటితో పోలిస్తే లెదర్ షూస్ భద్రపరిచేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిపై ఫంగస్ చాలా త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని కొన్ని గంటల పాటు గాలికి ఆరనివ్వాలి. ఆ తర్వాత లిక్విడ్ సోప్‌ని కొద్దిగా నీటిలో కలపాలి. దీనిలో బ్రష్‌ని ముంచి దాంతో షూస్‌ని శుభ్రం చేయాలి. పూర్తిగా ఆరేంత వరకు వాటిని ఎండలో ఉంచాలి. సూర్యరశ్మి కారణంగా షూపై చేరిన క్రిములు పూర్తిగా నాశనమవుతాయి. ఆ తర్వాత పాలిష్ అప్త్లె చేస్తే లెదర్ బూట్లు పాడవకుండా ఉంటాయి.

అయితే రోజూ షూస్ ధరించేవారు మాత్రం వర్షాకాలంలో కాస్త ఎక్కువ జతలను కొనుగోలు చేసి ఉపయోగించడం మంచిది. వర్షాల కారణంగా తడిసిన షూ ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి వేరే జత ధరించే సౌలభ్యం ఉంటుంది. ఫలితంగా ఇన్పెక్షన్స్ వంటివి దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్