అందాల కలువ కొలను.. ఇంట్లోనే ఇలా!

కలువ పూలతో.. తామరాకులతో నిండిన చెరువుని చూడగానే.. అబ్బ.. ఎంత బాగుందో అనిపిస్తుంది కదా..! అలాంటి అందమైన కొలను మన ఇంటి ముందు కూడా ఉంటే చాలా బాగుండు అనే కోరిక కూడా కలుగుతుంది. అయితే పెరిగిపోతున్న అపార్ట్‌మెంట్ కల్చర్ కారణంగా మనకి అంతటి విశాలమైన స్థలం దొరకాలంటే చాలా

Published : 13 Mar 2022 12:58 IST

కలువ పూలతో.. తామరాకులతో నిండిన చెరువుని చూడగానే.. అబ్బ.. ఎంత బాగుందో అనిపిస్తుంది కదా..! అలాంటి అందమైన కొలను మన ఇంటి ముందు కూడా ఉంటే చాలా బాగుండు అనే కోరిక కూడా కలుగుతుంది. అయితే పెరిగిపోతున్న అపార్ట్‌మెంట్ కల్చర్ కారణంగా మనకి అంతటి విశాలమైన స్థలం దొరకాలంటే చాలా కష్టమే. అదే కుండీల్లోనే కలువ, తామర పూలను పెంచుకుంటేనో.. అలా పెంచి వాటిని ఇంట్లో పెడితే.. చాలా ఆహ్లాదంగా, రొమాంటిక్‌గా ఉంటుంది కదూ..? దీన్నే ఇప్పుడు పాట్ పాండ్, మినియేచర్ పాండ్ అని పిలుస్తున్నారు. కానీ వాటిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇది చదివేయండి మరి..

సరైన ప్రదేశం..

ముందుగా ఇండోర్ పాండ్‌ని ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయించుకోవాలి. దీనిలో పెంచే మొక్కలకు సూర్యరశ్మి కావాలి కాబట్టి.. ఎండ తగిలే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అలాగని రోజంతా ఎండ ఉండే చోట ఏర్పాటు చేస్తే మొక్కలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే నాలుగు నుంచి ఐదు గంటల సమయం మాత్రమే సూర్యరశ్మి పడే ప్రదేశంలో పాండ్‌ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

కుండీ ఇలా..

మినియేచర్ చెరువును ఏర్పాటు చేసుకోవడానికి చెక్క, లోహంతో తయారుచేసిన కుండీలు తప్ప మిగిలినవి ఎంచుకోవచ్చు. మట్టితో తయారు చేసిన కుండీ అయితే ఆకర్షణీయంగా, వింటేజ్ లుక్‌తో కనిపిస్తుంది. అలాగే సిమెంట్, ప్లాస్టిక్, సిరామిక్, గాజుతో తయారైన వాటిని కూడా ఉపయోగించవచ్చు. లేదంటే మన ఇంట్లోనే ఉన్న ప్లాస్టిక్ టబ్‌లో కూడా ఈ పాండ్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే దీన్ని ఎంచుకొనే క్రమంలో మరో విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తామర, కలువలాంటి మొక్కలు పెంచాలనుకుంటే పన్నెండు అంగుళాల లోతు ఉన్న కుండీని ఎంచుకోవాలి. అప్పుడే అవి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇతర నీటి మొక్కలకు కాస్త తక్కువగా ఉన్న ఫర్వాలేదు.

మొక్కలు ఇలా..

మినియేచర్ వాటర్ పాండ్‌ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అందులో ఎలాంటి మొక్కలు పెంచాలో సరైన అవగాహన ఉండడం తప్పనిసరి. నీటిలో పెరిగే ఎలాంటి మొక్కలనైనా ఇందులో పెంచుకోవచ్చు. అయితే మనం పెంచే మొక్కలు కుండీకే కాకుండా ఇంటికి కూడా అందాన్ని తీసుకురావాలి. దీనికోసం వాటర్‌లిల్లీ, లోటస్, వాటర్ పాపీ, వాటర్ ప్రైమ్‌రోజ్, లిజర్డ్స్ టెయిల్, ఎల్లో ఫ్లాగ్ ఐరిస్, వాటర్ మింట్, పికెరిల్ రష్ వంటి మొక్కలను ఎంచుకోవాలి. ఇలాంటి మొక్కలు ఇప్పుడు నర్సరీలు, ఆన్‌లైన్ ప్లాంట్‌సేల్ వెబ్‌సైట్లలోనూ దొరుకుతున్నాయి. కాబట్టి మీకు నచ్చిన మొక్కలను ఎంచుకొని వాటితో కుండీని అలంకరించండి.

వేర్వేరుగా..

మనం పైన చెప్పుకున్న మొక్కలన్నీ.. నీటిలో ఒకే లోతులో పెరగలేవు. అందుకే మొక్కలను వేర్వేరు కుండీల్లో అమర్చుకోవాలి. ఈ కుండీలు కూడా మొక్కల పరిమాణానికి తగినట్లు వేర్వేరు సైజుల్లో ఉంటే మంచిది. వీటన్నింటినీ కలిపి మినీపాండ్‌లో అమర్చుకోవచ్చు. కలువ, తామర పూల కోసం అయితే అడుగు కాస్త వెడల్పుగా, లోతుగా ఉన్న కుండీని ఎంచుకోవాలి. వాటర్ ప్లాంట్స్ అన్నీ బంకమట్టిలో బాగా పెరుగుతాయి. ఈ మట్టి నర్సరీల్లో కూడా లభ్యమవుతుంది. ఇక ఈ మొక్కల్ని నాటాలంటే ముందుగా కుండీలకు ఉన్న రంధ్రాలను పూడ్చి తర్వాత బంకమట్టితో నింపుకోవాలి. ఇలా మట్టి నింపిన కుండీల్లో వేర్వేరు రకాలకు చెందిన మొక్కలను విడివిడిగా నాటుకోవాలి. ఆ తర్వాత మట్టి పైభాగాన్ని పూర్తిగా కవర్‌తో కప్పాలి. ఆ తర్వాత దీనిపై గులకరాళ్లు, అక్వేరియం పెబుల్స్‌తో నింపుకోవాలి. ఇలా చేస్తే కుండీల నుంచి మట్టి బయటకు రాకుండా ఉంటుంది. ఇలా మొత్తం కుండీలన్నీ నింపుకోవాలి.

పాండ్ ఇలా తయారవుతుంది..

మనం మినియేచర్ పాండ్‌ని ఏర్పాటు చేయాలనుకున్న కుండీకి రంధ్రాలు లేకుండా చూసుకోవాలి. ఒక వేళ ఉన్నట్త్లెతే వాటిని పూడ్చేయాలి. ఆ తర్వాత కుండీలో అక్కడక్కడా చార్‌కోల్ పొడి లేదా ముక్కలను వేసుకోవాలి. ఇది నీటిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచి వాసన రాకుండా చేస్తుంది. ఆ తర్వాత గులకరాళ్లు, అక్వేరియం పెబుల్స్, మార్బుల్‌స్టోన్స్ వేసుకోవాలి. తర్వాత శుభ్రమైన నీటితో కుండీని నింపుకోవాలి. ఆ తర్వాత ముందు తామర లేదా కలువ పూలను నాటిన కుండీని ఈ నీటిలో జాగ్రత్తగా పెట్టాలి. ఆ తర్వాత మొక్క లక్షణాన్ని బట్టి అది ఎంత లోతులో పెరుగుతుందో దాని ప్రకారం మిగిలిన కుండీలను అమర్చుకోవాలి. తక్కువ లోతులో పెరిగే మొక్కల కోసం కుండీ కింద వరుసలో ఇటుకలు లేదా రాళ్లు నింపిన మరో కుండీని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా చేస్తే వైవిధ్యంగా కూడా కనిపిస్తుంది. అలాగే కుండీకి మరింత వన్నె తీసుకురావడానికి మనీప్లాంట్ కొమ్మలను కత్తిరించి నీటిలో ఉంచితే సరిపోతుంది.

నిర్వహణ ఇలా..

పాట్ పాండ్ ఏర్పాటు చేసుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో.. తర్వాత దాని నిర్వహణ కూడా అంతే జాగ్రత్తగా చేయాలి. కనీసం నాలుగు వారాలకోసారి ఈ కుండీలోని నీటిని మారుస్తూ ఉండాలి. లేదంటే నీటిలో ఆల్గే పెరుగుతుంది. మొక్కలకు ఆరు నెలలకోసారి ఎరువులు వేస్తూ ఉండాలి. అలాగే ఈ నీటిలో దోమలు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మొక్కైనా ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తే దాన్ని కుండీల్లోంచి తొలగించడం మంచిది. లేదంటే అది నీటిలో కుళ్లిపోయి దుర్వాసన రావడంతో పాటు ఈ మినియేచర్ పాండ్ కూడా అంత అందంగా కనిపించదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్