Updated : 14/07/2021 20:28 IST

పట్టులాంటి జుట్టు కోసం నేనేం చేస్తానంటే...!

వయసు పెరిగే కొద్దీ జుట్టు తెల్లబడడం, రాలడం ప్రారంభమవుతుంది. దీనికి తోడు రోజురోజుకీ పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆందోళనలు శిరోజాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో వివిధ రకాల హెయిర్‌ ప్యాక్‌లు, మాస్క్‌లతో తమ కురులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు చాలామంది. ఈ క్రమంలో తన పట్టులాంటి జుట్టుకు కారణమైన ఓ న్యాచురల్‌ హెయిర్‌ ప్యాక్‌ గురించి ఇన్‌స్టాలో పంచుకుంది అందాల తార ఖుష్బూ సుందర్.

శిరోజాల సంరక్షణ కోసం!

దక్షిణాది సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఖుష్బూ. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మకు గుడి కట్టి ఆరాధించే అభిమానులు కూడా ఉన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా మారిపోయిన ఈ అందాల తార సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటుంది. తన గ్లామరస్‌ ఫొటోలతో పాటు అప్పుడప్పుడు హెల్త్‌ టిప్స్‌ను కూడా పంచుకుంటుంది. ఈ క్రమంలో- జుట్టు సంరక్షణ కోసం తాను ఉపయోగించే ఓ హెయిర్‌ ప్యాక్‌ను తాజాగా ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. మరి ఆ హెయిర్‌ ప్యాక్‌ తయారీ గురించి మనమూ తెలుసుకుందాం రండి.

కావాల్సిన పదార్థాలు

* మెంతులు

* మందార పూలు

* మందార ఆకులు

* పెరుగు

* గుడ్లు

* లావెండర్‌ / రోజ్‌మేరీ ఆయిల్

తయారీ విధానం

ఒక కప్పు నీటిలో మెంతుల్ని రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు వీటిని వడకట్టి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీనిలో మందార పూలు, మందార ఆకులు, పెరుగు, గుడ్లను వేసి మరోసారి రుబ్బుకోవాలి. ఆ తర్వాత కొన్ని చుక్కల లావెండర్‌ / రోజ్‌మేరీ ఆయిల్‌ను జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం జుట్టుకు పట్టించి గంటపాటు ఆరనివ్వాలి. ఆపై గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. అదేవిధంగా మంచి హెయిర్‌ కండిషనర్‌ను అప్లై చేసుకోవాలి.

నాకిష్టమైన హెయిర్ ప్యాక్!

ఈ న్యాచురల్‌ హెయిర్‌ ప్యాక్‌ను తన జుట్టుకు పట్టించి ఆ ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది ఖుష్బూ. ‘నేను...నాకు ఇష్టమైన హెయిర్‌ ప్యాక్‌. శిరోజాల ఆరోగ్యం గురించి నన్ను చాలామంది అడుగుతున్నారు. వారి కోసమే ఈ హెల్దీ హెయిర్‌ ప్యాక్‌. ఇది జుట్టును దృఢంగా, మృదువుగా, ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది’ అని రాసుకొచ్చింది.

 

ప్రయోజనాలివే!

ఈ హెయిర్‌ ప్యాక్‌ను తరచుగా జుట్టుకు పట్టించుకోవడం వల్ల పలు ప్రయోజనాలున్నాయి. అవేంటంటే...

* న్యాచురల్‌ మాయిశ్చరైజర్‌లా జుట్టుకు అవసరమైన తేమను అందిస్తుంది. ఫలితంగా జుట్టు పొడిబారదు.

* జుట్టు చిక్కుబడిపోయే సమస్యను తగ్గిస్తుంది.

* కుదుళ్ల చివరలు చిట్లడం, హెయిర్‌ ఫాల్‌ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

* శిరోజాలను మృదువుగా మారుస్తుంది.

* ఇక ఈ హెయిర్‌ ప్యాక్‌కి ఉపయోగించిన మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ ఎ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టులోని ఫ్రీ ర్యాడికల్స్‌ను తగ్గిస్తాయి. వీటిలోని బీటా కెరోటిన్‌ జుట్టు ఆరోగ్యానికి బాగా సహకరిస్తుంది.

* మెంతుల్లో అరవై శాతం కార్బొహైడ్రేట్లు ఉంటాయి. ఇవి కురులను దృఢంగా మార్చుతాయి.

* మెంతుల్లో ఉండే ప్రొటీన్‌, నికోటినిక్‌ యాసిడ్‌ ఇటు కుదుళ్లు, అటు జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం.

* మందార పువ్వు కుదుళ్ల పీహెచ్‌ స్థాయుల్ని బ్యాలన్స్‌ చేయడంతో పాటు కుదుళ్లు జిడ్డుగా మారకుండా, తెల్లజుట్టు రాకుండా కాపాడుతుంది.

* న్యాచురల్‌ కండిషనర్‌గా పని చేసే పెరుగు జుట్టు చివర్లు చిట్లడాన్ని నిరోధిస్తుంది. అంతేగాక చుండ్రు, జిడ్డు, హెయిర్‌ ఫాల్‌ తదితర సమస్యలను కూడా దూరం చేస్తుంది.

* గుడ్లలోని పోషకాలు, విటమిన్లు జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి. ముఖ్యంగా పచ్చసొనలోని లూటీన్ కురులకు తేమను అందించి, మెరిసేలా చేస్తుంది.

* లావెండర్‌ నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జుట్టుకు వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని