క్లోజ్ ఫ్రెండే.. నా భర్తకు దగ్గరవడానికి ప్రయత్నిస్తోంది..!

నా స్నేహితురాలితో నాకు పదేళ్లకు పైగా అనుబంధం ఉంది. ఈ క్రమంలో ఇద్దరం ఎన్నో విషయాలను పంచుకునే వాళ్లం. నా పెళ్లైన తర్వాత కూడా మా స్నేహం కొనసాగింది. మాకున్న చనువుతో తను తరచుగా మా ఇంటికి వస్తుంటుంది. దాంతో నా భర్తతోనూ తనకు పరిచయం పెరిగింది.

Updated : 01 Feb 2024 13:00 IST

నా స్నేహితురాలితో నాకు పదేళ్లకు పైగా అనుబంధం ఉంది. ఈ క్రమంలో ఇద్దరం ఎన్నో విషయాలను పంచుకునే వాళ్లం. నా పెళ్లైన తర్వాత కూడా మా స్నేహం కొనసాగింది. మాకున్న చనువుతో తను తరచుగా మా ఇంటికి వస్తుంటుంది. దాంతో నా భర్తతోనూ తనకు పరిచయం పెరిగింది. అయితే ఈ మధ్య తను నా భర్తతో ప్రవర్తించే తీరు ఇబ్బందిగా అనిపిస్తోంది. తను నా భర్తతో సన్నిహితంగా ఉండాలని ప్రయత్నిస్తోంది. దాన్ని నేను అస్సలు తట్టుకోలేకపోతున్నా. అలాగని పదేళ్లకు పైగా ఉన్న స్నేహబంధం కావడంతో తనని నిలదీయలేకపోతున్నా. నా భర్తతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అతనిపై పూర్తి నమ్మకం ఉంది. కానీ, ఈ వ్యతిరేకమైన ఆలోచనలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నా. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. సాధారణంగా ఇలాంటి అంశాల్లో భర్తపై ఎక్కువగా ఫిర్యాదు చేస్తుంటారు. కానీ, మీ భర్తపై పూర్తి నమ్మకం ఉన్నట్టుగా చెబుతున్నారు. అలాగే స్నేహబంధానికి గౌరవం ఇవ్వడంతో మీరు ఒత్తిడికి లోనవుతున్నారని అర్థమవుతోంది.

మీ భర్తపై పూర్తిగా నమ్మకం ఉందంటున్నారు. కాబట్టి, మీ దాంపత్య బంధానికి వచ్చే ముప్పు తక్కువే. మొదటగా ఈ విషయంలో మీ భర్త సహాయం తీసుకునే అవకాశాలను పరిశీలించండి. ఈ క్రమంలో అతనితో స్నేహపూర్వక వాతావరణంలో మాట్లాడండి. స్నేహితురాలి ప్రవర్తన వల్ల మీరు పడుతున్న ఇబ్బందులను అతనికి తెలియజేయండి. అదే సమయంలో అతని ప్రవర్తనని కూడా గమనించండి. ఒకవేళ మీ భర్తకు ఇతర ఆలోచనలు లేవని రుజువైతే అతను మీకు తప్పకుండా సహకరించే అవకాశం ఉంటుంది. తద్వారా సమస్య దాదాపుగా పరిష్కారమవుతుంది.

కొన్ని సందర్భాల్లో అతిగా ఆలోచించడం వల్ల కూడా సమస్యలు వస్తుంటాయి. మీ స్నేహితురాలి విషయంలో కూడా మీరు అతిగా ఆలోచిస్తు్న్నారేమో చెక్‌ చేసుకోవడం మంచిది. ఇందుకోసం ఆమెతోనే మాట్లాడి తన అభిప్రాయాలు తెలుసుకోండి. తద్వారా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థమవుతుంది.

ఒకవైపు స్నేహం.. మరోవైపు దాంపత్య బంధం ఈ రెండూ జీవితంలో ప్రధానమైనవే. అయితే రెండిటిలో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు దాంపత్యానికే ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తుంటారు. కాబట్టి, సమస్యను పరిష్కరించుకునే క్రమంలో స్నేహితురాలి కి దూరమవ్వడానికి కూడా మానసికంగా సిద్ధపడాల్సిన అవసరం ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. ఈ క్రమంలో అసలు విషయాన్ని స్నేహితురాలితో చర్చించే ప్రయత్నం చేయండి. తనతో మాట్లాడేటప్పుడు భావోద్వేగాలను అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఒకవేళ తన నుంచి సానుకూల స్పందన వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదు.. తన వల్ల దాంపత్య బంధానికే ముప్పు వస్తోందనిపిస్తే దూరం పెట్టే అవకాశాలను పరిశీలించండి. దీర్ఘకాలిక స్నేహబంధం కాబట్టి.. ఒకేసారి కాకుండా నెమ్మదిగా దూరం పెట్టడానికి ప్రయత్నించండి.

ఏది ఏమైనా సమస్య వచ్చినప్పుడు సానుకూల దృక్పథంతో ఉండడం ఎంతో అవసరం. కాబట్టి, ఈ క్రమంలో మీ ఆలోచనలను అదుపులో పెట్టుకుని పరిష్కారం వైపే ఆలోచించండి. తప్పకుండా సమస్య పరిష్కారమవుతుంది. ఒకవేళ మీ స్నేహితురాలికి మానసిక సమస్యలుంటే వాటిని పరిష్కరించడానికి సంబంధిత నిపుణుల సహాయం కూడా తీసుకోవడం మర్చిపోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్