Bhavani Devi: తను ‘కత్తి’ దూస్తే తిరుగే లేదు!

సాధారణంగా కత్తి యుద్ధాల్ని సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ అలాంటి ఆట ఒకటుందని, అందులో అమ్మాయిలూ రాణించచ్చని నిరూపిస్తోంది చెన్నై ఫెన్సర్‌ సీఏ భవానీ దేవి. యూరప్ దేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ క్రీడలో తనదైన ఆటతీరుతో రాణిస్తూ సత్తా చాటుతోంది.. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో....

Updated : 20 Jun 2023 20:48 IST

(Photos: Instagram)

సాధారణంగా కత్తి యుద్ధాల్ని సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ అలాంటి ఆట ఒకటుందని, అందులో అమ్మాయిలూ రాణించచ్చని నిరూపిస్తోంది చెన్నై ఫెన్సర్‌ సీఏ భవానీ దేవి. యూరప్ దేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ క్రీడలో తనదైన ఆటతీరుతో రాణిస్తూ సత్తా చాటుతోంది.. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో అరుదైన రికార్డులు సృష్టిస్తోంది.  పతకాలు సాధిస్తోంది. అయితే తానీ స్థాయికి చేరడానికి పడరాని పాట్లు పడ్డానంటోందీ యువ ఫెన్సర్‌. అటు సమాజం నుంచి విమర్శల్ని, ఇటు ఆర్థిక కష్టాల్ని కసితో ఎదుర్కొన్న ఆమె.. తాజాగా మరో ఘనతను తన సిగలో చేర్చుకుంది. ప్రస్తుతం చైనా వేదికగా జరుగుతోన్న ‘ఏషియన్‌ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌’లో కాంస్యం గెలుచుకున్న భవానీ.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్‌గా చరిత్రకెక్కింది. ఈ నేపథ్యంలో ఈ చెన్నై క్రీడాకారిణి ఫెన్సింగ్‌ జర్నీలోని కొన్ని ఆటుపోట్ల గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..!

కొత్తగా ఉందని ఎంచుకున్నా!

మాది మధ్య తరగతి కుటుంబం. నాకు ఇద్దరు అక్కలు, ఇద్దరు సోదరులున్నారు. మా కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనుకున్నా. క్రీడల్లోకొస్తానని కానీ, అందులోనూ ఫెన్సింగ్‌ వంటి కొత్త ఆటను ఎంచుకుంటానని కానీ అస్సలు ఊహించలేదు.. ఆ ఆలోచనా లేదు. అయితే నేను ఆరో తరగతిలో కొత్త స్కూల్‌కి మారాను. అక్కడ చదివే ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడను ఎంచుకోవాలనేది నియమం. అలా ఆరు క్రీడాంశాల్ని ఎంపిక చేశారు. అయితే నేను ఆ స్కూల్లో చేరే సమయానికే ఫెన్సింగ్‌ తప్ప మిగతా క్రీడాంశాల్లో ఖాళీలు లేవు. దాంతో ఫెన్సింగ్‌ను ఎంచుకోక తప్పలేదు. నిజానికి ఈ క్రీడ ఒకటుందనీ నాకు అప్పుడే తెలిసింది. ఎప్పుడెప్పుడు ట్రై చేద్దామా అన్న ఉత్సాహమూ నాలో పెరిగింది. ఈ ఆసక్తే నేను ఫెన్సింగ్‌ క్రీడాకారిణిగా ఎదిగేందుకు ప్రేరేపించింది. ఇప్పటికీ ఇదే నన్ను ప్రతిరోజూ ప్రోత్సహిస్తోంది.

అమ్మ పట్టుబట్టింది!

మధ్యతరగతి కుటుంబాల్లో చదువా? ఆటలా? అంటే.. చదువు వైపే మొగ్గు చూపుతారు చాలామంది తల్లిదండ్రులు. కానీ మా అమ్మానాన్నలు నా ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యమిచ్చారు. నాకు నచ్చిన క్రీడను కెరీర్‌ ఆప్షన్‌గా ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. నిజానికి ఫెన్సింగ్‌ ఖరీదైన క్రీడ. విదేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనాలంటే.. ఏడాదికి సుమారు రూ. 70-80 లక్షల దాకా ఖర్చుపెట్టాల్సి వస్తుంది. ఈ ఖర్చులు మాకు భారంగా మారాయి. మొదట్లో డబ్బు లేక ఎన్నో అంతర్జాతీయ పోటీల్ని మిస్సయ్యా. ఒక దశలో ఈ క్రీడనూ వదిలేద్దామనుకున్నా. కానీ అమ్మ పట్టుబట్టింది. తన ఆభరణాలు తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలు తీసుకుంది. నన్ను పోటీలకు పంపించడానికి స్పాన్సర్‌షిప్స్‌, ప్రభుత్వ నిధుల కోసం ఎన్నో ప్రయత్నాలూ చేసింది. సాన పెట్టే కొద్దీ కత్తి పదునైనట్లు.. ఇలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్న కొద్దీ ఈ క్రీడలోనే రాణించాలన్న పట్టుదల మరింతగా పెరిగింది.

వెదురుకర్రలతో సాధన చేశా!

స్కూల్లో ఈ ఆట నాకు పరిచయమైన తొలినాళ్లలో స్కూల్లో మా టీచర్‌ నన్ను ఓ ప్రశ్న అడిగింది.. ‘మీ నాన్నగారి ఆదాయం ఎంత?’ అని! అప్పటికే ఇది చాలా ఖరీదైన ఆట అని టీచర్‌ చెప్పారు. దాంతో మాది మధ్య తరగతి కుటుంబం అని చెప్తే ఎక్కడ నన్ను ఆటకు దూరం చేస్తారోనని.. మా నాన్న ఆదాయం విషయంలో అబద్ధం చెప్పా. శిక్షణే కాదు.. ఈ క్రీడకు సంబంధించిన కిట్‌ ఖరీదూ ఎక్కువే! ఫెన్సింగ్‌ దుస్తులు, కత్తులు, ఇతర రక్షణ కవచాల కోసం బోలెడంత డబ్బు ఖర్చవుతుంది. పైగా శిక్షణ సమయంలో కత్తి విరిగిపోతే కొత్తదాన్ని దిగుమతి చేసుకోవాలి. ఈ స్థోమత లేక.. తొలుత వెదురు కర్రలతోనే ఫెన్సింగ్‌ సాధన చేసేదాన్ని. కేవలం పోటీల కోసం మాత్రమే నిజమైన కత్తులు వాడేదాన్ని. ఇక అందరూ ఇండోర్‌ ఏసీ గదుల్లో సాధన చేస్తే.. నేను మండుటెండలో సాధన చేసేదాన్ని. ఎన్నోసార్లు స్పాన్సర్‌షిప్స్‌ కోసం ఇబ్బంది పడ్డ నాకు.. 2014 ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచాక.. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రూ. 3 లక్షల ఆర్థిక సహాయం చేసి.. నన్ను అమెరికాలో అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌కు పంపించారు. ఈ శిక్షణే నాలోని ఫెన్సింగ్‌ సామర్థ్యాన్ని, నైపుణ్యాల్ని పెంచింది. ఇదే సమయంలో అంతర్జాతీయ క్రీడాకారులతో పోటీ పడుతూ మరెన్నో పాఠాలు నేర్చుకున్నా.

‘ఒంటరిగా వెళ్లనిస్తున్నారా?’ అనేవారు!

2004లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడంతో నా ఫెన్సింగ్‌ కెరీర్‌ ప్రారంభమైంది. పోటీల కోసం రోజూ ఉదయాన్నే నిద్ర లేచి.. స్కూల్‌ ప్రారంభం కాకముందు, స్కూల్‌ ముగిశాక.. స్టేడియంకు వెళ్లి సాధన చేసేదాన్ని. ఒక్కోసారి సాయంత్రాలు బస్‌ మిస్సయితే కిలోమీటర్ల కొద్దీ ఒంటరిగా నడిచిన సందర్భాలకు లెక్కే లేదు. ఇక పదో తరగతి పూర్తయ్యాక కేరళలోని ‘స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’లో చేరే అవకాశం వచ్చింది. 2007లో టర్కీలో జరిగిన ‘జూనియర్‌ వరల్డ్‌ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌’ ద్వారా తొలి అంతర్జాతీయ పోటీలో పాల్గొన్నా. జాతీయ పోటీలైనా, అంతర్జాతీయ టోర్నీలైనా.. ఒంటరిగానే ప్రయాణించేదాన్ని. అప్పటికి నాకు ఇంగ్లిష్‌ కూడా రాదు. ముందే హోటల్స్‌ బుక్‌ చేసుకోవడం, అక్కడి వాళ్లతో మాట్లాడడం.. ఇబ్బందిగా అనిపించేది. దీనికి తోడు ఇరుగుపొరుగు వాళ్లు ‘ఒంటరిగా అమ్మాయిని ఎందుకు వెళ్లనిస్తున్నారు?’ అంటూ నా దారికి అడ్డుపడాలని చూశారు. అయినా అవేవీ పట్టించుకోకుండా.. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ఓపికతో ముందుకు సాగాను.

వాళ్లే నా రోల్‌మోడల్!

నా కెరీర్‌లో వివిధ జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ఇప్పటివరకు 17కు పైగా మెడల్స్‌ గెలుచుకున్నా. ప్రపంచ ఫెన్సింగ్‌ ర్యాంకింగ్స్‌లో 40వ స్థానంలో కొనసాగుతున్నా. అయితే 2020లో దేశం తరఫున టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని, నా సుదీర్ఘ స్వప్నాన్ని నెరవేర్చుకోవడం.. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించిన తొలి భారత ఫెన్సర్‌గా రికార్డు నమోదు చేయడం.. తాజాగా ‘ఏషియన్‌ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌’లో కాంస్యం గెలుచుకోవడం, అర్జున అవార్డు అందుకోవడం.. ఎప్పటికీ మర్చిపోలేను. యూఎస్‌ ఫెన్సర్‌ ‘Mariel Zagunis’ నాకు స్ఫూర్తి. సానియా మీర్జా, సెరెనా విలియమ్స్‌, పీటీ ఉష.. వంటి మహిళా అథ్లెట్లనూ చూసి ప్రేరణ పొందాను. భవిష్యత్తులో ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మక పోటీలలో మరిన్ని పతకాలు నెగ్గి దేశానికి అంకితం చేయాలనుకుంటున్నా. ఇక ఈ కాలం తల్లిదండ్రుల్ని నేను కోరుకునేది ఒక్కటే.. తమ కూతుళ్లను అరుదైన రంగాల్లో ప్రోత్సహించమని! అప్పుడే మన శక్తియుక్తులేంటో ఈ ప్రపంచానికి అవగతమవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్