ఆషాఢం.. కొత్త కోడళ్లకు సెలవు రోజులే!

ఆషాఢమాసం.. కొత్తగా కాపురానికి వెళ్లిన కూతుర్ని మళ్లీ పుట్టింటికి తీసుకొచ్చే మాసం. ఈ క్రమంలో అబ్బాయికి, అమ్మాయి తరఫు వారు చిన్న చిన్న కట్నకానుకల రూపంలో ఆషాఢపట్టి పెట్టి అమ్మాయిని ఈ నెల రోజుల పాటు పుట్టింటికి తీసుకెళ్తారు. మళ్లీ శ్రావణ మాసం తొలిరోజున అమ్మాయి అత్తవారు.. అమ్మాయికి చీరతో పాటు ఇతర కానుకలు శ్రావణ పట్టి రూపంలో ఇచ్చి కోడలిని తమ ఇంటికి తెచ్చుకుంటారు.

Published : 11 Jul 2021 12:23 IST

ఆషాఢమాసం.. కొత్తగా కాపురానికి వెళ్లిన కూతుర్ని మళ్లీ పుట్టింటికి తీసుకొచ్చే మాసం. ఈ క్రమంలో అబ్బాయికి, అమ్మాయి తరఫు వారు చిన్న చిన్న కట్నకానుకల రూపంలో ఆషాఢపట్టి పెట్టి అమ్మాయిని ఈ నెల రోజుల పాటు పుట్టింటికి తీసుకెళ్తారు. మళ్లీ శ్రావణ మాసం తొలిరోజున అమ్మాయి అత్తవారు.. అమ్మాయికి చీరతో పాటు ఇతర కానుకలు శ్రావణ పట్టి రూపంలో ఇచ్చి కోడలిని తమ ఇంటికి తెచ్చుకుంటారు. అలాగే ఈ నెలరోజుల పాటు అత్తాకోడళ్లు ఒకేచోట ఉండకూడదని, భర్త కూడా అత్తారింట్లో అడుగు పెట్టకూడదన్నది అనాదిగా వస్తున్న ఆచారం. ఈ మాసంలో పెళ్లిళ్లు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు.. తదితర శుభకార్యాలు కూడా చేయరు. కాబట్టే ఈ మాసాన్ని 'శూన్య మాసం'గా వ్యవహరిస్తారు. ఇంతకీ ఆషాఢం నేపథ్యం ఏంటంటారా?

నేపథ్యమిదే..

ఆషాఢమాసం గ్రీష్మ రుతువులో వస్తుంది. పౌర్ణమి రోజున 'ఉత్తరాషాఢ' నక్షత్రం రావడం వల్ల ఈ నెలకు ఉత్తరాషాఢ అని కూడా పేరు. ఈ మాసంలో గాలి ఎక్కువగా వీస్తూ ఉంటుంది. పూర్వ కాలంలో శుభకార్యాలు, యజ్ఞ యాగాదులు ఖాళీ ప్రదేశాల్లో చేసేవారు. గాలి ఎక్కువగా ఉండటం వల్ల వీటిని చేయడంలో ఇబ్బంది ఎదురవుతుండేది. అందుకే అప్పట్నుంచి ఆషాఢంలో ఎలాంటి శుభకార్యాలు చేసేవారు కాదు.. ఈ మాసంలో అనేక పండుగలు, పర్వదినాలు కూడా ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిథి. దీన్ని తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఇక్కడి నుంచి వారానికి లేదా ప్రతి 15 రోజులకోసారైనా ఏదో ఒక పండుగ, వ్రతం, పూజ ఉంటాయి.

భార్యాభర్తల ఎడబాటు..

ఆషాఢమాసంలో కొత్తగా పెళ్త్లెన జంటలు దూరంగా ఉండాలన్న సంప్రదాయం మనకు తెలిసిందే.. ఈ క్రమంలో వధువును పుట్టింటికి తీసుకెళ్లే ఆచారం ఇప్పటికీ కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మాసంలో స్త్రీ నెల తప్పితే.. 9 నెలల తర్వాత అంటే మార్చి నుంచి మే మధ్య కాలంలో (వేసవి కాలంలో) ప్రసవం జరుగుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పుట్టిన శిశువుకు ఈ వేడి వాతావరణం బాగా ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే ఈ వేడి ప్రభావం తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యం మీదా పడుతుంది. అందుకే భార్యాభర్తలను విడివిడిగా ఉంచేవారు. కొత్త కోడలిని పుట్టింటికి పంపించేవారు. అలాగే కొత్త అల్లుడు కూడా అత్తవారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది.

గోరింటాకు అంతరార్థం..

ఆషాఢమాసంలో చాలామంది తమ చేతులను, కాళ్లను గోరింటాకుతో పండించుకోవడం తెలిసిందే.. ఎందుకంటే ఈ మాసంలో వచ్చే వాతావరణ మార్పుల ప్రభావం శరీరంపై పడకుండా, ఎలాంటి చర్మ వ్యాధులు రాకుండా ఉండటానికి అందరూ గోరింటాకు పెట్టుకుంటారు.

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం సర్వసాధారణమైపోయిన ఈ రోజుల్లో ఇప్పుడు ఈ ఆచారాలను అంతగా పాటించకపోవచ్చు. దంపతులిద్దరూ దూరంగా ఉండకపోవచ్చు. అలాగే గర్భనిరోధక సాధనాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో వేసవిలో పిల్లలు పుడితే ఇబ్బందేమో అన్న సంశయమూ ఇప్పటి తరానికి ఉండకపోవచ్చు. కానీ వాడుకలో ఉన్న ప్రతి ఆచారం, సంప్రదాయానికీ ఒక శాస్త్రీయ నేపథ్యం ఉంటుందనడానికి ఆషాఢమే ఒక చక్కటి ఉదాహరణ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్