ప్యారిస్‌ పరేడ్‌లో.. మనమ్మాయిలు!

చిన్నప్పుడు నింగిలోకి ఎగిరే విమానాలను చూసి.. తానూ ఏదో ఒక రోజు ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంది.. తన లక్ష్యానికి దేశ సేవను జోడిస్తూ వైమానిక దళ పైలట్‌గా తన చిన్ననాటి కలను సాకారం చేసుకుంది బెంగళూరుకు చెందిన సింధూ....

Published : 15 Jul 2023 12:30 IST

చిన్నప్పుడు నింగిలోకి ఎగిరే విమానాలను చూసి.. తానూ ఏదో ఒక రోజు ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంది.. తన లక్ష్యానికి దేశ సేవను జోడిస్తూ వైమానిక దళ పైలట్‌గా తన చిన్ననాటి కలను సాకారం చేసుకుంది బెంగళూరుకు చెందిన సింధూ రెడ్డి. తన పదకొండేళ్ల వైమానిక కెరీర్‌లో పలు ఘనతలు సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు మరో కీర్తిని తన కిరీటంలో చేర్చుకుంది. తాజాగా ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన త్రివిధ దళాల కవాతులో.. వైమానిక దళానికి నాయకత్వం వహించిందామె. తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదంటోన్న ఈ డేరింగ్‌ పైలట్‌ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..!

ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవం/స్వాతంత్ర్య దినోత్సవాన్ని ‘బాస్టిల్‌ డే’గా పిలుస్తారు. ఏటా జులై 14న ప్యారిస్‌ వేదికగా ఈ వేడుకలు జరుగుతాయి. అయితే భారత్‌-ఫ్రాన్స్‌ ద్వైపాక్షిక మైత్రికి ఈ ఏడాదితో పాతికేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని.. ఫ్రెంచ్‌ సైన్యంతో కలిసి భారత త్రివిధ దళాలూ పరేడ్‌లో పాల్గొన్నాయి. ఇందులో భాగంగా.. 68 మందితో కూడిన భారత వైమానిక దళానికి నేతృత్వం వహించి వార్తల్లో నిలిచింది సింధు.

మనసు తెలుసుకోవాలి!

2012 నుంచి ఎంఐ-17 హెలికాప్టర్‌ పైలట్‌గా కొనసాగుతోన్న సింధు.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కర్తవ్య పథ్‌లో నిర్వహించిన వైమానిక దళ కవాతులో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే విదేశీ గడ్డపై పరేడ్‌లో పాల్గొనడం, అందులోనూ వైమానిక దళానికి నాయకత్వం వహించడం గొప్ప అనుభూతి అంటోందామె.

‘ఇది నేను గర్వించదగ్గ క్షణం. విదేశీ గడ్డపై వైమానిక దళ బృందానికి నేతృత్వం వహిస్తానని కలలో కూడా అనుకోలేదు. నా ప్రతిభను గుర్తించి నాకీ అవకాశమిచ్చిన ఎయిర్‌ఫోర్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రస్తుతం నేనీ స్థాయిలో ఉన్నానంటే అందుకు పట్టుదల, కృషి, అంకితభావమే కారణం. దీనికి తోడు అమ్మానాన్నల ప్రోత్సాహం కూడా ఎంతో! ఈ సందర్భంగా నేటి యువతకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా.. మనం ఎక్కడ, ఏ దశలో ఉన్నామన్నది ముఖ్యం కాదు.. మనం ఏం కావాలనుకుంటున్నామన్నదే మనల్ని నలుగురిలో ఒక్కరిగా నిలబెడుతుంది.. దీనికి పట్టుదల తోడైతే అసాధ్యమనుకున్నవి కూడా సాధ్యమవుతాయి. అదే అసలైన జీవితం. అంతేకానీ.. ఎవరో ఏదో అన్నారని, మన దారికి అడ్డుపడ్డారని అక్కడే ఆగిపోకూడదు..’ అంటోందీ స్క్వాడ్రన్‌ లీడర్‌. తేలికపాటి యుద్ధ విమానాలతో పాటు, వ్యూహాత్మక యుద్ధ విమానాలు నడపడంలోనూ ఆమె దిట్ట.

అక్కడే బీజం!

తన మాటలతో నలుగురిలో స్ఫూర్తి నింపడమే కాదు.. తన జీవితంలో తానూ ఇదే సిద్ధాంతాన్ని పాటించానంటోంది సింధు.

‘చిన్నతనంలో బెంగళూరులో అమ్మతో కలిసి తరచూ ఎయిర్‌షోలకు వెళ్లేదాన్ని. అక్కడ వైమానిక విన్యాసాల్ని చూస్తూ మైమరచిపోయేదాన్ని. ఎప్పటికైనా నేనూ అలా గాల్లో ఎగరాలనుకున్నా. నా కలను అమ్మతో పంచుకున్నా. తనూ నన్ను ప్రోత్సహించింది. ఇలా ఇక్కడే నా పైలట్‌ కలకు బీజం పడింది..’ అంటూ తన కెరీర్ మొదలైన తీరును గుర్తు చేసుకుందీ సాహస పైలట్‌. ఇక ప్యారిస్‌ పరేడ్‌లో ఐఏఎఫ్‌ బృందానికి నాయకత్వం వహించిన సింధు.. అటు ఫ్రెంచి ప్రజల మనసులు దోచుకోవడంతో పాటు.. ఇటు పలువురు భారతీయ ప్రముఖుల మన్ననలూ అందుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా, అపోలో ఆస్పత్రుల జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతా రెడ్డి.. సింధు వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘మీ అరుదైన ప్రతిభతో మమ్మల్ని, దేశాన్ని గర్వపడేలా చేశారు..’ అంటూ ఆమెను ప్రశంసించారు.


నావికా దళ నాయకురాలు!

బాస్టిల్‌ డే పరేడ్‌లో వైమానిక దళానికే కాదు.. నావికా దళానికి నేతృత్వం వహించింది కూడా మహిళే! ఈ అవకాశాన్ని మంగళూరుకు చెందిన నేవీ అధికారిణి దిశా అమృత్‌ సొంతం చేసుకుంది. నలుగురు నావికా దళ అధికారులు, 64 మంది నావికులున్న బృందానికి నాయకత్వం వహించింది దిశ. బోలూరు సమీపంలోని తిలక్‌ నగర్‌ వాసి అయిన ఆమె.. స్కూలింగ్‌ దశలోనే ఎన్‌సీసీలో చేరింది. పాఠశాలలో చదువుతున్నప్పుడే రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపికైంది. కంప్యూటర్ సైన్స్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన దిశ.. కొన్నేళ్ల పాటు ఐటీ ఉద్యోగం చేసింది. కానీ తన లక్ష్యం రక్షణ రంగంలోకి రావడం! ఈ మక్కువతోనే ఉద్యోగాన్ని వదులుకొని మరీ 2016లో నేవీకి ఎంపికైంది. ఏడాది శిక్షణ తర్వాత అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో విధుల్లో చేరిందామె. ప్రస్తుతం అక్కడే ‘నేవల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌’గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ‘ఈ అరుదైన అవకాశం దక్కడం ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను..’ అంటోన్న దిశ.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవంలోనూ నేవీ బృందానికి నాయకత్వం వహించి అందరి దృష్టినీ ఆకర్షించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్