ప్రొటీన్ల కోసం.. ఇవి కూడా..!

కండర వ్యవస్థను దృఢంగా ఉంచడంలో ప్రొటీన్ల పాత్ర మనకు తెలిసిందే. శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు, రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకూ దోహదం చేసే ప్రొటీన్లు.. కేవలం మాంసాహారంలోనే కాదు.. కొన్ని రకాల శాకాహార పదార్థాలలోనూ అధికంగానే లభిస్తాయి....

Published : 20 Mar 2024 13:24 IST

కండర వ్యవస్థను దృఢంగా ఉంచడంలో ప్రొటీన్ల పాత్ర మనకు తెలిసిందే. శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు, రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకూ దోహదం చేసే ప్రొటీన్లు.. కేవలం మాంసాహారంలోనే కాదు.. కొన్ని రకాల శాకాహార పదార్థాలలోనూ అధికంగానే లభిస్తాయి. మరి వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ప్రొటీన్ల లోపాన్ని అధిగమించవచ్చంటున్నారు నిపుణులు. మరి అవేంటో చూద్దాం రండి..

క్వినోవా
ప్రొటీన్ల లోపంతో బాధపడే వారికి క్వినోవా మంచి ఆహారం. వీటిలోని అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులు, క్యాల్షియం, మాంగనీస్‌, పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్‌, జింక్‌, బి6, ఇ, నియాసిన్, థయమిన్.. వంటి విటమిన్లు, పోషకాలు శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇక ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల రూపంలో శరీరానికి అవసరమైన కొవ్వులు కూడా క్వినోవాలో ఉంటాయి. పీచు పదార్థాలు అధికంగా ఉండే క్వినోవా బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం.

ఓట్స్
ప్రొటీన్లే కాదు అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉండే ఓట్స్‌ను ‘సూపర్‌ఫుడ్’ అని పిలుస్తారు. ఇందులో కార్బొహైడ్రేట్లు, పీచుపదార్థాలు, మాంగనీస్, ఫాస్ఫరస్, కాపర్, ఐరన్‌, సెలీనియం, మెగ్నీషియం, జింక్‌ లాంటి మినరల్స్‌ కూడా అధికంగా ఉంటాయి. పాలు, తేనె, బాదం పాలతో కలిపి ఓట్స్‌ను తీసుకుంటే శరీరానికి మరిన్ని పోషకాలు అందుతాయి.

సబ్జా
బరువు తగ్గించుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలనుకునే వారికి సబ్జా గింజలు మంచి ఆహారమని చెప్పుకోవచ్చు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ప్రొటీన్‌తో పాటు ఫైబర్ ఉంటుంది. గ్లూటెన్‌ ఉండదు. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజల్లో ఫైబర్‌ మోతాదు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టుకుని తినచ్చు. లేకపోతే సలాడ్లు, స్మూతీలతో కలుపుకొని తీసుకున్నా అందులోని పోషకాలు శరీరానికి అందుతాయి.

కూరగాయలు, పండ్లు
సాధారణంగా కూరగాయలు, పండ్లలో ప్రొటీన్ల శాతం తక్కువగా ఉంటుంది. అయితే బచ్చలి కూర, తోటకూర, బంగాళా దుంపలు, బ్రకలి.. మొదలైన వాటిలో మాత్రం ప్రొటీన్లు పుష్కలంగా లభ్యమవుతాయి. అదేవిధంగా అరటి, జామ, కొన్ని రకాల బెర్రీ పండ్లలో కూడా ప్రొటీన్లు సమృద్ధిగానే ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్