అల్లరి గడుగ్గాయిలను అదుపు చేద్దామిలా..!

ఇలాంటి చిచ్చరపిడుగులను ప్రస్తుతం చాలామంది ఇళ్లలో చూస్తూనే ఉంటాం. సాధారణంగా చిన్నారులు ఎదిగే కొద్దీ పెద్దలు చెప్పే మాటలు వింటూ బుద్ధిగా నడుచుకుంటారు. కానీ కొందరు మాత్రం అసలు పెద్దవాళ్లు చెప్పే మాటలేవీ పట్టించుకోరు. ముఖ్యంగా ఇలా అత్యుత్సాహం ప్రదర్శించే పిల్లతైతే మరీనూ!

Published : 27 Aug 2021 20:12 IST

నాలుగేళ్ల చింటు ఒక్కచోట కూర్చోడు.. కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూనే ఉంటాడు..

ఆరేళ్ల సుచిర ఎప్పుడు చూసినా వసపిట్టలా వాగుతూనే ఉంటుంది..

ఇక ఎనిమిదేళ్ల వర్షిత చేసే అల్లరికి అడ్డు-అదుపు ఉండదంటే అతిశయోక్తి కాదు..

ఇలాంటి చిచ్చరపిడుగులను ప్రస్తుతం చాలామంది ఇళ్లలో చూస్తూనే ఉంటాం. సాధారణంగా చిన్నారులు ఎదిగే కొద్దీ పెద్దలు చెప్పే మాటలు వింటూ బుద్ధిగా నడుచుకుంటారు. కానీ కొందరు మాత్రం అసలు పెద్దవాళ్లు చెప్పే మాటలేవీ పట్టించుకోరు. ముఖ్యంగా ఇలా అత్యుత్సాహం ప్రదర్శించే పిల్లతైతే మరీనూ! మరి, వారిని అదుపు చేసే మార్గాలేంటి? తిరిగి వారిని దారిలో పెట్టడం ఎలా?? తెలియాలంటే ఇది చదవాల్సిందే..

కొంతమంది పిల్లలు బుద్ధిగా ఉంటూ పెద్దలు చెప్పినట్లు వింటూ నిదానంగా నడుచుకుంటారు. ఇంకొందరు ఉత్సాహంగా ఉంటూ పెద్దలు చెప్పిన మాటలు వింటూనే తమని తాము సంతోష పరుచుకుంటారు. మరికొందరు చిన్నారులు మాత్రం ఎవరు ఏం చెప్పినా వినకుండా తమ పని తమది అన్నట్లుగా అల్లరి చేస్తూనే ఉంటారు. అయితే ఇదేమీ అంత ప్రతికూలంగా ఆలోచించాల్సిన విషయం కాదు. కాస్త శ్రద్ధ వహించి, వారిని సరైన దారిలో పెడితే ఇలాంటి చిన్నారులు అద్భుతాలు సృష్టించగలరు.

ఈ లక్షణాలు ఉన్నాయా?

* చెప్పిన మాట వినకపోవడం.

* ఒక దగ్గర కూర్చుని ఉండేందుకు ఆసక్తి చూపకపోవడం.

* ఎప్పుడు చూసినా మాట్లాడుతూ ఉండడం, ఇతరులు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో అంతరాయం కలిగించడం.

* ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోకపోవడం.

* అలసట తెలియకుండా ఆటలాడడం, అల్లరి చేయడం.. మొదలైనవి.

ఇలాంటి లక్షణాలున్న పిల్లలను అత్యుత్సాహవంతులని చెప్పచ్చు. అయితే వీరు ఎంత ఎనర్జిటిక్‌గా కనిపిస్తారో అంతే త్వరగా బాధపడడం, ఆందోళన చెందడం, కోపం తెచ్చుకోవడం.. వంటివి కూడా చేస్తారు. నిజానికి ఇలాంటి చిన్నారుల మీద కాస్త ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఓపికతో చెబుతూ ఆ ఉత్సాహాన్ని సరైన దారిలో పెడితే చాలు.. వీరు కూడా అందరు పిల్లల్లానే బుద్ధిగా నడుచుకుంటారు.

ఆలోచనలపై దృష్టి సారించేలా..

హుషారుగా ఉండే పిల్లల్లో శక్తిస్థాయులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అలాగే వారి ఆలోచనల్లో పదునుదనం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే చిన్నారుల్లో ఉన్న ఈ శక్తిస్థాయులనే వారు సరైన క్రమంలో ఉపయోగించగలిగేలా చేస్తే చాలు..! దీనికోసం వారి బుర్రకి పని చెప్పే ఆటలు, సృజనాత్మకతతో కూడుకున్న అంశాలు బోధించడం, కొత్త విషయాలు నేర్పించడం.. మొదలైనవి చెప్పి చూడండి. ఫలితంగా వారు ఆ పనుల మీద దృష్టి సారించే క్రమంలో అల్లరి తగ్గిస్తారు. అలాగే విశ్లేషణాత్మకమైన ఆలోచనాసరళిని చిన్నప్పట్నుంచే అలవరుచుకుంటారు. ఇది వారి బంగారు భవితకు తప్పకుండా ఉపయోగపడుతుంది.

అరవద్దు..!

చెప్పిన మాట విననప్పుడు చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని కోప్పడడం, వారిపై అరవడం వంటివి చేస్తుంటారు. అయితే ఎక్కువగా అల్లరిచేసే ఇలాంటి గడుగ్గాయిల విషయంలో మాత్రం అలా అరవడం సరికాదు. వారికి ఏ విషయం గురించి చెప్పాలనుకున్నా అది చాలా నిదానంగా, సౌమ్యంగానే చెప్పాల్సి ఉంటుంది. ఫలితంగా వారు చేసే పని ఆపి మరీ మీరు ఏం చెబుతున్నారా అని వినే ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా గట్టిగా అరవడం వల్ల వారు ఖాతరు చేయరు సరికదా.. ఇంకాస్త ఎక్కువగా అల్లరి చేసే అవకాశం ఉంటుంది.

పక్కా ప్రణాళికతో..

పిల్లలకు సాధ్యమైనంత మేరకు రోజులో ఎప్పుడు, ఏం చేయాలనేది తల్లిదండ్రులే ప్రణాళికలు వేసి అందిస్తుంటారు. కాబట్టి మీరు కూడా మీ చిన్నారి ఆలోచనలను సక్రమమైన పనులపై మళ్లించేలా కార్యాచరణ రూపొందించండి. అందులో వారికి ఇష్టమైన లేదా ఆసక్తికరంగా అనిపించే అంశాలను కూడా చేర్చండి. ఈ క్రమంలోనే పార్కు లేదా నిర్మలమైన ప్రకృతిలో కాసేపు నిశ్శబ్దంగా సేదతీరడం, పుస్తకాలు చదవడం.. మొదలైన అలవాట్లు వారికి అలవడేలా చేయండి. ఇవి కాలక్రమేణా వారి ప్రవర్తనలో తప్పకుండా మంచి మార్పు తీసుకొస్తాయి.

ఈ జాగ్రత్తలు కూడా..

* చిన్నారులు బాగా అల్లరి చేస్తున్నప్పుడు మీరు సహనం కోల్పోకుండా ఉండడం

* ఉదయాన్నే సంపూర్ణంగా పోషకాలు అందేలా చక్కని అల్పాహారం అందించడం

* ధ్యానం లేదా యోగా వంటివి నేర్పించడం

* సరిపడినంత సమయం వారు నిద్రపోయేలా చేయడం.. మొదలైన చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించడం ద్వారా చిన్నారులను చక్కగా తీర్చిదిద్దవచ్చు. ఇవన్నీ చేసినా మీ పిల్లల్లో మార్పు రాలేదంటే నిపుణులను సంప్రదించి బిహేవియర్ థెరపీ ఇప్పించడం కూడా మంచిదే!

బిజీగా ఉండేలా చేయండి..

* కరాటే/ మార్షల్ ఆర్ట్స్

* ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, బేస్‌బాల్, బ్యాడ్మింటన్.. మొదలైన అవుట్‌డోర్ గేమ్స్

* మెదడుకి ప్రశాంతతనిచ్చే సంగీతం

* ఈతకొట్టడం

* ఆలోచనలకు సంబంధించిన ఆటలు.. మొదలైన వాటి ద్వారా వారికి శారీరకంగా, మానసికంగా తీరిక లేకుండా చేయచ్చు. ఫలితంగా పిల్లలు కూడా తమ ఆలోచనలను పనులు/ ఆటల మీదకు మళ్లిస్తారే తప్ప అల్లరి చేయరు. ఫలితంగా వారి ప్రవర్తనలో మార్పు రావచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్