ఆ ట్యాక్సీ డ్రైవరే.. ఇప్పుడు యూకే యూనివర్సిటీలో సీటు సాధించి..!
ఒకానొక సమయంలో ట్యాక్సీ డ్రైవర్‌గా మారి.. పెద్ద కొడుకుగా కుటుంబ బాధ్యతల్ని భుజాలకెత్తుకున్న ఆమె కృషి, పట్టుదల వ్యర్థం కాలేదు. తాజాగా విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే అరుదైన అవకాశాన్ని తెచ్చిపెట్టాయి.. ప్రముఖ యూనివర్సిటీలో సీటు సంపాదించి పెట్టాయి.
(Photos: Twitter)
‘కష్టాలు నిన్ను సాధించడానికి రావు.. నీ శక్తిసామర్థ్యాలను వెలికి తీసేందుకు వస్తాయ’న్నారు అబ్దుల్ కలాం. ఇలా తన జీవితంలోనూ అడుగడుగునా స్వాగతం పలికిన కష్టాలకు ఎదురునిలుస్తూ మరింతగా రాటుదేలిపోయింది మహారాష్ట్రకు చెందిన కిరణ్ కుర్మావర్. ఇంట్లో పేదరికం, బయట కనీస సౌకర్యాల్లేక, చదువుకునే వెసులుబాటు లేక.. పలు ఒడిదొడుకుల్ని ఎదుర్కొన్నా.. చదువుకోవాలన్న పట్టుదలే ఆమెను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించాయి. ఒకానొక సమయంలో ట్యాక్సీ డ్రైవర్‌గా మారి.. పెద్ద కొడుకుగా కుటుంబ బాధ్యతల్ని భుజాలకెత్తుకున్న ఆమె కృషి, పట్టుదల వ్యర్థం కాలేదు. తాజాగా విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే అరుదైన అవకాశాన్ని తెచ్చిపెట్టాయి.. ప్రముఖ యూనివర్సిటీలో సీటు సంపాదించి పెట్టాయి. ‘చదువుతోనే ఉన్నతి సాధ్యమం’టోన్న కిరణ్ స్ఫూర్తి ప్రయాణం నేటి యువతకు ఆదర్శం!
కిరణ్‌ది మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని రేగుంట అనే చిన్న గ్రామం. దాదాపుగా 500 మంది జనాభా ఉండే ఈ గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిందామె. తండ్రి ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటారు. కిరణ్‌కు ఇద్దరు అక్కలు కాగా, వారిద్దరూ పెళ్లి చేసుకొని స్థిరపడ్డారు. అయితే ఈ కుగ్రామంలో కనీస వసతులే కాదు.. పాఠశాల, కళాశాల.. వంటి సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే!
ట్యాక్సీ డ్రైవర్‌గా..!
అయినా ఉన్న వనరుల్నే అందిపుచ్చుకొని స్థానికంగా స్కూలింగ్ పూర్తి చేసింది కిరణ్. ఆపై హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ, ఎంఏ ఎకనామిక్స్ పూర్తిచేసిన ఆమె.. దిల్లీలో ఓ చిన్న ఉద్యోగంలో చేరింది. ఆపై కొన్నాళ్లకు అనుకోకుండా తన తండ్రికి ప్రమాదం జరగడంతో.. కుటుంబ భారమంతా కిరణ్ పైనే పడింది. దాంతో ఆమె ఉద్యోగం వదిలేసి ఇంటికి చేరక తప్పలేదు. ఆపై తన తండ్రి నడిపే ట్యాక్సీ స్టీరింగ్ చేతపట్టిన ఆమె.. అటు పలు సవాళ్లను ఎదుర్కొంటూనే.. ఇటు గుర్తింపునూ సంపాదించుకుంది.
‘మా గ్రామంలో గరిష్టంగా 500 మంది జనాభా ఉంటారు. వారిలో దాదాపు అందరూ నిరక్ష్యరాస్యులే! వాళ్ల పిల్లల్నైనా స్కూల్లో చేర్పిద్దామని ప్రయత్నిస్తే.. అదీ కుదరలేదు. పైగా ‘ఎంఏ చదివి నువ్వేం సాధించావ్? ట్యాక్సీ తోలుతున్నావ్!’ అని విమర్శించేవారు. అయినా మారు మాట్లాడకుండా మిన్నకుండిపోయా. ఏదో ఒక రోజు చదువు పవరేంటో నిరూపించాలనుకునేదాన్ని. మరోవైపు నా ట్యాక్సీలో ఎక్కే ప్రయాణికులూ నన్ను నిరుత్సాహపరిచేవారు. ‘అసలే మహిళా డ్రైవర్.. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతుందా?’ అనేవారు..’ ఇలా తనకెదురైన చేదు అనుభవాల్ని గుదిగుచ్చింది కిరణ్.
పగలంతా స్టీరింగ్.. రాత్రి పుస్తకాలు!
రోజూ రేగుంట నుంచి సిరోంచా వరకు దాదాపు 75 కిలోమీటర్ల దూరం ట్యాక్సీ నడిపేది కిరణ్. ఇలా తోటి వారి సూటిపోటి మాటలకు తోడు.. కొండ ప్రాంతపు రహదారి కావడంతో ట్యాక్సీ నడపడం కూడా సవాలుగా మారేది. మరోవైపు నక్సలైట్ల భయం! అయినా సరే.. మరో రెండు ట్యాక్సీలను అద్దెకు తీసుకొని.. ఇద్దరు డ్రైవర్లను పనిలో పెట్టుకుంది. అలా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకూ తన ట్యాక్సీ సేవల్ని విస్తరించిందామె. ఇలా ఓవైపు పగలంతా ట్యాక్సీ నడపడంలో బిజీగా ఉన్నా.. రాత్రుళ్లు చదువుకునేది కిరణ్. ఇక కొన్ని నెలల తర్వాత తన తండ్రి కోలుకొని తిరిగి పనిలోకి రావడంతో.. తన చదువుపై పూర్తి దృష్టి సారించిందామె. ఈ క్రమంలోనే విదేశీ యూనివర్సిటీల్లో చదువుకునేందుకు ప్రవేశ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవడం, వాటికి సన్నద్ధమవడం ప్రారంభించింది.
‘ఇందులో భాగంగానే ‘ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (IELTS)’ పరీక్షలో ఉత్తీర్ణత సాధించా. తద్వారా యూకేలోని ప్రతిష్టాత్మక లీడ్స్ యూనివర్సిటీలో ‘ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్’లో ఎమ్మెస్సీ చదువుకునే అరుదైన అవకాశమొచ్చింది. ఈ కల నెరవేర్చుకోవడానికే ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలిశాను. నా కష్టాలు, పట్టుదలను గుర్తించిన ఆయన.. వెంటనే రూ. 40 లక్షల స్కాలర్‌షిప్ మంజూరు చేశారు..’ అంటూ తన కల నెరవేరబోతున్నందుకు సంబరపడిపోతోంది కిరణ్.
విద్య పవరేంటో చూపిస్తా!
ఇప్పటికే తన డ్రైవింగ్ నైపుణ్యాలతో.. ‘మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ట్యాక్సీ నడిపిన అతి పిన్న మహిళా డ్రైవర్’గా నోబుల్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది కిరణ్. అలాగే ‘మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ట్యాక్సీ నడిపిన ఏకైక మహిళా డ్రైవర్’గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకుంది. ఇక వివిధ సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థల నుంచి 18కి పైగా అవార్డులూ సొంతం చేసుకుంది. అంతేకాదు.. వివిధ అంశాల్లో ఆరుకు పైగా రికార్డులూ తన పేరిట ఉన్నాయి. ఇక ఇప్పుడు బ్రిటన్‌లో చదువుకునే అరుదైన అవకాశం అందుకొని.. మరోసారి తన కష్టాలకు ఎదురు నిలిచి చూపించిందామె.
‘బ్రిటన్‌లో కోర్సు పూర్తి చేసుకొని తిరిగొచ్చాక.. మా ఊరి అభివృద్ధిపై దృష్టి పెడతా. మా గ్రామంలో ప్రతి ఒక్కరూ చదువుకునేలా ప్రోత్సహించాలనుకుంటున్నా. తద్వారా విద్య పవరేంటో వారికి చూపించాలనుకుంటున్నా..’ అంటూ తన భవిష్యత్ లక్ష్యాల గురించి చెబుతోందీ ట్యాలెంటెడ్ గర్ల్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.