Katrina Kaif: నా అందానికి ఇవే కారణం!

అలవాట్లే మన అందాన్ని ప్రతిబింబిస్తాయి. తన విషయంలోనూ ఇది వర్కవుట్‌ అవుతుందంటోంది బాలీవుడ్‌ టాల్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌. ఆరోగ్యకరమైన జీవనశైలికి తోడు సహజసిద్ధమైన చిట్కాలు తన సౌందర్యాన్ని రెట్టింపు చేస్తున్నాయంటోంది. ఈ క్రమంలోనే తాను పాటించే బ్యూటీ సీక్రెట్స్‌....

Published : 04 Apr 2023 12:21 IST

అలవాట్లే మన అందాన్ని ప్రతిబింబిస్తాయి. తన విషయంలోనూ ఇది వర్కవుట్‌ అవుతుందంటోంది బాలీవుడ్‌ టాల్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌. ఆరోగ్యకరమైన జీవనశైలికి తోడు సహజసిద్ధమైన చిట్కాలు తన సౌందర్యాన్ని రెట్టింపు చేస్తున్నాయంటోంది. ఈ క్రమంలోనే తాను పాటించే బ్యూటీ సీక్రెట్స్‌ గురించి తరచూ సోషల్‌ మీడియాలో పంచుకునే క్యాట్‌.. ఇటీవలే మరో రహస్యాన్ని బయటపెట్టింది. దీనితో పాటు ఈ ముద్దుగుమ్మ ఆయా సందర్భాల్లో పంచుకున్న తన సౌందర్య రహస్యాలేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి..

నా రోజు ఇలా మొదలు..!

ఆరోగ్యానికైనా, అందానికైనా చక్కటి జీవనశైలి పాటించడం ముఖ్యం. ఈ క్రమంలోనే రోజూ ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా మనం అనుసరించే అలవాట్లే మన అందాన్ని ప్రతిబింబిస్తాయి. నేను రోజూ రెండు గ్లాసుల గోరువెచ్చటి నీటితో నా రోజును ప్రారంభిస్తా. ఆపై గ్లాసు పాలకూర రసం తీసుకుంటా. ఇందులో అధికంగా ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు నీటి శాతం చర్మానికి తేమనందించి మెరుపునిస్తాయి. ఇక ఆపై కొన్ని చుక్కల ఏదైనా ఫేషియల్‌ ఆయిల్‌తో ముఖాన్ని మర్దన చేసుకుంటా. ఇది చర్మంలో రక్తప్రసరణను పెంచి ముడతలు, వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చేస్తుంది.

ఐస్‌వాటర్‌తో ఆ ప్రయోజనం!

ఉదయం నిద్ర లేచే సరికి ముఖమంతా ఉబ్బినట్లుగా తయారవుతుంది. చాలామందిలో ఈ లక్షణం కనిపించినా.. మరీ తక్కువగా, మరీ ఎక్కువగా నిద్రపోయిన వారిలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు నేనైతే ఐస్‌వాటర్‌తో ఉపశమనం పొందుతా. ఒక పెద్ద బౌల్‌లో చల్లటి నీళ్లు తీసుకొని అందులో కొన్ని ఐస్‌ముక్కలు వేస్తా. ఈ నీటిలో ముఖాన్ని పలుమార్లు ముంచి బయటికి తీస్తా. ఇలా కాసేపటికి ముఖం సాధారణ స్థితికి వస్తుంది. తాజాగానూ మారుతుంది.

రెండు అల్పాహారాలు!

మనం పాటించే ఆహార నియమాలు కూడా మన అందాన్ని ప్రభావితం చేస్తాయి. చాలామంది హడావిడిలో ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ మానేస్తారు. దానివల్ల వయసు సంబంధిత సమస్యలొచ్చే అవకాశాలున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఎంత హడావిడిగా ఉన్నా అల్పాహారం మానకపోవడం మంచిది. నా విషయానికొస్తే.. నేను ఒక్కోసారి రెండుమార్లు అల్పాహారం తీసుకుంటా. ఉదయాన్నే పాలకూర రసంతో రోజూ నా మొదటి బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తవుతుంది. ఇక బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌కి మధ్య ఇడ్లీ తింటా. అది కూడా మునగాకు చట్నీ, పాలకూర చట్నీ, టొమాటో-బీట్‌రూట్‌ చట్నీ.. లేదంటే సాంబార్‌-రసంతో తీసుకుంటా.

ఇంటి చిట్కా!

షూటింగ్స్‌తో సమయం ఉన్నా, లేకపోయినా ఈ ఇంటి చిట్కా మాత్రం తప్పనిసరిగా పాటిస్తున్నా. ఓట్స్‌, తేనె కలిపి తయారుచేసిన ఫేస్‌ప్యాక్‌ను ముఖానికి, మెడకు పట్టించి.. అరగంట తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటా. ఈ ప్యాక్‌ చర్మానికి పోషణను అందించడమే కాదు.. నిర్జీవంగా మారిన చర్మాన్ని తిరిగి ప్రకాశవంతంగా మారుస్తుంది. అలాగే తరచూ స్పాకి కూడా వెళ్తుంటా. తద్వారా చర్మానికి తగిన పోషణ అంది.. పునరుత్తేజితమవుతుంది. ఇక క్రమం తప్పకుండా నేను చేసే యోగా, వ్యాయామాలు.. కూడా నా సౌందర్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

మేకప్‌ సీక్రెట్స్!

మేకప్‌ విషయంలో చాలామందికి చాలా రకాల అపోహలుంటాయి. అయితే దీనివల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతినే మాట వాస్తవమే అయినా తెరపై మేకప్‌ వేసుకోక తప్పదు కదా! అందుకే నాణ్యమైన మేకప్‌ ఉత్పత్తుల్నే ఉపయోగిస్తుంటా. మేకప్‌ వేసుకోవడానికి ముందు ముఖానికి మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకుంటా. ఫలితంగా మేకప్‌లోని రసాయనాల ప్రభావం చర్మంపై పడకుండా జాగ్రత్తపడచ్చు.. అలాగే మేకప్‌ ఎక్కువ సమయం నిలిచి ఉండేలా ఇది కాపాడుతుంది. పెదాలకు నా చర్మ రంగులో కలిసిపోయేలా న్యూడ్‌ లిప్‌స్టిక్‌నే ఉపయోగిస్తా. ఇక షూటింగ్స్‌ లేనప్పుడు మేకప్‌ వేసుకోను. ఒకవేళ అంతగా వేసుకోవాలనిపిస్తే అలా టచప్‌ ఇస్తా. మేకప్‌ వేసుకుంటే మాత్రం రాత్రి పడుకునేటప్పుడు నూనె లేదంటే మేకప్‌ రిమూవర్‌తో తప్పనిసరిగా తొలగిస్తా. తద్వారా మేకప్‌ అవశేషాలు, ఇతర మలినాలు పూర్తిగా తొలగిపోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్