ష్.. పిల్లల ముందు ఆ పనులు వద్దు..!

చాలా సున్నితమైన విషయం ఇది. తల్లిదండ్రులుగా మనం చర్చించడానికి ఇష్టపడం కూడా! పెద్దవాళ్లుగా మనం పట్టించుకోని ఎన్నో విషయాలు.. వాళ్లపై తీవ్ర వ్రభావం చూపిస్తాయి. మనం వూహించనైనా లేని అసహజ ప్రవర్తనలకు దారితీస్తాయి..!

Published : 19 Oct 2021 18:18 IST

చాలా సున్నితమైన విషయం ఇది. తల్లిదండ్రులుగా మనం చర్చించడానికి ఇష్టపడం కూడా! పెద్దవాళ్లుగా మనం పట్టించుకోని ఎన్నో విషయాలు.. వాళ్లపై తీవ్ర వ్రభావం చూపిస్తాయి. మనం వూహించనైనా లేని అసహజ ప్రవర్తనలకు దారితీస్తాయి..! అవేమిటో.. వాటికి పరిష్కారాలేమున్నాయో చెబుతున్నారు నిపుణులు.

అసలు పుట్టిన ప్రతి శిశువు మెదడులోనూ.. లైంగికపరమైన బీజాంకురాలు ఉంటాయంటారు శాస్త్రవేత్తలు! అవి మిగతా విషయాలకన్నా లైంగికపరమైన దృశ్యాల్ని, శబ్దాల్ని, చేష్టల్ని, సుఖాలని మెదడు ఎక్కువగా గ్రహించేలా చేస్తాయి. ఎందుకంటే.. మానవ పరిణామంలో ఇదో భాగమన్నదే సమాధానం! మూడు, నాలుగేళ్లు వచ్చాక ప్రసార మాధ్యమాలు చూసి అందులోని హీరోహీరోయిన్‌లలా ప్రవర్తించడం, తోటి పిల్లల్ని కౌగిలించుకోవడం, ముద్దాడటం లాంటివి చిన్నప్పుడే పడ్డ అలాంటి విషబీజాలకు సంకేతాలే. ఇవే కాదు.. కొందరు పిల్లలు చేతుల్తో కానీ, ఇంకేదైనా వస్తువుతో కానీ జననాంగాలను ప్రేరేపించుకుని స్వయంతృప్తి పొందుతుంటారు. ఇది తల్లిదండ్రుల్ని తీవ్ర ఆందోళనలకు గురిచేసే విషయమే కాదు.. ఓ అసాధారణ (అబ్‌నార్మల్) అంశం కూడా.

ఎందుకంటే...

టీనేజీలో హార్మోన్‌ల ప్రభావాల కారణంగా లైంగిక కోరికలు మొదలవుతాయి. ఆ ప్రభావంతో 98 శాతం టీనేజర్లు ఏదోరకంగా స్వయంతృప్తికి అలవాటుపడిపోతారు. ఇది చాలా సహజమైన విషయం. మరి చిన్నారుల్లో మాత్రం దీన్ని అసాధారణ అంశంగా ఎందుకు చూడాలి? అన్న ప్రశ్న ఎదురు కావచ్చు. ఎందుకంటే వాళ్లని ఇక్కడ స్వయంతృప్తికి ప్రేరేపించేవి హార్మోన్‌లు కావు కాబట్టి. పుట్టిన ఏడాదిలోనే వాళ్ల కంట్లో పడ్డ కొన్ని దృశ్యాలు, ఎదురైన కొన్ని స్పర్శలు ఓ విషబీజంలా రహస్యంగా ఎదిగి ఇలా 'స్వయంతృప్తి'గా బయటకొస్తాయి కాబట్టి! నిజానికిది తప్పని వాళ్లకు తెలియదు. ఓ చాక్లెట్ తింటే నోరంతా ఎంత తియ్యగా ఉంటుందో.. మళ్లీ మళ్లీ అదే కావాలని ఎలా కోరుకుంటారో దీన్ని కూడా అంతే అమాయకంగా కోరుకుంటారు. కానీ దీనిపై అవగాహన లేని తల్లిదండ్రులు కొట్టి, తిట్టి సమస్యని మరింత జటిలం చేస్తారు. అసలు ఇలాంటి ప్రవర్తనలకు మూలాలు ఎక్కడున్నాయో వెతకరు.

నెలలప్పుడే తెలుసు!

వీటికి మూలమైన విషబీజం కూడా నెలల వయసులోనే పడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రవర్తన ఇందుక్కారణం అవుతుంది. నెలల పసికందులకు ఏమీ తెలియదు అనుకునే తల్లిదండ్రులు కొందరు పిల్లలు పక్కనుండగానే లైంగికచర్యకు పాల్పడుతుంటారు! నెలల వయసులో పసికందుకి తల్లిదండ్రుల చర్యలేమిటో యథాతథంగా అర్థం కాదన్నది.. నిజమే! కానీ.. ఆ దృశ్యాలన్నీ వాళ్ల మనసులో ఓ చెడు విత్తనంలా పడిపోతాయి. రహస్యంగా ఎదుగుతాయి. లైంగిక వాంఛగా మారతాయి! మూడునాలుగేళ్ల వయసుకొచ్చేసరికి అది అసహజ ప్రవర్తనగా మితిమీరితే స్వయంతృప్తి అలవాటుగా పరిణమిస్తుంది. అంతేకాదు ఆ వయసులో తల్లిదండ్రుల లైంగిక ప్రవర్తనని చూస్తే దాని ప్రభావం వాళ్లపై తీవ్రంగా ఉంటుంది. మూడునాలుగేళ్ల వయసొచ్చాక తల్లిదండ్రుల లైంగిక చర్యను చూడటం కలిగించే దుష్ప్రభావం చాలా పెద్దది. ఇది వారి వ్యక్తిత్వాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇలాంటి వారిలో 'యాంగ్జైటీ న్యూరోసిస్' వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ఇంకెవర్నైనా ఇలా రహస్యంగా చూడాలనే ఉబలాటాన్ని పెంచుతుంది. ఇలా చేసేవాళ్లనే 'పీపింగ్ టామ్స్‌' అంటారు.

మనమేం చేయాలి?

రెండు నెలల నుంచే...

పుట్టిన రెండు నెలల నుంచే పిల్లల్ని మీ పడకకి దూరంగా ఉంచాలి. మొదట ఓ పదడుగుల దూరంలో వేరే మంచంలో లేదా ఉయ్యాలలో వేయండి. మెల్లగా ఆ దూరం పెంచుకుంటూ వెళ్లండి. పాప నిద్రలేచి ఏడుస్తున్నప్పుడో.. పాలు ఇవ్వాలనుకున్నప్పుడో మాత్రమే తల్లి దగ్గరకు వెళితే చాలు. రెండేళ్లు వచ్చినప్పటి నుంచి వారిని వేరే గదిలోనే పడుకోనివ్వాలి. ఆ గదిని బొమ్మలతో చక్కగా అలంకరించి వారు సొంత గదికి వెళ్లడాన్ని ఓ చిన్నపాటి వేడుకలా నిర్వహించాలి. మన దేశంలో అందరూ ప్రత్యేక గదులు కేటాయించలేరు. అందుకే కొంతవయసు వరకైనా పడగ్గదిలో ఓ తెరలాంటిది కట్టి పిల్లల్ని వేరుచేసి తీరాలి. అంతేకాదు.. మీ పర్యవేక్షణలోనే పిల్లలు టీవీ, సినిమాలు చూసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రేమాభిమానాలు వద్దని కాదు...

భార్యాభర్తల మధ్య ప్రేమ స్పందన మూడురకాలుగా ఉంటుంది. ఒకటి.. అభిమానం చూపడం. 'శభాష్' అని భుజం తట్టడం, లాలనగా చేతులు పట్టుకోవడం దీనికిందకు వస్తాయి. రెండోది.. ప్రేమ ప్రదర్శించడం. ఎదుటివారి భుజంపై తలవాల్చడం, ఒకరి ఒడిలో ఒకరు పడుకుని మాట్లాడటం, చేతిని ముద్దాడటం ఇలాంటివే! మూడోది.. లైంగికపరమైన ప్రవర్తన. కోరికతో కౌగిలించుకోవడం, ముద్దులాడటం వంటివన్నీ దీని కిందకు వస్తాయి. మూడోరకం తప్ప.. మిగతా రెండూ పిల్లల ముందు చేయడంలో తప్పులేదు. పిల్లల ఎదుట తల్లిదండ్రులు అన్యోన్యంగా.. ప్రేమాభిమానాలతో ఉండటం వాళ్ల మానసిక ఎదుగుదలకు చాలా మంచిది కూడా!

దానిని మీరు గమనిస్తే..

చిన్నారులు స్వయంతృప్తి పొందడం మీరు గమనిస్తే.. పెద్దగా అరవకండి. తిట్టి, కొట్టడాలు అసలొద్దు. అలా చేస్తే అది రెండు రకాలుగానూ చెడు చేస్తుంది. ఒకటి.. మీకు తెలియకుండా రహస్యంగా ఇంకెక్కడైనా చేస్తారు. అది తరగతి గది దాకా కూడా వెళ్లొచ్చు! దీనివల్ల టీచర్లు, మిగతా పిల్లలు వాళ్లని చెడ్డవాళ్లుగా చూసి తీవ్రంగా అవమానించే ప్రమాదముంది. పిల్లలపై అత్యాచారం చేసేవాళ్ల కంటపడినా.. అదే సాకుతో వీళ్లని బలి చేస్తారు. లైంగికపరమైన విషయాల్లో ఎదురయ్యే ఇలాంటి తిట్లు, అవమానాలు, దెబ్బలు, బలాత్కారాలు చిట్టి మనసుల్ని తీవ్రంగా గాయపరుస్తాయి. భవిష్యత్తులో వారి లైంగిక జీవితం దెబ్బతింటుంది.

మరేం చేయాలి?

పిల్లలు అలా చేసినప్పుడు 'నో' అని చెప్పండి. వీలైనంత సున్నితంగా మందలించండి. మీ కంటపడ్డ ప్రతిసారీ అలా చేస్తూ ఉంటే చాలు! ఇందులో ఏదో తప్పుందనే విషయం పిల్లలకు కచ్చితంగా బోధపడుతుంది. నాలుగేళ్లలోపు పిల్లల విషయంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది! ఆపై వయసులవారిని మీరిలా మందలించడం మంచిదే కానీ.. వాళ్లకు ఇంకాస్త వివరించి చెప్పగలగాలి. ఒకవేళ అప్పటికే రహస్యంగా చేయడం అలవాటు చేసుకుంటే మనం ఇంకాస్త పెద్దస్థాయిలో చర్యలు తీసుకోవాలి. అవసరమైతే మానసిక నిపుణుల్ని కూడా కలవాల్సి ఉంటుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్