Updated : 20/09/2021 18:02 IST

Teen Career : తల్లిదండ్రులూ.. ఇవి గుర్తుపెట్టుకోండి!

తెలిసీ తెలియని వయసులో పిల్లలు.. ‘నేను పెద్దయ్యాక డాక్టరవుతా.. ఆస్ట్రోనాట్‌ అవుతా..’ అని చెబుతుంటారు. కానీ పెరిగే కొద్దీ చాలామందిలో కెరీర్‌ ప్రాథమ్యాలు మారుతుంటాయి. నిజానికి టీనేజ్‌లోకి అడుగుపెట్టాకే అసలు వారు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారోనన్న స్పష్టమైన అవగాహన వారిలో వస్తుంది. ఇదిగో ఇలాంటి సమయంలోనే తల్లిదండ్రులు పిల్లలను నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు నిపుణులు. వారికి అండగా నిలిచి.. వారు కోరుకున్న రంగంలో ప్రోత్సహిస్తే పిల్లల బంగారు భవితకు బాటలు పరిచిన వారవుతారంటున్నారు. మరి, వయసొచ్చిన పిల్లలు తమ కెరీర్‌ను ఎంచుకునే క్రమంలో తల్లిదండ్రులు వారికి ఎలా అండగా నిలవాలి? ఏయే విషయాల్లో వారిని ప్రోత్సహించాలి? తెలుసుకుందాం రండి..

వాళ్లకు నచ్చితే చాలు!

కెరీర్‌ను ఎంచుకునే విషయంలో పిల్లలకంటూ కొన్ని ఆలోచనలుంటాయి. వాటిని లెక్కచేయకుండా.. ‘నా కూతురిని ఐఏఎస్‌ను చేస్తా’, ‘నా కొడుకుని డాక్టర్‌ని చేస్తా..’, ‘ఆర్థిక పరిస్థితి సహకరించక నేనెలాగూ నా లక్ష్యాన్ని నెరవేర్చుకోలేదు.. నీ ద్వారా నా కలను నెరవేర్చుకోనివ్వమ్మా!’ అంటూ కొంతమంది తల్లిదండ్రులు వారి ఇష్టాయిష్టాల్ని పిల్లలపై రుద్దుతుంటారు. ఇలాంటి ధోరణి అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. వాళ్లొక కెరీర్‌ను నిర్దేశించుకున్నప్పుడు, మీరు మరొకటి చెప్తే అది వారికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చని పని చేయడం ఎవరికైనా కష్టమే! తద్వారా వాళ్లు అందులో రాణించకపోగా.. భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ల ఇష్టాలకే గౌరవం ఇవ్వమంటున్నారు నిపుణులు. చదువు, ఆటలు, వ్యాపారం.. ఇలా వారు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో ముందుగా తెలుసుకొని.. ఆ దిశగానే వాళ్లను ప్రోత్సహిస్తే ఇక వారికి తిరుగుండదు.

బలాబలాలేంటో తెలుసుకోనివ్వండి!

పిల్లల ఆలోచనల్ని తెలుసుకోవడమే కాదు.. అందులో వాళ్ల బలాబలాలేంటో, నైపుణ్యాలు ఎంత మేర ఉన్నాయో స్వయంగా గ్రహించే అవకాశం తల్లిదండ్రులే వారికి కల్పించాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వారిని సంబంధిత వర్క్‌షాప్స్‌లో భాగం చేయడం, కెరీర్‌ ఫెయిర్స్‌లో పాల్గొనేలా చేయడం, విద్యా-వైజ్ఞానిక యాత్రలకు పంపించడం, క్రాఫ్ట్‌ మేకింగ్‌/పెయింటింగ్‌.. వంటి నైపుణ్యాలుంటే.. వారు తయారుచేసిన వస్తువుల్ని ఆయా ఎక్స్‌పోలలో ప్రదర్శించేలా ప్రోత్సహించడం, వారు తమ నైపుణ్యాలను గుర్తించేందుకు వీలుగా ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌/రీజనింగ్‌ స్కిల్స్‌.. వంటి పరీక్షలు రాయమనడం, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు వారికి నేర్పించడం.. ఇలా ఆలోచిస్తే ఎన్నో మార్గాలున్నాయి. వీటి ద్వారా పిల్లలు తమకు నచ్చిన రంగాల్లో తమ శక్తిసామర్థ్యాలేంటో స్వయంగా గ్రహించి.. వాటిని మరింత పెంచుకునే దిశగా అడుగేస్తారు. ఇదీ వారి కెరీర్‌ అభివృద్ధికి ఓ కీలక మెట్టే!

కౌన్సెలింగ్‌ ఎప్పుడు అవసరం?!

కొంతమంది పిల్లలకు తమ కెరీర్‌ లక్ష్యంపై ఒక స్పష్టమైన అవగాహన ఉండదు.. ‘ముందు ఈ కోర్సైతే పూర్తి చేద్దాం.. ఆ తర్వాత ఉద్యోగావకాశాలను బట్టి చూద్దాం..’ అన్న ధోరణిలో ఉంటారు. మరికొంతమందికి రెండు మూడు లక్ష్యాలుంటాయి. వాటిలో ఏది మంచిదో తేల్చుకోలేకపోతారు. ఓసారి ఒకటి మంచిదనిపిస్తే.. మరోసారి మరొకటి ఎంచుకోవాలనిపిస్తుంటుంది. ఇలాంటి సందిగ్ధంలో ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు మార్గనిర్దేశనం చేయచ్చు. ఈ క్రమంలో ఆయా అంశాల గురించి నెట్‌లో శోధించడం, తెలిసిన వారిని/నిపుణుల్ని అడగడం.. వంటివి చేయచ్చు. అయితే వారికి ఉత్తమమైన కెరీర్‌ ఏదో సూచించడంతో పాటు దానివల్ల భవిష్యత్తు ఎంత ఉన్నతంగా సాగుతుందో కూడా వారికి వివరించగలగాలి. అదే సమయంలో సవాళ్లు ఎదురైనా తట్టుకొని ముందుకు సాగే సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం వారిలో నింపగలగాలి. వీలైతే అందుకు నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పించచ్చు. అలాగే కెరీర్‌ సెమినార్లలో పాల్గొనేలా చేయచ్చు. తద్వారా వారికి పూర్తి స్పష్టత వస్తుంది. కెరీర్‌లో ఎదగాలంటే ఇదే కీలకం అంటున్నారు నిపుణులు.

నైపుణ్యాలు పెరగాలంటే..!

నచ్చిన కెరీర్‌ను ఎంచుకోవడం, ఆ దిశగా కోర్సులు పూర్తిచేయడమే కాదు.. వాటిలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా పిల్లలూ తమ నైపుణ్యాలను పెంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఇందుకోసం ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేయడానికీ వెనకాడకూడదంటున్నారు నిపుణులు. కొంతమంది తల్లిదండ్రులు ‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న’ట్లుగా తమ కూతురు/కొడుకు ఆదిలోనే మంచి ఉద్యోగంలో స్థిరపడాలని అనుకుంటారు. కానీ అందరి విషయంలోనూ అది వర్కవుట్‌ కాకపోవచ్చు. ఆ గ్యాప్‌లో వారిని ఖాళీగా ఉంచకుండా కొత్త కోర్సులు నేర్చుకోమనడం, చదువుకుంటూనే ఇంటర్న్‌షిప్స్‌లో భాగం చేయడం, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసేలా వారిని ప్రోత్సహించడం.. ఇలాంటివన్నీ కెరీర్‌లో ఎదగడానికి ఉపయోగపడేవే అంటున్నారు నిపుణులు. తద్వారా వారు తమ నైపుణ్యాలు మెరుగుపరచుకొని భవిష్యత్తును మరింత బంగారుమయం చేసుకునే అవకాశాలుంటాయి.

ఇవి కూడా!

* కెరీర్‌కు సంబంధించిన పుస్తకాలు వారితో చదివించడం, వీలుంటే విజేతలతో మాట్లాడించడం.. వంటివి చేయచ్చు.

* కెరీర్‌ను ఎంచుకోవడం, లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో తొందరపాటు పనికిరాదంటున్నారు నిపుణులు. అటు పిల్లలు, ఇటు తల్లిదండ్రులు ఓపిక వహించినప్పుడే సక్సెస్‌ సాధించచ్చు.

పిల్లల బంగారు భవితకు బాటలు వేయాలంటే తల్లిదండ్రులు చేయాల్సిన పనులేంటో తెలుసుకున్నారు కదా! అయితే మరి, ఈ విషయంలో మీరు మీ పిల్లల్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు? మాతో పంచుకోండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని