Kashvi Jindal: పేదలకు డబ్బు పాఠాలు చెబుతోంది!

పేదలకు డబ్బు పాఠాలు చెబుతూనే.. ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న కశ్వి కథ నేటి యువతకు స్ఫూర్తిదాయకం

Published : 27 Jul 2023 18:48 IST

(Photos: Instagram)

నిరుపేదలు, వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. మరి, వాటిని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు? అసలు వాటి వల్ల తమకు ఒనగూరే ప్రయోజనాలేంటి? వాటికెలా దరఖాస్తు చేసుకోవాలి? ఈ విషయాల గురించి అందరికీ అవగాహన ఉందా అంటే.. నిస్సందేహంగా లేదనే చెప్పాలి. ఈ అవగాహన లోపంతోనే చాలామంది వీటి ప్రయోజనాల్ని అందుకోలేకపోతున్నారని అనుభవ పూర్వకంగా తెలుసుకుంది 17 ఏళ్ల కశ్వీ జిందాల్‌. ఎలాగైనా సమాజంలో ఉన్న ఈ పరిస్థితిని మార్చాలనుకుంది. ఈ ఆలోచనలే ఇంత చిన్న వయసులోనే ఆమెతో ఓ సామాజిక సంస్థను నెలకొల్పేలా చేశాయి. పేదలకు డబ్బు పాఠాలు చెబుతూనే.. ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న కశ్వి కథ నేటి యువతకు స్ఫూర్తిదాయకం!

గురుగ్రామ్‌కు చెందిన కశ్విది వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం. ఆమె తండ్రి గౌరవ్‌ జిందాల్‌ సొంతంగా ఓ పెట్టుబడి సంస్థను నడుపుతున్నారు. దీంతో చిన్నతనం నుంచి ఆమె కూడా ఆర్థికాంశాలపై మక్కువ చూపేది. ఖాళీగా అలా నాన్నతో కూర్చున్నా, భోజనం చేస్తున్నా.. వారి మధ్య ఆర్థిక విషయాల సంభాషణే వచ్చేది. ‘నాన్నతో ఎప్పుడూ మార్కెట్‌ ట్రెండ్స్‌, స్టాక్స్‌, ఎకానమీ.. వంటి విషయాల గురించే చర్చించేదాన్ని. స్కూల్లో నాకిష్టమైన సబ్జెక్ట్‌ కూడా అర్థశాస్త్రమే. దీనికి సంబంధించిన అంశాల్ని ఇట్టే గ్రహించి అర్థం చేసుకునేదాన్ని. నాలో ఉన్న ఈ ఆసక్తిని నాన్న గుర్తించి.. ఇటువైపుగా నన్ను ప్రోత్సహించారు..’ అంటూ చెప్పుకొచ్చింది కశ్వి.

అనుభవాల్లోంచి పుట్టిన ఆలోచన!

అయితే తనలో ఉన్న ఈ ఆర్థిక నైపుణ్యాలు, నాలెడ్జ్‌ని సామాజిక సంక్షేమం కోసం వినియోగించుకోవాలనుకునేది కశ్వి. అదెలా సాధ్యమవుతుందన్న కోణంలో తనకొచ్చిన ఆలోచనల్ని తన తండ్రితో పంచుకునేది. ఇలాంటి తరుణంలో తన జీవితంలో జరిగిన రెండు సంఘటనలే తనకు మార్గనిర్దేశనం చేశాయంటోందామె.

‘లాక్‌డౌన్‌ సమయంలో క్రిప్టోకరెన్సీలపై పరిశోధన చేసి ఓ పరిశోధన పత్రం రాశా. ఈ క్రమంలోనే మన దేశంలో పేద ప్రజల కోసం అందుబాటులో ఉన్న ఎన్నో ప్రభుత్వ పథకాలు / ఆర్థిక వనరుల గురించి తెలుసుకున్నా. అంతేకాదు.. చాలామందికి వీటిపై కనీస అవగాహన కూడా లేదన్న విషయం నాకు అర్థమైంది. మా ఇంటి పనిమనిషికి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన లేక.. ఆ సమయంలో ఎన్నో ఆర్థిక కష్టాల్ని ఎదుర్కొంది. మరో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి అప్పుల్లో కూరుకుపోవడం దగ్గర్నుంచి గమనించా. అప్పుడనిపించింది.. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే బీమా పథకాల గురించి వారికి ముందే అవగాహన ఉంటే ఈ తరహా దీన స్థితి ఎదురయ్యేది కాదని! అందుకే పేద ప్రజలకు డబ్బు పాఠాలు చెప్పాలని నిర్ణయించుకున్నా..’ అంటోందీ యువ ఆర్థిక నిపుణురాలు.

వేలాది మందిలో అవగాహన!

ఇలా తన ఆలోచనకు తన తండ్రి సహకారం తోడవడంతో గతేడాది ‘ఇన్వెస్ట్‌ ది ఛేంజ్‌’ పేరుతో ఓ సామాజిక సంస్థను నెలకొల్పింది కశ్వి. ప్రభుత్వం అందించే బీమా, ఆరోగ్య పథకాలు, పెన్షన్‌ స్కీమ్స్‌.. వంటి వాటి గురించి పేదలకు వివరిస్తూనే.. దగ్గరుండి వారితో దరఖాస్తు కూడా చేయిస్తోందామె.

‘ప్రస్తుతం మా సంస్థలో 15 మంది వలంటీర్లున్నారు. రోజువారీ కూలీలు, బస్‌ డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసే మహిళలు.. ఇలా ఇప్పటివరకు సుమారు 3 వేల మందికి ఆర్థిక అంశాల్లో అవగాహన కల్పించగలిగాం.. డబ్బు పొదుపు-మదుపుల గురించి వారిలో కనీస పరిజ్ఞానం నింపగలిగాం. అలాగే వారి అర్హతల్ని బట్టి.. కేంద్ర ప్రభుత్వం అందించే పలు పథకాల గురించీ వివరిస్తున్నాం.. వారితో దరఖాస్తు చేయిస్తున్నాం.. బ్యాంకు ఖాతాలు లేని వారితో ఖాతాలు తెరిపిస్తున్నాం. ఇందుకోసం ప్రచార కార్యక్రమాలు, ప్రత్యేక సెషన్స్‌, వర్క్‌షాప్స్‌, ప్రజెంటేషన్స్‌.. వంటివి నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వేలాది మందిని చేరుకోగలిగాం..’ అంటోంది కశ్వి.

యాప్‌ రూపొందిస్తా!

పేదలకు ఆర్థికాంశాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సులభంగా అర్థమయ్యేందుకు.. సరళమైన భాషలో వివరించడంతో పాటు ప్రజెంటేషన్స్‌/సెమినార్స్‌ నిర్వహిస్తోన్న కశ్వి.. తమ వలంటీర్లకు ఆయా ప్రాంతీయ భాషల్ని కూడా నేర్పిస్తున్నానంటోంది.

‘మేం సెషన్స్‌/సెమినార్స్‌ నిర్వహించబోయే ముందే ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతీయ భాషను మా వలంటీర్లకు నేర్పిస్తున్నాం. తద్వారా మాకు వివరించడం సులభమవుతుంది.. ప్రజలకూ ఈజీగా అర్థమవుతుంది. త్వరలోనే మా సేవల్ని మరింత మందికి విస్తరించాలని ఆలోచన చేస్తున్నాం. అలాగే పేద ప్రజల సౌకర్యార్థం ఓ యాప్‌ను కూడా రూపొందించాలని యోచిస్తున్నాం. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు.. వినియోగదారుల అర్హతల్ని బట్టి ఆయా పథకాల్ని ఆటోమేటిక్‌గా ఫిల్టర్‌ చేసి వారికి అందించేలా.. ఈ యాప్‌ను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం..’ అంటూ చెప్పుకొచ్చిందీ యంగ్‌ ఫైనాన్షియల్‌ ఎక్స్‌పర్ట్‌. ప్రస్తుతం హరియాణాలోని ‘హెరిటేజ్‌ ఎక్స్‌పీరియెన్షియల్‌ లెర్నింగ్‌ స్కూల్‌’లో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోన్న కశ్వికి.. ప్రయాణాలు, గిటార్‌ వాయించడం, ఫొటోగ్రఫీ అంటే ఇష్టమట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్