గతాన్ని మర్చిపోలేకపోతున్నా.. బయటపడేదెలా?

నమస్తే మేడమ్‌.. నేను ఒక అబ్బాయిని ఐదు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను. ఈ విషయం తనకి, నాకు మాత్రమే తెలుసు. కానీ అనుకోకుండా ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లైంది. ఈ విషయం తెలిశాక తట్టుకోలేకపోతున్నా. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నా. ఎప్పుడూ తన గురించే ఆలోచిస్తున్నా. నాకు కూడా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు.

Published : 09 Mar 2022 16:52 IST

నమస్తే మేడమ్‌.. నేను ఒక అబ్బాయిని ఐదు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను. ఈ విషయం తనకి, నాకు మాత్రమే తెలుసు. కానీ అనుకోకుండా ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లైంది. ఈ విషయం తెలిశాక తట్టుకోలేకపోతున్నా. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నా. ఎప్పుడూ తన గురించే ఆలోచిస్తున్నా. నాకు కూడా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం ఇంట్లో వాళ్లకి చెప్పలేను. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎంత మర్చిపోదాం అనుకున్నా నా వల్ల కావడం లేదు. ఈ పరిస్థితుల నుంచి బయటపడలేకపోతున్నా.. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీరిద్దరూ పరస్పరం ప్రేమించుకున్నా.. అతను పరిస్థితులకు అనుగుణంగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితంలో అడుగు ముందుకు వేశాడు. అలాంటప్పుడు మీరు మాత్రమే దానికి బాధ్యులైనట్టుగా ఎందుకు బాధపడుతున్నారనేది స్వీయ విశ్లేషణ చేసుకోండి. అతను తనకంటూ ఒక జీవితం ఏర్పరచుకున్న తర్వాత.. అతని గురించి ఆలోచించడం వల్ల మీకు కానీ, అతనికి కానీ ఏమాత్రం ప్రయోజనం ఉండదన్న విషయం అర్థం చేసుకోండి. సముద్రంలో అలల్లాగా జీవితంలో ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ ముందుకు సాగక తప్పదు. అలాంటప్పుడు అడుగు ముందుకు వేసే క్రమంలో ఏం చేయాలి అనేది ఆలోచించండి. గతంలో జరిగింది ఏదైనా జ్ఞాపకమే కానీ వర్తమానం కాదు కదా.. కాబట్టి గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించండి. జీవితంలో మీరు పెట్టుకోవాలనుకున్న లక్ష్యాలు ఏంటి.. వాటిని చేరుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలి? అనే విషయాల్లో స్పష్టత తెచ్చుకోండి. దానివల్ల అతని ఆలోచనల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. జీవితంలో సానుకూల దృక్పథం ఎంతో అవసరం. మిమ్మల్ని మీరుగా గుర్తించి, మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకునే వ్యక్తి భవిష్యత్తులో దొరకడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రస్తుతం మీరు మీ చదువు, ఉద్యోగం, ఇతర లక్ష్యాల వైపుగా దృష్టి సారించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని