టీకా తర్వాత మధుమేహులు ఏవి తినాలి? ఏవి తినకూడదు?!

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత తలనొప్పి, తేలికపాటి జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, నీరసం, వికారం, వాంతులు.. వంటి దుష్ప్రభావాలు మామూలే! అయితే ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు భయపడి వ్యాక్సిన్‌కు దూరంగా ఉండడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొవిడ్‌ ముప్పు ఎక్కువగా ఉన్న మధుమేహులు తప్పనిసరిగా టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు.

Published : 28 Jul 2021 19:50 IST

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత తలనొప్పి, తేలికపాటి జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, నీరసం, వికారం, వాంతులు.. వంటి దుష్ప్రభావాలు మామూలే! అయితే ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు భయపడి వ్యాక్సిన్‌కు దూరంగా ఉండడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొవిడ్‌ ముప్పు ఎక్కువగా ఉన్న మధుమేహులు తప్పనిసరిగా టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే క్రమంలో తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా టీకా దుష్ప్రభావాలను చాలా వరకు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అంతేకాదు.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా ఈ మార్పులు సహకరిస్తాయంటున్నారు. ఇంతకీ ఏంటా ఆహార నియమాలు..? మనమూ తెలుసుకుందాం రండి..

చేపలు

చేపల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి టీకా దుష్ర్పభావాల నుంచి రక్షణ కల్పిస్తాయంటున్నారు నిపుణులు.

గుడ్లు

చేపలు, చికెన్‌లో ఉన్నట్లే గుడ్లలో కూడా ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరిగేందుకు అవసరమైన అమైనో ఆమ్లాలు కూడా ఇందులో పుష్కలంగానే ఉంటాయి. అందుకే వ్యాక్సిన్‌ తీసుకున్న మధుమేహ బాధితులు తమ డైట్‌లో గుడ్లను చేర్చుకోవడం వల్ల ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

చికెన్‌

మధుమేహం, రక్తపోటు లాంటి దీర్ఘకాలిక అనారోగ్యాలున్న వారికి చికెన్‌ మంచి ఆహారం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చికెన్‌ సూప్‌లో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయట! ఇవి నొప్పి, వాపుల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ఇందులో ప్రొటీన్‌ కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి టీకా తీసుకున్న వారు వారానికి కనీసం రెండుసార్లైనా చికెన్‌ తినడం మంచిదంటున్నారు.

 

పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో నారింజ, ద్రాక్ష, నిమ్మ, బెర్రీ పండ్లతో పాటు పాలకూర, బ్రకలీ, చిలగడదుంప, బీన్స్‌ను ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలి.

నీటి స్థాయులు పెంచుకోవాలి!

టీకా తీసుకునే ముందు, తర్వాత కూడా వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగాలి. దీనివల్ల నీరసం దరిచేరదు. అలాగే నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో బాగా సహాయపడతాయి. వ్యాక్సిన్‌ వేసుకున్న భాగంలో వాపు, నొప్పితో పాటు ఇతర ఒళ్లునొప్పులు, యాంగ్జైటీ తీవ్రతను బాగా తగ్గిస్తాయి. అంతేకాదు.. వీటిని తీసుకోవడం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, ఫ్లేవనాయిడ్లు పెద్ద మొత్తంలో శరీరానికి అందుతాయి. ఫలితంగా వ్యాక్సిన్‌ దుష్ర్పభావాల నుంచి సత్వర ఉపశమనం కలుగుతుంది.

పసుపు

రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యాల బారిన పడకుండా కాపాడే సుగుణాలు పసుపులో బోలెడున్నాయి. దీనిలోని యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు నొప్పి నివారిణులుగా పనిచేస్తాయి. ఇందులోని కర్క్యుమిన్‌ అనే సమ్మేళనం జలుబు, దగ్గు, ఒత్తిడి, ఆందోళన.. వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా మధుమేహులు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత పసుపు పాలను కచ్చితంగా తాగాలి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉండి ఒత్తిడి, ఆందోళన లాంటి సమస్యలు దూరమవుతాయి.
 

వీటికి దూరంగా!

* ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ కడుపుతో వ్యాక్సిన్‌ తీసుకోకూడదు. ఒకవేళ అలా తీసుకుంటే నీరసం, తలనొప్పి, వికారం.. వంటి సమస్యలు ఎదురుకావచ్చు. కాబట్టి టీకా తీసుకోవడానికి ఓ అరగంట ముందు ఏదైనా తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

* అధిక క్యాలరీలు, కొవ్వులుండే ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌, జంక్‌ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలను తట్టుకునే శక్తి క్షీణిస్తుంది. పైగా ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువవుతాయి. కాబట్టి వీటిని పూర్తిగా దూరం పెట్టాలి.

* శీతల పానీయాల్లో ఆర్టిఫిషియల్‌ స్వీట్‌నర్స్‌ అధికంగా కలుపుతారు. ఇవి జీర్ణసంబంధిత సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి వీటికి బదులు పండ్ల రసాలు తీసుకోవడం మంచిది.

ఇలాంటి టీకా దుష్ప్రభావాలు సహజమే అయినా.. అవి ఎక్కువ రోజులు వేధించినా, ఇతర అనారోగ్యాలకు దారితీసినా.. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్