Inayat Vats: నాన్నే నా ‘రియల్‌ హీరో’!

రెండున్నరేళ్ల పసి ప్రాయం.. నాన్న ఎవరు? ఏం చేస్తుంటారన్నది పూర్తిగా తెలియని పసి వయసులో తండ్రి ప్రేమకు శాశ్వతంగా దూరమైందామె. ఆపై దేశ సేవలో ఆయన చేసిన త్యాగాల్ని కథలు కథలుగా విన్నది. ఈ స్ఫూర్తితో నాన్న బాటలోనే నడవాలని సంకల్పించుకుంది.

Published : 11 Mar 2024 18:41 IST

(Photo: Twitter)

రెండున్నరేళ్ల పసి ప్రాయం.. నాన్న ఎవరు? ఏం చేస్తుంటారన్నది పూర్తిగా తెలియని పసి వయసులో తండ్రి ప్రేమకు శాశ్వతంగా దూరమైందామె. ఆపై దేశ సేవలో ఆయన చేసిన త్యాగాల్ని కథలు కథలుగా విన్నది. ఈ స్ఫూర్తితో నాన్న బాటలోనే నడవాలని సంకల్పించుకుంది. ఈ పట్టుదలే నేడు ఆమె కల నెరవేర్చింది. చెన్నైలోని ‘ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ’లో శిక్షణ పూర్తిచేసుకొని ఆర్మీ యూనిఫాం ధరించిన లెఫ్టినెంట్‌ ఇనాయత్‌ వాట్స్‌ ‘దేశ రక్షణ కోసం శత్రువుల ప్రాణాలు తీయడానికి.. దేశ సేవలో నా ప్రాణాల్ని త్యాగం చేయడానికీ సిద్ధంగా ఉన్నానం’టూ ప్రతిజ్ఞ చేసింది.

లెఫ్టినెంట్‌ ఇనాయత్ తండ్రి మేజర్‌ నవ్‌నీత్‌ వాట్స్‌. 2003 నవంబర్‌లో భారతీయ ఆర్మీలోని ‘థర్డ్‌ గోర్ఖా రైఫిల్స్‌ రెజిమెంట్‌’కు చెందిన నాలుగో బెటాలియన్‌లో మేజర్‌గా పనిచేస్తున్నారు. అదే సమయంలో శ్రీనగర్‌లో ఉగ్రవాదులు దాగి ఉన్న ఓ టెలికాం భవనాన్ని కూల్చే ఆపరేషన్‌కు నాయకత్వం వహించారు. అయితే ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులు ప్రతిదాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మేజర్‌ నవ్‌నీత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వీరమరణం పొందారు. మరణానంతరం ఆయనకు భారత ప్రభుత్వం ‘సేనా మెడల్‌’ అందించి గౌరవించింది. ఇలా తన తండ్రి చనిపోయే నాటికి ఇనాయత్‌ వయసు రెండున్నరేళ్లు.

ఆ కథలే స్ఫూర్తిగా!

పసి ప్రాయంలోనే తండ్రి దూరమైనా తల్లి శివానీనే ఇనాయత్‌కు తల్లీ తండ్రి అయి పెంచింది. కూతురి పోషణ, కుటుంబ బాధ్యతల్ని నెరవేర్చడానికి చండీగఢ్ లోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేవారామె. కూతురు పెరిగి పెద్దయ్యే క్రమంలోనే తన భర్త శౌర్యం, వీరత్వం గురించి ఆమెకు కథలు కథలుగా చెప్పే వారు శివానీ. ఇలా తన తండ్రి చేసిన దేశ సేవ గురించి తెలుసుకున్న ఇనాయత్‌.. పెద్దయ్యాక తానూ ఆర్మీలో చేరాలని, తన తండ్రి బాటలోనే నడవాలని నిర్ణయించుకుంది. దిల్లీలోని ‘లేడీ శ్రీరామ్‌ కాలేజీ’లో పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో డిగ్రీ పూర్తయ్యాక.. ‘హిందూ కాలేజీ’ నుంచి అదే విభాగంలో మాస్టర్స్‌ చేసింది. చదువు పూర్తయ్యాక ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు రాసిన ఇనాయత్‌.. ఇందులో ఉత్తీర్ణత సాధించి చెన్నైలోని ‘ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ’లో శిక్షణలో చేరింది. ఇటీవలే ట్రైనింగ్‌ పూర్తిచేసుకొన్న ఇనాయత్‌.. తాజాగా నిర్వహించిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో ఆర్మీ యూనిఫాం ధరించి ‘మిలిటరీ ఇంటెలిజెన్స్‌ కార్ప్స్‌’లో లెఫ్టినెంట్‌గా ఉద్యోగ బాధ్యతల్ని స్వీకరించింది.

దేశ సేవకే ఈ జీవితం!

ఇనాయత్‌ ధైర్యాన్ని, దేశ సేవ చేయాలన్న ఆమె సంకల్పాన్ని భారత ఆర్మీ ప్రశంసించింది. ఆర్మీ యూనిఫాం ధరించిన ఇనాయత్‌ ఫొటోను ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఇనాయత్‌కు మూడేళ్లున్నప్పుడే ఆమె తండ్రి మేజర్‌ నవ్‌నీత్ ఓ తిరుగుబాటు ఆపరేషన్‌లో భాగంగా కన్నుమూశారు. తన తండ్రి బాటలోనే నడవాలన్న సంకల్పంతో రెండు దశాబ్దాల అనంతరం ఇనాయత్‌ ఆర్మీ యూనిఫాం ధరించడం గొప్ప విషయం. వెల్‌కమ్‌ ఆర్మీ డాటర్‌..’ అంటూ రాసుకొచ్చింది. చిరునవ్వులు చిందిస్తూ, దేశ సేవ చేయాలన్న ఉత్సాహంతో ఉన్న ఇనాయత్‌.. ‘దేశ రక్షణ కోసం శత్రువు ప్రాణాలు తీయడానికి నేను సిద్ధం.. అలాగే దేశ సేవలో నా ప్రాణాలర్పించడానికీ నేను రడీగా ఉన్నా..’ అంటూ డేరింగ్‌గా చెబుతోంది. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం భర్త ఒంటిపై ఉన్న యూనిఫాంనే ఇప్పుడు కూతురి ఒంటిపై చూసేసరికి ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యారు ఇనాయత్‌ తల్లి శివానీ. తన కూతురిని చూస్తే గర్వంగా ఉందని, తన భర్త ఎక్కడున్నా సంతోషిస్తారని అంటున్నారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్