అందుకే ఈ అమ్మాయి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు!

తల్లేమో ఓ ప్రైవేట్ కంపెనీలో రిసెప్షనిస్టు.. తండ్రేమో ఓ పెట్రోల్‌ బంక్‌లో పని చేస్తున్నాడు. ఇద్దరికీ ఆదాయం అంతంత మాత్రమే. కానీ కూతురు కెరీర్‌ విషయంలో రాజీ పడలేదు. బంగారు భవిష్యత్‌ అందించాలని ఉన్నత చదువులు చదివించారు.. పేరెంట్స్ రెక్కల కష్టాన్ని అర్థం చేసుకున్న ఆ అమ్మాయి కూడా బాగా చదివింది. ప్రతిష్ఠాత్మక ఐఐటీ కాన్పూర్‌లో పెట్రో కెమికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ చేస్తోంది. అందుకే ఆ అమ్మాయి గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు.

Updated : 08 Oct 2021 19:32 IST

(Photo: Twitter)

తల్లేమో ఓ ప్రైవేట్ కంపెనీలో రిసెప్షనిస్టు.. తండ్రేమో ఓ పెట్రోల్‌ బంక్‌లో పని చేస్తున్నాడు. ఇద్దరికీ ఆదాయం అంతంత మాత్రమే. కానీ కూతురు కెరీర్‌ విషయంలో రాజీ పడలేదు. బంగారు భవిష్యత్‌ అందించాలని ఉన్నత చదువులు చదివించారు.. పేరెంట్స్ రెక్కల కష్టాన్ని అర్థం చేసుకున్న ఆ అమ్మాయి కూడా బాగా చదివింది. ప్రతిష్ఠాత్మక ఐఐటీ కాన్పూర్‌లో పెట్రో కెమికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ చేస్తోంది. అందుకే ఆ అమ్మాయి గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు.

కేరళలోని పయ్యనూర్‌కు చెందిన రాజగోపాల్‌ వయసు 51 ఏళ్లు. 2005 నుంచి ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఓ ప్రైవేట్ కంపెనీలో రిసెప్షనిస్టు. వారి కూతురు ఆర్య ప్రతిష్ఠాత్మక ఐఐటీ కాన్పూర్‌లో పెట్రో కెమికల్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల తన తండ్రి పనిచేస్తోన్న పెట్రోల్‌ బంక్‌ దగ్గరకు ఆర్య  వచ్చింది. ఇలా తండ్రీకూతుళ్లను పక్కపక్కన చూసిన రాజగోపాల్ పై అధికారి సరదాగా వారిద్దరి ఫొటో తీశాడు. అందులో ఒంటిపై కంపెనీ యూనిఫాం, కాళ్లకు సాధారణ చెప్పులతో రాజగోపాల్‌ ఎంతో సింపుల్‌గా ఉండగా...పక్కనే సల్వార్ కమీజ్ లో కాలేజీ బ్యాగ్‌ వెనకేసుకుని చిరునవ్వుతో కనిపించింది ఆర్య.

అందుకే ఈ ఫొటో వైరలైంది!

తండ్రి పెట్రోల్ బంక్ అటెండర్‌... కూతురేమో పెట్రో కెమికల్‌ ఇంజినీర్‌. అది కూడా ఐఐటీ కాన్పూర్‌లో చదువుతోంది. ఇలా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చేలా ఉన్న ఈ తండ్రీకూతుళ్ల ఫొటోను పెట్రోల్‌ బంక్‌ మేనేజర్‌ తన సహోద్యోగులు, ఐవోసీ డీలర్లు, స్నేహితుల వాట్సప్‌ గ్రూపులన్నింటిలో షేర్‌ చేశాడు. దీంతో పాటు వారి విజయగాథను పంచుకున్నాడు. దీంతో ఈ తండ్రీ కూతుళ్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారారు. ట్వీట్‌ పెట్టిన 24 గంటల్లోపే సుమారు 5 లక్షల మందికి పైగా రీట్వీట్లు చేశారు. పలువురు నెటిజన్లతో పాటు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్సింగ్‌ పురి, ప్రముఖ ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారులు వీరిని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.

మా శ్రమను మర్చిపోయేలా చేస్తోంది!

చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే ఆర్య పది, ఇంటర్‌ తరగతుల్లో 98 శాతానికి పైగా మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత కాలికట్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో 78.3 శాతం మార్కులతో పెట్రో కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. ఈ క్రమంలోనే దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ కాన్పూర్‌లో సీటు తెచ్చుకుంది. ప్రస్తుతం ఎంటెక్‌ రెండో ఏడాది చదువుతోన్న ఆమె గురించి తండ్రి రాజగోపాల్ మాట్లాడుతూ.. ‘నా భార్య ఓ ప్రైవేట్‌ కంపెనీలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. ఇద్దరికీ ఆదాయం అంతంత మాత్రమే. అయితే మా కుమార్తె చదువు విషయంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. మా బిడ్డ కూడా అన్నింటా మంచి మార్కులు తెచ్చుకుంటోంది. తన ప్రతిభతో మా శ్రమను మరిచిపోయేలా చేస్తోంది.’

మా సంస్థలోనే ఇంజినీర్‌గా చూడాలనుంది!

‘ఇక అమ్మాయి చదువు విషయానికొస్తే... మేమింకా తన హాస్టల్‌, ఇతరత్రా ఫీజులు చెల్లించాల్సి ఉంది. వీటి గురించి కొంచెం ఆందోళనగా ఉంది. అయితే వీలైనంత త్వరలో ఈ చెల్లింపులు పూర్తి చేస్తాం. నేను రెండు దశాబ్దాలుగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ కంపెనీలో పని చేస్తున్నాను. మా అమ్మాయిని పెట్రో కెమికల్‌ ఇంజినీర్‌గా చూడాలనుకుంటున్నాను. అది మా ఐవోసీ సంస్థలో అయితే అంతకు మించిన సంతోషం ఉండదు’ అని ఆర్య తండ్రి చెప్పుకొచ్చారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్