Updated : 14/03/2022 18:45 IST

మాట్లాడేటప్పుడు జాగ్రత్త!

దైనందిన జీవితంలో మనం ఎంతోమందితో మాట్లాడుతుంటాం.. చర్చలు జరుపుతుంటాం. కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, స్నేహితులు, బాస్‌.. ఇలా ఎంతోమందితో వివిధ అంశాలపై చర్చిస్తుంటాం. అయితే చాలామంది ఇతరులతో ఏదైనా అంశం గురించి చర్చించే సమయంలో కొన్ని రకాల తప్పులు చేస్తుంటారు. దాంతో ఆ చర్చ నిరుపయోగంగా మారడమో లేదా గొడవకు దారి తీయడమో జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలమవుతుంటుంది. కాబట్టి, ఇతరులతో చర్చించే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. మరి, అవేంటో తెలుసుకుందామా...

మాట్లాడాలి.. మాట్లాడనివ్వాలి..!

ఏదైనా చర్చలో పాల్గొన్నప్పుడే మనిషి వ్యక్తిత్వం బయటపడుతుంటుంది. అందుకే ఉద్యోగ నియామకాల్లో గ్రూప్‌ డిస్కషన్లు పెడుతుంటారు. ఈ సమయంలో కొంతమంది వాగుడు కాయలాగా ఒకటే మాట్లాడుతూ తోటివారికి అవకాశం ఇవ్వరు. ఆలుమగల మధ్య కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు భాగస్వామికి అవకాశం ఇవ్వకుండా వారిపై అరుస్తుంటారు. మరికొంతమంది దీనికి పూర్తి భిన్నంగా నిశ్శబ్దంగా ఉంటారు. ఈ రెండు పద్ధతులూ మంచివి కాదు. ఒకవైపు చెప్పాలనుకున్న అంశాలు ప్రభావవంతంగా వివరిస్తూనే ఇతరులకు అవకాశం ఇవ్వాలి. దానివల్ల ఒకరి అభిప్రాయాలు మరొకరికి స్పష్టంగా తెలుస్తాయి. చర్చ అర్థవంతంగా ముగుస్తుంది.

సూటిగా, సుత్తి లేకుండా..

కొంతమంది స్నేహితులతో మాట్లాడేటప్పుడు గత అనుభవాల గురించి చర్చిస్తుంటారు. ఇది సాధారణమే అయినప్పటికీ ప్రతిసారీ ఇలా చేయడం కూడా మంచిది కాదు. ఇతరులతో మాట్లాడేటప్పుడు వ్యక్తిగత విషయాలను తీసుకురాకూడదు. అలాగే ఏదైనా అంశాన్ని నిరూపించడానికి చాట భారతంలాగా సాగదీయద్దు. చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా, సుత్తి లేకుండా చెప్పాలి. వివిధ అంశాల గురించి పైపైన టచ్‌ చేస్తూ చెప్పడం కంటే ఒక్క అంశం పైనే స్పష్టంగా వివరించడం మంచిది. చెప్పే సమయం కంటే, నాణ్యతకే ఎక్కువమంది ప్రాధాన్యమిస్తారు. కాబట్టి చర్చలో పాల్గొన్నప్పుడు స్పష్టంగా, నాణ్యతతో తక్కువ సమయంలోనే చెప్పడానికి ప్రయత్నించాలి.

వాటిని గౌరవించాలి..

డిబేట్‌ జరుగుతున్నప్పుడు విభిన్నమైన అభిప్రాయాలు చర్చకు వస్తుంటాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరి అభిప్రాయానికి గౌరవం ఇస్తూనే మన అభిప్రాయాన్ని తెలియజేయాలి. ఉదాహరణకు యోగా, జిమ్‌.. రెండు రకాల వ్యాయామాలు ఆరోగ్యానికి మేలు చేసేవే. అయితే దేని ప్రయోజనాలు దానికి ఉంటాయి. మీరు యోగా ప్రయోజనాల గురించే ప్రధానంగా చెప్పాలనుకున్నప్పుడు జిమ్‌ చేయడం వల్ల కలిగే లాభాలను కూడా గౌరవించాలి. ఈ క్రమంలో ఆ ప్రయోజనాలను తక్కువ చేసి చూపించకూడదు.

ప్రతికూల అంశాల జోలికి పోవద్దు...

ఏదైనా సమస్య గురించి చర్చించేటప్పుడు ప్రతికూల అంశాల గురించి చర్చించకూడదు. ఇలా చేయడం వల్ల సమస్య పరిష్కారమవడం అటుంచితే మరింత తీవ్రమవుతుంది. ఇలాంటి చర్చలు స్నేహితులు, దంపతుల మధ్య ఎక్కువగా జరుగుతుంటాయి. వారికి ఏవైనా మనస్పర్థలు వచ్చినప్పుడు ఇంతకుముందు జరిగిన ప్రతికూల అంశాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. దానికి బదులుగా సానుకూల అంశాల గురించి చర్చించాలి. ఈ క్రమంలో సమస్య పరిష్కారానికి ఇద్దరికీ ఏకాభిప్రాయం ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు ఇంతకుముందు చెప్పుకున్నట్లు యోగా, జిమ్‌.. రెండూ ఆరోగ్యానికి మంచిదే కానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాలు భిన్నమైనవి. కాబట్టి, ఎవరికి నచ్చినవి వారు ఎంచుకోవచ్చు అనే నిర్ణయానికి వస్తే ఇద్దరికీ అమోదయోగ్యంగా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని