వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెరగాలంటే..!

ఈ చిటపట చినుకుల కాలంలో ఏయే పదార్ధాలు తీసుకోవాలి.. ఫలితంగా ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలేంటి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి..

Published : 25 Jul 2023 12:42 IST

కాలం మారుతున్న కొద్దీ వివిధ రకాల ఇన్ఫెక్షన్లు మన శరీరంపై దాడి చేస్తుంటాయి. వాటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే రోగనిరోధక వ్యవస్థను దృఢంగా ఉంచుకోవాలి. ఈ క్రమంలోనే ఆయా కాలాల్లో లభించే పండ్లు, కాయగూరలు తీసుకోవడంతో పాటు ఆహార నియమాల్లోనూ పలు మార్పులు-చేర్పులు చేసుకోవడం అవసరం అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ క్రమంలో- ఈ చిటపట చినుకుల కాలంలో ఏయే పదార్ధాలు తీసుకోవాలి.. ఫలితంగా ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలేంటి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి..

రోగనిరోధక శక్తికి ఈ కాయగూరలు!

వర్షాకాలంలో తీగ జాతికి చెందిన సొరకాయ, గుమ్మడి, కాకర, బీరకాయలతో పాటు క్యారట్‌, చిలగడదుంప, చేమదుంప.. వంటి దుంప జాతికి చెందిన కాయగూరల్ని ఆహారంగా తీసుకోవాలి. ఇవన్నీ జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి.

గింజలు - చిరుధాన్యాలు!

వర్షాకాలంలో రాగి జావ, రాగి రొట్టె, రాగులతో తయారుచేసుకునే అప్పడాలు కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అలాగే సామలు, కొర్రలు.. వంటి చిరుధాన్యాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఈ క్రమంలో వీటితో ఆయా ప్రాంతాల్లో సంప్రదాయ వంటకాల్ని తయారుచేసుకొని పెరుగు, బటర్‌తో ఆరగించచ్చు. ఇక అన్నం, జొన్నలు, గోధుమలను ఏ సీజన్‌లోనైనా తీసుకోవచ్చు.

పప్పుల్లో పోషకాలెన్నో!

కొంతమంది వర్షాకాలంలో మాంసం, చేపలు తినడానికి ఇష్టపడరు. ఈ క్రమంలో- ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉన్న పప్పు ధాన్యాలు వర్షాకాలంలో ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలన్నీ అందిస్తాయి. ఇక వీటిలోనూ మొలకెత్తినవి తీసుకుంటే మరీ మంచిది. పప్పులతో తయారుచేసుకునే వంటకాలు, పప్పులన్నీ కలిపి తయారుచేసే సబ్జీ, అప్పడాలు.. ఇలా ఎవరి ప్రాంతానికి తగినట్లుగా వారు సరికొత్త వంటకాలు తయారుచేసుకొని తీసుకోవచ్చు. ఇక ఈ సీజన్‌లో ఉలవలు, అలసందలు మరీ మంచివి. ఈ రెండు పప్పు ధాన్యాలు చర్మ ఆరోగ్యానికి, కేశ సంరక్షణకు తోడ్పడతాయి.

వాడిన నూనె వద్దు!

ఆహారం విషయంలోనూ ఒక్కో కాలానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో మామిడి పండ్ల హవా కొనసాగితే.. వర్షాకాలంలో వేడివేడిగా బజ్జీలు, పకోడీలు లాంటివి తినాలనిపిస్తుంటుంది. అయితే ఈ క్రమంలో ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ ఇతర పదార్థాల తయారీకి వాడకూడదు.

మనం తీసుకునే ఆహారంలో విటమిన్‌ ‘డి’, అత్యవసర కొవ్వులుండేలా చూసుకోవాలి. ఎందుకంటే అత్యవసర కొవ్వులు రక్తంలో చక్కెర స్థాయుల్ని క్రమబద్ధీకరించడానికి తోడ్పడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్