Published : 10/09/2021 10:57 IST

మగాళ్లు చేస్తే ఒప్పు.. ఆడవాళ్లు చేస్తే తప్పా.. ఇదెక్కడి న్యాయం?!

(Image for Representation)

‘ఇంటి పని మగాళ్లు చేస్తే సహాయం.. ఆడవాళ్లు చేస్తే బాధ్యతా?
ఉద్యోగం మగాళ్లు చేస్తే జీవనోపాధి.. ఆడవాళ్లు చేస్తే అభిరుచా?
బహిరంగ ప్రదేశాల్లో పురుషులు పొగ తాగచ్చు.. కానీ ఆడవాళ్లు బిడ్డకు పాలివ్వకూడదు?!
పెళ్లైనా అమ్మాయిలే అన్నీ వదిలేసి అత్తారింటికి ఎందుకెళ్లాలి.. పురుషులెందుకు వెళ్లకూడదు?’ అని ప్రశ్నిస్తోంది పాతికేళ్ల పూర్ణ.
ఇలా నిత్యం మన చుట్టూ జరిగే కొన్ని విషయాలు మనసులో సవాలక్ష ప్రశ్నల్ని రేకెత్తిస్తాయని, మనల్ని ఒక రకమైన భావోద్వేగాలకు గురిచేస్తాయని అంటోంది. నిజానికి ఆడ-మగ ఇద్దరూ సమానమే అయినప్పుడు ఇద్దరి మధ్య ఈ అంతరాలెందుకు? అని ఈ సమాజాన్ని నిలదీస్తోంది. ఓ ఆడపిల్లగా, భార్యగా, తల్లిగా తాను ఎన్నో కట్టుబాట్లను భరిస్తున్నానంటోన్న ఆమె.. ఈ పితృస్వామ్య వ్యవస్థలో జీవించడం రోజూ సవాలే అంటోంది. ఈ క్రమంలోనే తనకెదురైన కొన్ని అనుభవాలను మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

ఆడపిల్ల అంటే ‘ఆడ’ పిల్లే (అంటే.. ఎప్పటికైనా అత్తారింటికి వెళ్లిపోతుందని) అన్న భావన ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రుల్లో కనిపిస్తుంటుంది. ఎంత చదివించినా ఇంట్లోనే కదా ఉండేది.. అంత మాత్రానికి చదువెందుకు.. వృథా ఖర్చు.. అనుకుంటుంటారు కొందరు తల్లిదండ్రులు. మా అమ్మానాన్నలూ ఇంతే! ఆదిలాబాద్‌లోని ఓ గిరిజన తండా మాది. అలాగని మా ఊరు చదువుకు ఆమడ దూరంలో ఉంటుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇక్కడ మగాళ్లు చదువుకోవచ్చు.. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడచ్చు.. కానీ ఆడపిల్ల చదువుకుంటానంటే మాత్రం అదేదో సిగ్గు పడాల్సిన విషయంగా భావిస్తుంటారు. ఎంత త్వరగా పెళ్లి చేసి భారం దించుకుంటే అంత త్వరగా బాధ్యత తీరిపోతుందనుకుంటారు.

చట్ట ప్రకారం ఆడపిల్లల పెళ్లి వయసు 18 ఏళ్లయితే.. ఇక్కడ పెద్దమనిషి అవడమే ఆలస్యం.. అమ్మాయి పెళ్లీడుకొచ్చినట్లుగా భావిస్తుంటారు. హడావిడిగా పెళ్లి చేసి ఎవరికో ఒకరికి అంటగడతారు. అసలు తనకు ఈ పెళ్లి ఇష్టమా? కాదా? చదువుకోవాలన్న ఆశేమైనా ఉందేమో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. అన్న ఆలోచనలేవీ ఇక్కడి అమ్మాయిల విషయంలో ఉండవు. నా పరిస్థితీ ఇందుకు మినహాయింపు కాదు. పదిహేనేళ్లకే నా పెళ్లి చేసి అమ్మానాన్నలు తమ బాధ్యత తీర్చుకున్నారు. ఇక్కడికి దగ్గర్లోని మరో గిరిజన తండాకు చెందిన గిరీష్‌తో నా పెళ్లైంది. చదువుకునే వయసులో అత్తారిల్లు, అత్తమామలు-ఆడపడుచుల బాధ్యతలు, ఇంటి పనులు.. ఇలాంటి పెద్ద పెద్ద బాధ్యతలన్నీ నా భుజాన పడ్డాయి. నిజానికి అవన్నీ అర్థం చేసుకునే వయసు, పరిణతి కూడా నాకు లేదు. అయినా ‘ఆడపిల్లవు.. ఇప్పట్నుంచే ఇవన్నీ అలవాటు చేసుకోవాలి’ అన్నారంతా! మారు మాట్లాడకుండా భర్త వేలు పట్టుకొని అత్తారింటి గడప తొక్కానంటే.. ఇక నెలలు గడిచినా, పుట్టింటికి వెళ్లాలని మనసు లాగినా ఆ కోరికలన్నీ చంపుకోవాల్సిందే!

******

అయినా పెళ్లయ్యాక మనమే అన్నీ వదులుకొని, అమ్మానాన్నలకు దూరంగా అత్తారింటికి ఎందుకు వెళ్లాలి.. అదే భర్తలే ఇక్కడికి వచ్చి మనతో పాటు ఉండచ్చు కదా! కానీ అలా ఉండరు. అంతెందుకు.. వాళ్లు ఒక్క రోజు అత్తమామల దగ్గరికి వచ్చినా.. వారికి సకల మర్యాదలతో స్వాగతం పలకాలి. అదే మనకు మన అత్తారింట్లో ఇంటెడు చాకిరీ, బాధ్యతలే సాదర స్వాగతం చెబుతాయి. ‘ఎందుకిలా?’ అనే ప్రశ్న నా మనసును వేధిస్తోన్నా ఇప్పటిదాకా ఎవరితోనూ పంచుకోలేకపోయా.. కారణం నా చుట్టూ ఉన్న పితృస్వామ్య వ్యవస్థే! ఇక నా భర్తది వ్యవసాయాధారిత కుటుంబం. రోజంతా ఆయనకు పొలం పని, నాకు ఇంటి పనితోనే సమయం సరిపోతుంది. పెళ్లైన కొత్తలో ఎప్పుడైనా కాస్త ఖాళీ దొరికితే చాలు.. ఫ్రెండ్స్‌ని కలవాలంటూ బయటికి వెళ్లిపోయేవాడు. దాంతో నా మనసు చివుక్కుమనేది. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం మరొకటుంది.. మగాళ్లు ఇలా బయటికి వెళ్లి ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేయచ్చు.. అదే మనం ఇరుగుపొరుగు వాళ్లతో ఏదైనా మాట్లాడినా, స్నేహితులతో ఫోన్లో మాట్లాడినా పెడార్థాలు తీసే వారు మన చుట్టూ ఎంతోమంది ఉంటారు. మరి, ఇదే పని మగవాళ్లు చేస్తే ఒప్పుగా, ఆడవాళ్లు చేస్తే తప్పుగా ఎందుకు భావిస్తారో? నాకే కాదు.. నాలాంటి మహిళలెందరికో సమాధానం దొరకని ప్రశ్న!

కూతురిగా, ఇల్లాలిగానే కాదు.. ప్రస్తుతం నేను ఇద్దరు పిల్లల తల్లిగానూ వివక్షను ఎదుర్కొంటున్నా. పిల్లల్ని కనే విషయంలో భార్యాభర్తలిద్దరిదీ సమాన బాధ్యత అయినప్పుడు.. పెంచే బాధ్యత కూడా ఇద్దరూ సమానంగా పంచుకోవాలి కదా..! సరే కాస్త సర్దుకుపోయి ఆ విషయాన్ని పక్కన పెడితే.. పిల్లలేదైనా తప్పు చేస్తే.. ‘మీ అమ్మ నిన్ను ఇంత మొండిగా పెంచిందేంటి.. తనే నిన్ను చెడగొడుతోంది..’ అని తల్లినే నిందిస్తారు తప్ప.. తండ్రిని ఒక్క మాటా అనరు. ఇలా నాకే కాదు.. మీలోనూ చాలామందికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. ఇలాంటి అసమానత ఎదుర్కొన్నప్పుడల్లా నాకే ఎందుకిలా అంటూ దుఃఖం పొంగుకొస్తుంది.. కానీ ఇలా బాధను పంచుకోవడం తప్ప ఎదురుతిరగలేను.. ఒకవేళ ధైర్యం చేసి అలా చేసినా బరితెగించిందన్న అపవాదు నెత్తినేసుకోవాలి. ఇవన్నీ భరించే బదులు నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోతే ఏ సమస్యా ఉండదు కదా అని నా మనసుకు నేను సర్దిచెప్పుకుంటూ ముందుకెళ్తున్నా.

******

అయినా గిరిజన మహిళను.. నాకు లోకం పోకడ తెలియదనుకోకండి.. పదో తరగతి దాకా చదువుకున్నా. చుట్టూ ఏం జరుగుతోందో గ్రహించగలను. నాలాగే ఈ సమాజంలో ఎంతోమంది అమ్మాయిలు వివక్ష ఎదుర్కొంటున్నారన్న విషయం తెలుసుకోగలను. ఎవరిదాకానో ఎందుకు..? నా స్నేహితురాలు రేణునే ఇందుకు సాక్ష్యం..! నాలాగే తనకూ చిన్నతనంలోనే పెళ్లైనా భర్త సహకారంతో పైచదువులు చదువుకుంది.. ప్రస్తుతం ఉద్యోగం చేస్తోంది. భర్తకు సరిసమానంగా సంపాదిస్తోన్నా.. ఇంటి బాధ్యతల్ని పంచుకుంటున్నా.. ఏదో టైంపాస్‌కి జాబ్ చేస్తోందని అందరూ అంటుంటారని చెబుతుంటుంది. అంతేకాదు.. అటు ఉద్యోగమూ చేయాలి.. ఇటు ఇంటెడు చాకిరీ చేయాలని వాపోతుంటుంది.

ఇవనే కాదు.. పెళ్లయ్యాక భార్యే ఎందుకు ఇంటి పేరు మార్చుకోవాలి? బయటి ప్రదేశాల్లో మగాళ్లు పొగ తాగడం/మూత్ర విసర్జన చేయడం తప్పు కానప్పుడు.. నలుగురి ముందు తల్లి బిడ్డకు పాలిస్తే ఈ సమాజం ఎందుకు తప్పుగా చూస్తుంది? ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం జరిగే ఎన్నో విషయాల్లో మహిళలకు వివక్ష ఎదురవుతోంది. అలాగని మగాళ్లను తప్పుబట్టడం నా ఉద్దేశం కాదు.. ఏదో ఆవేశంతో నేను ఈ మాటలు చెప్పట్లేదు. ఈ సమాజంలో ఆడ-మగ సమానమైనప్పుడు.. వాళ్లనొకలా, మనల్ని మరోలా చూడడమెందుకు అనేదే ప్రస్తుతం నాలాంటి ఆడవాళ్ల మనసుల్లో సమాధానం లేని ప్రశ్న! అయితే పట్టణాలు, నగరాలు.. వంటి కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి విషయాల్లో ఇప్పుడిప్పుడే మార్పులొస్తున్నా.. మారుమూల ప్రాంతాలు మాత్రం ఇంకా ఇలాంటి అసమానతల్లోనే మగ్గుతున్నాయి. అయినా ఆడవాళ్లంటే ఇలాగే ఉండాలి.. ఇవే పనులు చేయాలి.. అన్న నియమాలు ఎక్కడా లేనప్పుడు.. మనకే ఎందుకిన్ని కట్టుబాట్లు? ఇది ఎంత వరకు న్యాయం? మీరే చెప్పండి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని