తలలో దురద.. తగ్గాలంటే..!

ఎక్కువ రోజులు నూనె రాసుకోకపోవడం వల్ల మాడు పొడిబారిపోవడం, చుండ్రు, పేలు.. ఇలా పలు కారణాల వల్ల తలలో విపరీతమైన దురద పుడుతుంది. దీనివల్ల ఎప్పుడు చూసినా చేతులు తలలోకే వెళ్తుంటాయి. ఈ సమస్య తీవ్రమైతే జుట్టు పటుత్వం కోల్పోయి రాలిపోయే ప్రమాదం ఉంటుంది.

Published : 14 Mar 2024 14:13 IST

ఎక్కువ రోజులు నూనె రాసుకోకపోవడం వల్ల మాడు పొడిబారిపోవడం, చుండ్రు, పేలు.. ఇలా పలు కారణాల వల్ల తలలో విపరీతమైన దురద పుడుతుంది. దీనివల్ల ఎప్పుడు చూసినా చేతులు తలలోకే వెళ్తుంటాయి. ఈ సమస్య తీవ్రమైతే జుట్టు పటుత్వం కోల్పోయి రాలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మొదట్లోనే సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టాలి. దీనికీ కొన్ని సహజసిద్ధమైన మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం రండి...

నూనె రాస్తున్నారా?

కొంతమంది సమయం లేకనో లేదంటే జిడ్డుగా కనిపించకూడదనే ఉద్దేశంతోనో.. తలకు నూనె రాయరు. దీంతో కుదుళ్లు పొడిబారిపోయి దురదకు దారి తీస్తుంది. అలాగే జుట్టు కూడా నిర్జీవమైపోతుంది. ఫలితంగా కుదుళ్లు, జుట్టు.. రెండూ ఆరోగ్యాన్ని కోల్పోతాయి. అందుకే కొబ్బరి, బాదం, ఆలివ్.. వంటి సహజసిద్ధంగా లభించే నూనెలను తగిన మొత్తంలో కనీసం వారానికోసారైనా రాసుకోవాలి. దీనివల్ల దురద తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు జుట్టు కూడా పట్టులా మెరుస్తుంది.

మసాజ్ చేయాలి

కుదుళ్లకు సరైన రక్తప్రసరణ లేకపోవడం వల్ల కూడా మాడు ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి నూనె రాసుకునే ముందు దాన్ని కాస్త గోరువెచ్చగా చేసుకుని దాంతో మాడుపై కాసేపు మసాజ్ చేయాలి. దీంతో కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరిగి దురద క్రమంగా తగ్గుముఖం పడుతుంది. నూనె రాసిన తర్వాత జిడ్డుగా ఉంది అనిపిస్తే.. గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే తేడా మీకే తెలుస్తుంది.

తడిగా వద్దు..

చాలామంది తలస్నానం చేసిన తర్వాత జుట్టు పూర్తిగా ఆరకముందే గట్టిగా జడ వేసుకోవడం లేదంటే రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. దీనివల్ల జుట్టు మొదట్లో పూర్తిగా ఆరదు. దీంతో ఆ ప్రదేశంలో ఫంగస్ చేరే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి సందర్భాల్లో కూడా దురద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జుట్టు పూర్తిగా ఆరిపోకముందే గట్టిగా కట్టుకోవడం కాకుండా వదులుకోవడం లేదా చిన్న క్లిప్ పెట్టుకోవడం మంచిది.

ఆహారం కూడా ముఖ్యమే!

తల్లో దురద తగ్గించడంలో ఆహారానిది కూడా కీలక పాత్రే. ఈ క్రమంలో- మైక్రోన్యూట్రియంట్లు అధికంగా లభించే పండ్లు, కూరగాయలు, నట్స్.. వంటివి రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనివల్ల కుదుళ్లు ఆరోగ్యంగా తయారై జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. దురద కూడా తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్