Adi Nevgi : ‘పానీపూరీ’కి మెక్సికన్ ట్విస్ట్.. అదే ఆమె స్పెషాలిటీ!
వంటకాలు ఎవరైనా చేస్తారు.. కానీ వాటిపై ప్రయోగాలు చేస్తూ సరికొత్త రుచుల్ని సృష్టించిన వారే సక్సెసవుతారు. మెల్‌బోర్న్‌కు చెందిన ఆది నేవ్గీ ఇందుకు తాజా ఉదాహరణ. ప్రస్తుతం జరుగుతోన్న ‘మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా’ సీజన్-15లో టాప్-8లో నిలిచిన....
(Photos: Instagram)
వంటకాలు ఎవరైనా చేస్తారు.. కానీ వాటిపై ప్రయోగాలు చేస్తూ సరికొత్త రుచుల్ని సృష్టించిన వారే సక్సెసవుతారు. మెల్‌బోర్న్‌కు చెందిన ఆది నేవ్గీ ఇందుకు తాజా ఉదాహరణ. ప్రస్తుతం జరుగుతోన్న ‘మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా’ సీజన్-15లో టాప్-8లో నిలిచిన ఆమె.. అడుగడుగునా తన పాకశాస్త్ర ప్రావీణ్యంతో షో న్యాయనిర్ణేతల్ని ఆకట్టుకుంటోంది. పాపులర్ వంటకాలకు సరికొత్త ట్విస్టులు జోడిస్తూ వారి మనసులు గెలుచుకుంటోంది. అలా మన పానీపూరీకి మెక్సికన్ ట్విస్ట్ జోడించి.. తాజాగా జడ్జిల నోటికి విందు చేసింది ఆది. ఇదనే కాదు.. సైన్స్‌కు పాకశాస్త్రాన్ని ముడిపెట్టి.. ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలు చేయడంలో ఆమెది అందెవేసిన చేయి. ఇలా తన పాకశాస్త్ర ప్రావీణ్యంతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ చెఫ్ సక్సెస్ జర్నీ మీకోసం..!
అదితీ నేవ్గీ అలియాస్ ఆది నేవ్గీ భారత సంతతికి చెందిన అమ్మాయి. తాను పుట్టకముందే ఆ కుటుంబం ఆస్ట్రేలియాలో స్థిరపడింది. ప్రస్తుతం అక్కడి మొనాష్ పట్టణంలో స్థిరపడిన ఆది.. వృత్తిరీత్యా డాక్టర్. అక్కడి ఓ ఆస్పత్రిలో ఎండోక్రైనాలజిస్ట్‌గా పనిచేస్తోన్న ఆమెకు వంట చేయడమంటే చిన్నతనం నుంచి మక్కువ ఎక్కువ. ఈ ఇష్టంతోనే పెద్దయ్యే క్రమంలో వంటల్లో వివిధ ప్రయోగాలు చేసేదామె.
సొంతంగా నేర్చుకొని..!
ఆసక్తి ఉన్న అంశాల్లో ప్రావీణ్యం సంపాదించడానికి.. ప్రత్యేక శిక్షణలు తీసుకోవడం మనలో చాలామందికి అలవాటు! అయితే ఆది మాత్రం తనకు ఆసక్తి ఉన్న పాకశాస్త్రంలో ఎలాంటి శిక్షణా తీసుకోలేదు. సొంతంగానే ఇందులో మెలకువలు నేర్చుకున్నానంటోంది.
‘నాకు వంటలంటే ఎంతిష్టమంటే.. ఖాళీ దొరికినప్పుడల్లా టీవీలో, నెట్‌లో వంటల కార్యక్రమాలు, పోటీలు ఎక్కువగా చూసేదాన్ని. వంటల పుస్తకాలు తెప్పించుకొని మరీ చదివేదాన్ని. ఇలా సొంతంగానే బోలెడన్ని వంటల్లో మెలకువలూ నేర్చుకున్నా. కిచెన్‌లో గరిట తిప్పడం, అమ్మకు సహాయం చేయడంతో మరిన్ని నైపుణ్యాలు అలవడ్డాయి. అయితే ఒక వంటకం చేసేటప్పుడు దాన్ని రుచికరంగా చేయడానికి ఎంత ప్రాధాన్యమిస్తానో.. అంతే ఆరోగ్యకరంగా ఉండేలా జాగ్రత్తపడతా..’ అంటోంది ఆది.
భారతీయ వంటలంటే ఇష్టం!
ఎవరో సృష్టించిన వంటకాన్ని యథావిధిగా చేయడం కంటే.. వాటిలో ప్రయోగాలు చేస్తూ.. తనకంటూ సొంత రెసిపీని సృష్టించుకోవడానికి ఇష్టపడుతుంది ఆది. ఆమెకు ట్రావెలింగ్ అన్నా విపరీతమైన మక్కువ. ఇప్పటికే 55కి పైగా దేశాల్లో పర్యటించిన ఆమె.. అక్కడి రుచుల్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేకమైన వంటకాల్ని తయారుచేస్తుంటుంది.
‘ప్రతి విషయంలోనూ ప్రయోగాత్మకంగా, క్రియేటివ్‌గా ఆలోచించడం నాకు అలవాటు! వంటలకూ ఇదే సూత్రాన్ని వర్తింపజేస్తుంటా. ముఖ్యంగా నాకు భారతీయ సంప్రదాయ వంటకాలంటే మహా ఇష్టం. నా కిచెన్ కూడా ఇండియన్ నేటివిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. అయితే నేను పర్యటించిన దేశాల్లోని ప్రముఖ వంటకాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. సరికొత్త వంటకాల్ని సృష్టిస్తుంటా. వంట చేయడంలో ఏదో సంతృప్తి దాగుంది. ఇదే నా స్ట్రెస్ బస్టర్!’ అంటోంది ఆది.
ట్విస్ట్’ల మీద ట్విస్ట్‌లు!
తన పాకశాస్త్ర నైపుణ్యాలతో సరికొత్త వంటకాల్ని సృష్టించే ఈ యంగ్ చెఫ్‌కి ఎప్పటికైనా ‘మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా’ షోలో పాల్గొనాలనేది కల. అది ఈ ఏడాది సీజన్‌తో నెరవేరింది. ప్రస్తుతం జరుగుతోన్న ‘సీజన్-15’లో పాల్గొనే అవకాశం దక్కించుకున్న ఆది.. ఈ షోలో టాప్-8కి చేరుకోవడం విశేషం. ఇందుకు ఆమె క్రియేటివ్ నైపుణ్యాలే కారణం! ఇటీవలే ఈ షో ‘Nostalgia Week’లో భాగంగా.. సెరల్స్‌తో ఫ్రూట్ లూప్ కేక్ తయారుచేసి.. న్యాయనిర్ణేతల మనసులు గెలుచుకున్న ఆది.. తాజాగా నిర్వహించిన ‘మిస్టరీ బాక్స్ ఛాలెంజ్’లో తన క్రియేటివిటీని హద్దులు దాటించింది. ఇందుకోసం భారతీయ స్ట్రీట్ స్నాక్ పానీపూరీని ఎంచుకున్న ఈ ట్యాలెంటెడ్ చెఫ్.. దీనికి మెక్సికన్ రుచుల్ని జోడించి.. మరోసారి ఈ షో జడ్జిల మనసులు గెలుచుకుంది.
‘సాధారణంగా పానీ పూరీలో ఫిల్లింగ్‌కి బంగాళాదుంప-శెనగలతో తయారుచేసిన కూర, మసాలాలతో తయారుచేసిన ఘాటైన పానీయాన్ని ఉపయోగిస్తారు. కానీ నేను దీనికి మెక్సికన్ రుచుల్ని జతచేశాను. ఫిల్లింగ్ కోసం సాల్మన్ రో, అవకాడో వాడాను. రుచి చూసే దాకా జడ్జిలు ఈ విషయాన్ని పసిగట్టలేకపోయారు. నాకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్‌లో పానీ పూరీ ఒకటి. దీనిపై ప్రయోగాలు చేయడానికీ అంతే ఇష్టపడతా. తాజాగా మెక్సికన్ పానీ పూరీ సక్సెసైంది. త్వరలో తైవానీస్ పానీ పూరీ (బబుల్ టీ ట్విస్ట్), డెజర్ట్ పానీ పూరీ (చాక్లెట్ మిల్క్‌తో), డ్యాన్స్ ఫ్లోర్ పానీ పూరీ (వోడ్కా షాట్‌తో).. వంటివీ ప్రయత్నించాలనుకుంటున్నా..’ అంటూ ప్రయోగాత్మక వంటకాలపై తనకున్న మక్కువను మరోసారి బయటపెట్టింది ఆది.
వంటకాలు చేయడమే కాదు.. వంటలకు సంబంధించిన ప్రాథమిక అంశాలు, మెలకువల్ని రంగరిస్తూ ‘How To Guide’ పేరుతో ప్రస్తుతం ఓ పుస్తకం కూడా రాస్తోందీ మాస్టర్ చెఫ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.