బ్లాక్ ఫంగస్: దంతాల పరిశుభ్రత కూడా ముఖ్యమే!

ఒకవైపు కరోనా వైరస్‌తో ప్రజలు సతమతమవుతుంటే మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ భయం వెంటాడుతోంది. ‘మ్యూకర్‌మైకోసిస్‌‌’గా పేర్కొనే ఈ ఫంగస్‌ వల్ల చాలామంది మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఫంగస్‌ బారిన పడినవాళ్లలో అధిక శాతం ఈఎన్‌టీ సమస్యలతోనే బాధపడుతున్నారు. ఈ క్రమంలో నోటికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటున్నారు దంత వైద్య నిపుణులు.

Published : 22 Jun 2021 18:39 IST

ఒకవైపు కరోనా వైరస్‌తో ప్రజలు సతమతమవుతుంటే మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ భయం వెంటాడుతోంది. ‘మ్యూకర్‌మైకోసిస్‌‌’గా పేర్కొనే ఈ ఫంగస్‌ వల్ల చాలామంది మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఫంగస్‌ బారిన పడినవాళ్లలో అధిక శాతం ఈఎన్‌టీ సమస్యలతోనే బాధపడుతున్నారు. ఈ క్రమంలో నోటికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటున్నారు దంత వైద్య నిపుణులు.

వారికే అధికం...

వాతావరణంలో సహజంగా ఉండే మ్యూకర్‌ అనే ఫంగస్‌ వల్ల ఈ వ్యాధి వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే దీనిని ‘మ్యూకర్‌మైకోసిస్‌‌’గా పిలుస్తున్నారు. ఈ ఫంగస్‌ ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్న లేదా కోలుకుంటోన్న వారికి ఎక్కువగా సోకుతోంది. అలాగే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, స్టెరాయిడ్లను మోతాదుకు మించి తీసుకునేవారు, ఆక్సిజన్‌ లేదా వెంటిలేటర్‌ సపోర్టు తీసుకున్నవారు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి బ్లాక్‌ ఫంగస్‌ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

నోటికి సంబంధించిన సమస్యలు...

ఈ బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడిన వారికి ప్రధానంగా చిగుళ్ల రంగు పాలిపోవడం, దంత సమస్యలు, ముక్కు మూసుకుపోవడం, ముఖంలో వాపు రావడం, కంటికి సంబంధించిన సమస్యలు, జ్వరం, తలనొప్పి వంటివి కనిపిస్తున్నాయి. అయితే వీటిలో చాలావరకు నోటికి సంబంధించిన సమస్యలు కావడంతో దంతాలకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు దంత వైద్య నిపుణులు. తద్వారా బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడే అవకాశం కొంతమేర తగ్గుతుందని కూడా చెబుతున్నారు. అవేంటో చూద్దాం రండి..

ఆ విషయంలో అశ్రద్ధ వద్దు!

మనం ఉదయం లేవగానే బ్రష్‌ చేయనిదే పని మొదలవ్వదు. కానీ కొంతమంది బ్రష్‌ చేయడానికి కూడా బద్ధకిస్తుంటారు. ఇలాంటివారు ఏదో చేశాంలే అని సరిపెట్టేస్తారు. అయితే ఇలాంటి వారికి నోటిలో బ్యాక్టీరియా చేరి దంత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువని మనం ఎన్నోసార్లు వినే ఉంటాం. మహమ్మారి విరుచుకుపడుతున్న సమయంలో దంతాల పరిశుభ్రత విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.

రెండు మూడు సార్లు..

కరోనా బారిన పడిన వారు స్టెరాయిడ్లు, ఇతర మందులు తీసుకోవడం వల్ల నోటిలో ఉన్న బ్యాక్టీరియా పెరగడానికి దోహదం చేస్తోందని, దానివల్ల కూడా ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు. కాబట్టి ఇప్పటి నుంచైనా క్రమం తప్పకుండా దంతాలను శుభ్రం చేసుకోవాలంటున్నారు నిపుణులు. అయితే ఎప్పటిలాగా రోజుకి ఒక్కసారి కాదు.. ఈ సమయంలో రెండు నుంచి మూడు సార్లు బ్రష్‌ చేయడం మంచిదట.

మౌత్‌వాష్‌తో..

అంతేకాదు.. బ్రష్‌ చేయగానే మౌత్‌వాష్‌ లిక్విడ్‌తో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ మీకు మౌత్‌వాష్‌ వాడే అలవాటు లేకపోతే గోరువెచ్చని నీళ్లలో ఉప్పు వేసి ఆ నీళ్లను పుక్కిలించాలి.

బ్రష్‌ ఎక్కడ పెడుతున్నారు?

అలాగే కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు తమ టూత్‌బ్రష్‌, టంగ్‌క్లీనర్‌ని వేరుగా ఉంచాలి. అలాగే మీ టూత్‌బ్రష్‌, టంగ్‌క్లీనర్‌ని ఎప్పటికప్పుడు యాంటీసెప్టిక్ మౌత్‌వాష్‌తో శుభ్రపరుచుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్