Updated : 10/12/2021 20:15 IST

VicKat Wedding: ఆ ఒక్కమాట ఇద్దరినీ ఒక్కటి చేసింది!


(Photo: instagram)

వారిద్దరూ కలిసి నటించలేదు.. అయినా ఒకరిపై ఒకరు గుండెల్లో దాచుకోలేనంత ఇష్టాన్ని పెంచుకున్నారు.. సందర్భం దొరికినప్పుడల్లా ‘నా మనసంతా నువ్వే’ అంటూ పరోక్షంగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక విడిచి ఉండలేమంటూ తమ ప్రేమబంధాన్ని తాజాగా ప్రణయబంధంగా మార్చుకున్నారు. వారే బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ కత్రినా కైఫ్‌ - విక్కీ కౌశల్‌. రెండేళ్ల పాటు డేటింగ్‌ చేసిన ఈ జంట.. ఎక్కడా తమ అనుబంధం గురించి అధికారికంగా చెప్పింది లేదు. పార్టీల్లో సరదాగా ఫొటోలకు పోజులివ్వడం తప్ప ప్రేమికుల్లా కలిసి దిగిన ఫొటో ఒక్కటీ లేదు. దీంతో అసలు వీళ్ల ప్రేమ ఎప్పుడు, ఎక్కడ మొదలైంది? ఎవరు ఎవరికి ప్రపోజ్‌ చేశారు?.. వంటి విషయాలు తెలుసుకోవాలన్న ఆరాటం చాలామందిలోనే ఉంది. అయితే ఆలస్యమెందుకు.. ఈ ముద్దుల జంట ప్రేమకథ, పెళ్లి ముచ్చట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

కత్రినా-విక్కీ.. కొన్ని రోజుల నుంచి వీళ్ల ప్రేమ, పెళ్లి గురించి బయట రూమర్స్‌ వస్తున్నా.. తమని కాదేమోనన్నట్లుగా అస్సలు పట్టించుకోలేదీ జంట. అత్యంత గోప్యంగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి.. తమ పెళ్లి ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరినీ ఒకింత ఆశ్యర్యంలో, సంతోషంలో ముంచెత్తారీ లవ్లీ కపుల్‌. అందరి ఆశీర్వాదాలు కావాలని కోరారు.

‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’!

‘ప్రేమ, సంతోషం కలగలిసిన అద్భుత క్షణమిది. మా కొత్త జీవితానికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి..’ అంటూ తమ పెళ్లిలోని కొన్ని ఘట్టాల్ని ఫొటోల రూపంలో అభిమానులతో పంచుకుందీ అందాల జంట. దీంతో సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి విక్కీ కంటే కత్రినా ఐదేళ్లు పెద్ద. దీంతో వీళ్ల జంట ఎలా ఉంటుందోనని ఒకప్పుడు సందేహించిన వారే ఇప్పుడు.. ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అంటూ తెగ పొగిడేస్తున్నారు. వీళ్ల వివాహానికి రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారా కోట వేదికగా నిలిచింది. ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది అతిథులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారీ బాలీవుడ్‌ కపుల్‌.

ప్రతిదీ ప్రత్యేకమే!

తమ పెళ్లిలో వధూవరులిద్దరూ ప్రముఖ డిజైనర్‌ సబ్యసాచి ముఖర్జీ రూపొందించిన దుస్తులు ధరించి రాయల్‌గా మెరిసిపోయారు. ఐవరీ కలర్‌ కుర్తా-చుడీదార్‌ ధరించిన విక్కీ.. ఎమరాల్డ్స్‌, రోజ్‌కట్‌ డైమండ్స్‌ పొదిగిన నెక్‌ పీస్‌లో రాకుమారుడిలా కనిపించాడు. ఇక క్యాట్‌ బ్రైడల్‌ అటైర్‌ దగ్గర్నుంచి యాక్సెసరీస్‌ దాకా ప్రతిదీ ప్రత్యేకమే అని చెప్పాలి.

* సంప్రదాయానికి తగినట్లుగా ఎరుపు రంగు భారీ ఎంబ్రాయిడరీ లెహెంగాను ఎంచుకున్న ఈ బాలీవుడ్‌ బొమ్మ.. దానిపై మ్యాచింగ్‌ కలర్‌ వెయిల్‌ను జత చేసింది. విక్కీ పంజాబీ మూలాల్ని చాటేలా ఈ వెయిల్‌ని క్యాట్‌ ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్నట్లు డిజైనర్లు చెబుతున్నారు.

* ఇక కత్రినా చేతులకు ధరించిన Kaleeras (హ్యాంగింగ్స్‌తో కూడిన గాజులు) ఆమె లుక్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచాయని చెప్పచ్చు. ఎందుకంటే బైబిల్‌లోని కొన్ని పదాల్ని రాతపూర్వకంగా జత చేసి మరీ ప్రత్యేకంగా వీటిని డిజైన్‌ చేయించుకుందట క్యాట్‌.

* తన అందంతోనే కాదు.. పెళ్లిలో ఓ విలువైన ఉంగరం తొడిగి మరోసారి తన మనోహరి మనసు దోచుకున్నాడు విక్కీ. ఇలా ఈ హ్యాండ్‌సమ్‌ తన భార్య చేతికి తొడిగిన ఉంగరం ధర సుమారు ఏడున్నర లక్షలుంటుందట! అలాగే కత్రినా కూడా తన ఇష్టసఖుడి కోసం విలువైన ఉంగరాన్నే ఎంచుకుందట!

* ఈమధ్య బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు ఎంచుకునే మంగళసూత్రాలు ఎంతో విభిన్నంగా ఉంటున్నాయి. క్యాట్‌ కూడా అలాంటిదే ఎంచుకుంది. సబ్యసాచి స్వయంగా చేత్తో రూపొందించిన ‘బెంగాల్‌ టైగర్‌ మంగళసూత్రాన్ని’ తన వివాహం కోసం ఎంపిక చేసుకుందీ బాలీవుడ్‌ బేబ్‌. ఇక దీని లాకెట్‌లో రెండు డైమండ్స్‌ పొదిగి ఉండడంతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

* ఒకటి కాదు.. రెండు మాతాపట్టీల్ని అలంకరించుకొని మెరిసిపోయింది క్యాట్‌. అన్‌కట్‌ డైమండ్స్‌తో రూపొందించిన భారీ చోకర్‌ని మెడలో అలంకరించుకున్న ఈ ముద్దుగుమ్మ.. పూలతో అలంకరించిన బన్‌ హెయిర్‌స్టైల్‌లో మెరుపులు మెరిపించింది.
ఇలా అవడానికి బ్రిటిష్‌ బ్యూటీనే అయినా.. సంప్రదాయ ఇండియన్‌ బ్రైడ్‌గా కనిపించి అందరినీ మెప్పించింది క్యాట్‌.

తనతో జోడీ బాగుంటుంది!

సెలబ్రిటీల ప్రేమకథలంటే.. చెట్టపట్టాలేసుకొని పార్టీలు, వెకేషన్లకు తిరగడం, ప్రముఖుల పెళ్లిళ్లకు కలిసే హాజరవడం, ఒకరిపై ఒకరికున్న ఇష్టాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో తెలియజేయడం.. ఇవన్నీ ఉంటాయి. కానీ కత్రినా-విక్కీ జంట ప్రేమకథలో ఇవన్నీ ఉన్నా తెర వెనక్కే పరిమితమయ్యాయి. అయితే 2018లో ఓసారి ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొన్న క్యాట్‌.. మాటలో మాటగా ‘తెరపై విక్కీతో నా జోడీ బాగుంటుంది..’ అనేసింది. విక్కీపై తనకున్న ఇష్టమే కత్రినాతో ఇలా మాట్లాడేలా చేసిందని గుసగుసలాడుకున్నారంతా! ఇక ఇదే విషయాన్ని మరో ఎపిసోడ్‌లో పాల్గొన్న విక్కీతో చెప్పాడు కరణ్‌. దీంతో ఒక్కసారిగా షాకై.. సొమ్మసిల్లి పడిపోయినంత పనిచేశాడీ హ్యాండ్‌సమ్‌. నిజానికి కత్రినా అంటే తనకూ అప్పటికే బోలెడంత అభిమానమంటాడీ లవర్‌బాయ్‌.

నన్ను పెళ్లి చేసుకుంటావా?

ఆ తర్వాత ‘టేప్‌క్యాస్ట్‌ సీజన్‌ 2’ షో పాల్గొన్న వీరు.. ఎంతో సరదాగా మాటలు మార్చుకున్నారు. ఈ క్రమంలో వీళ్ల మాటల్లో, చూపుల్లో ఒకరిపై ఒకరికి ప్రేమ కనిపించిందంటూ అప్పట్లో ఫ్యాన్స్‌ చెవులు కొరుక్కున్నారు. ఆపై ఓ అవార్డ్‌ షోలో భాగంగా.. వేదిక పైనే ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని సరదాగా అడిగేశాడు విక్కీ. ‘అంత ధైర్యం లేదు’ అంటూ ముసిముసిగా నవ్వుతూ బదులిస్తూ.. ఆ టాపిక్‌ని అక్కడితో ముగించేసింది క్యాట్‌. ఇక ఆపై సెలబ్రిటీల పెళ్లిళ్లు, పార్టీలు, పండగ వేడుకల్లో ఇద్దరూ కలిసే ఫొటోలకు పోజిచ్చే సరికి వీరి మధ్య ఏదో నడుస్తోందన్న వార్తలకు బలం చేకూరింది. ‘Uri’ సినిమా ప్రీమియర్‌ షోకీ జంటగానే వెళ్లారు విక్యాట్‌. ఎన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నా వీళ్లు మాత్రం తమ ప్రేమ మౌనవ్రతాన్ని మాత్రం వీడలేదు. అయితే అనిల్‌ కపూర్‌ కొడుకు హర్ష్‌వర్ధన్‌ కపూర్‌ మొన్నామధ్య ఓ షోలో భాగంగా.. ‘అవును.. విక్కీ-కత్రినా కలిసే ఉంటున్నారు. ఇప్పుడీ విషయం బయటికి చెప్పి నేను సమస్యలో పడ్డానేమో? ఈ విషయం గురించి వాళ్లు ఓపెన్‌గా ఉన్నారేమో అనుకుంటున్నా..’ అంటూ అసలు విషయం చెప్పే సరికి వీళ్లిద్దరి లవ్‌స్టోరీపై ఉన్న సందిగ్ధానికి తెరపడింది.

ఏదేమైనా రెండేళ్ల తమ ప్రేమబంధాన్ని నూరేళ్ల ప్రణయ బంధంగా మార్చుకున్న ఈ బ్యూటిఫుల్‌ కపుల్‌కి మనమూ శుభాకాంక్షలు చెప్పేదాం..! హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ లవ్లీ కపుల్‌!గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని