దూరంగా ఉంటూనే దగ్గరైపోండిలా!

కరోనా బారిన పడకూడదంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఇంటా బయటా సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. ఈ క్రమంలో వృత్తి ఉద్యోగాల రీత్యా బయటకు వెళ్లక తప్పని కొంతమంది దంపతులు కూడా ముందు జాగ్రత్తగా ఈ నియమాన్ని పాటిస్తున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్నా, ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా విడి విడి గదుల్లో ఉండడం లేదా తాత్కాలికంగా వేరే చోట ఉండడం వంటివి చేస్తున్నారు. కొద్దిగా కష్టమనిపించినా కొన్ని సందర్భాలలో ఈ దూరమే దంపతుల్ని మరింత దగ్గర చేస్తుందని,

Published : 25 Jun 2021 13:47 IST

విజిత-విజయ్‌ చూడముచ్చటైన జంట. తమ తమ పనులతో ఎంత బిజీగా ఉన్నా రోజూ కాస్త సమయం కేటాయించుకోవడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం వీరికి అలవాటు! అయితే ఇటీవలే విజయ్‌కి కరోనా సోకడంతో ఒకరినొకరు చాలా మిస్సవుతున్నారు.

సంధ్య-సుదీప్‌ కూడా అంతే! చిలిపి గొడవలే తమ అనుబంధాన్ని నిత్యనూతనం చేస్తున్నాయని చెప్పే వీరికి కొవిడ్‌ కారణంగా కొన్నాళ్ల పాటు ఎడబాటు తప్పట్లేదు.

కరోనా బారిన పడకూడదంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఇంటా బయటా సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. ఈ క్రమంలో వృత్తి ఉద్యోగాల రీత్యా బయటకు వెళ్లక తప్పని కొంతమంది దంపతులు కూడా ముందు జాగ్రత్తగా ఈ నియమాన్ని పాటిస్తున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్నా, ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా విడి విడి గదుల్లో ఉండడం లేదా తాత్కాలికంగా వేరే చోట ఉండడం వంటివి చేస్తున్నారు. కొద్దిగా కష్టమనిపించినా కొన్ని సందర్భాలలో ఈ దూరమే దంపతుల్ని మరింత దగ్గర చేస్తుందని, వారి మధ్య విరహాన్ని పెంచి అనుబంధాన్ని శాశ్వతం చేస్తుందని చెబుతున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. ఇందుకోసం ఇద్దరూ దూరంగా ఉన్నా మానసికంగా దగ్గరయ్యేందుకు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ప్రణయ బంధంలోని మజాను ఆస్వాదించచ్చని చెబుతున్నారు. మరి, ఏంటా టిప్స్‌? మనమూ తెలుసుకుందాం రండి..

ఎంత మిస్సవుతున్నానో?!

దాంపత్య బంధమంటే పడక గదికే పరిమితం కాకూడదు.. మిగతా సమయాల్లోనూ మాటల ద్వారా, చేతల ద్వారా ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకోవాలంటున్నారు నిపుణులు. కరోనా కారణంగా తాత్కాలిక ఎడబాటుకు గురై/సామాజిక దూరం పాటించే భార్యాభర్తలూ దీన్ని ఫాలో అవ్వచ్చంటున్నారు. ఇందుకోసం ఎక్కడెక్కడో ఉన్న వారిని దగ్గరగా చేర్చే అంతర్జాలాన్ని మించింది మరొకటి లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. కాబట్టి దీన్ని వారధిగా చేసుకొని ఒకరిపై ఒకరు ప్రేమను తెలుపుకోవచ్చు.. ఈ క్రమంలో వీడియో కాల్స్‌, వీడియో చాట్స్‌ ద్వారా మీ భాగస్వామిని మీరెంత మిస్సవుతున్నారో నేరుగా తెలియజేయచ్చు. ఆ రోజంతా ఎలా గడిచిందో కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు. మరో విషయం ఏంటంటే కొంతమంది దంపతులకు కలిసి వ్యాయామం చేసే అలవాటుంటుంది. అలాంటి వారు వీడియో కాల్‌లో ఉంటూనే జంటగా వర్కవుట్‌ చేయచ్చు. దీనివల్ల దూరంగా ఉన్నా ఒకరికొకరు మిస్సయ్యామన్న భావనే రాదు.. ఇలా చేయడం వల్ల మానసికంగా మరింత దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు.

పాత జ్ఞాపకాలు కొత్తగా!

సమయం లేక కానీ.. గడిచిన వైవాహిక బంధంలోకి ఓసారి తొంగిచూస్తే ప్రతి ఒక్కరికీ ఎన్నెన్నో మధురమైన జ్ఞాపకాలు మనసును పులకరింపజేస్తాయి. వాటిని ఓసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే దంపతులిద్దరిలో ఎడబాటు అన్న ఆలోచనే పూర్తిగా మాయమవుతుంది. ఇందుకోసం మీ మదిలోని ప్రేమనంతా రంగరించి ఓ ప్రేమలేఖ రాస్తే సరి! అది కూడా వర్చువల్‌గానే చేయచ్చు. ఈ క్రమంలో మీ ప్రేమ ప్రయాణంలో ఉన్న మధురానుభూతులు, ఒకరికొకరు ప్రత్యేకంగా ప్రేమను తెలుపుకొన్న క్షణాలకు అక్షర రూపమివ్వచ్చు.. ఇక మధ్యమధ్యలో మీ వెడ్డింగ్‌ ఆల్బమ్‌లో మీ ఇద్దరూ ఇష్టపడి తీయించుకున్న ఫొటోలను జత చేసి మీ భాగస్వామిని మరింతగా సర్‌ప్రైజ్‌ చేయచ్చు. ఇలా ఇవన్నీ మీ మధ్య దూరాన్ని తగ్గించడంతో పాటు ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో అవతలి వారిలో సానుకూల దృక్పథాన్ని నింపడంలోనూ తోడ్పడతాయంటున్నారు నిపుణులు.

‘అభయం’ మీరే ఇవ్వాలి!

కరోనాతో స్వీయ ఐసొలేషన్‌లో ఉన్నా, ఇతర కారణాల రీత్యా దంపతులిద్దరూ సామాజిక దూరం పాటించాల్సి వచ్చినా.. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఆలుమగలిద్దరూ ఒకరికొకరు అభయమిచ్చుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అప్పుడే దంపతుల్లో తలెత్తే మానసిక సమస్యలు వారి అనుబంధంలో చిచ్చుపెట్టకుండా కాపాడుకోవచ్చంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి వీడియో కాల్స్‌ ద్వారా రోజూ కాసేపు సమయం గడపడంతో పాటు, మానసిక నిపుణులతోనూ కౌన్సెలింగ్‌ ఇప్పించి మీ భాగస్వామిలో ధైర్యం నింపే ప్రయత్నం చేయచ్చు. వారిలో సానుకూల దృక్పథం అలవడేందుకు మీకు తెలిసిన ‘పాజిటివిటీ ఈ-బుక్స్‌’ చదవమని సూచించచ్చు. ఇలా దూరంగా ఉన్నా మీరు వారి పట్ల తీసుకునే కేర్‌.. మీ ఇద్దరి మనసుల్ని మరింత దగ్గర చేస్తుంది.

కలిసే చూడండి!

వారాంతాల్లో జంటగా సినిమాలు చూడడం మీకు అలవాటా? ఈ క్రమంలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మూవీని ఎంజాయ్‌ చేస్తారా? అయితే సామాజిక దూరం పాటిస్తూ కూడా ఇలా కలిసి సినిమాలు చూసి ఎంజాయ్‌ చేయచ్చంటున్నారు నిపుణులు. అందుకు వర్చువల్‌గా బోలెడన్ని ఆప్షన్లున్నాయంటున్నారు. ఈ క్రమంలో Scener, Teleparty.. వంటి బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్స్‌ ద్వారా ఒకరికొకరు కనెక్ట్‌ అయి మీకు నచ్చిన సినిమాను ఎంజాయ్‌ చేయచ్చు.. అంతేకాదు.. సినిమా చూస్తూ మీ భాగస్వామితో ఏదైనా మాట్లాడాలనుకుంటే చాటింగ్‌ కూడా చేయచ్చు. ఇదొక్కటనే కాదు.. దూరంగా ఉన్నా కలిసి ఒకే రకమైన వంటకం తయారుచేసుకోవడం, నచ్చిన గేమ్స్‌ ఆడుకోవడం.. వంటివీ చేయచ్చు.. ఇవన్నీ ప్రస్తుత ప్రతికూల సమయంలో తలెత్తే మానసిక ఒత్తిళ్లను దూరం చేసి.. దంపతుల మనసుల్ని దగ్గర చేసే మార్గాలే!

ఎవరికి వారుగా..!

దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా జంటల మధ్య పొరపచ్ఛాలు దొర్లకుండా ఉండాలంటే జంటగానే కాదు.. ఒంటరిగానూ ఎవరికి వారు కాస్త సమయం కేటాయించుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో వేళకు భోంచేయడం, వారి మనసుకు నచ్చే పనులు చేయడం, నచ్చిన దుస్తులు ధరించడం, ఇష్టమైన సంగీతం వినడం.. ఇవన్నీ మనసులో ఉండే ప్రతికూల ఆలోచనల్ని దూరం చేసేవే! ఫలితంగా మనం సంతోషంగా ఉండడమే కాదు.. ఇతరుల్నీ సంతోషంగా ఉంచచ్చని నిపుణులు చెబుతున్నారు. పైగా ఈ కరోనా కాలంలో దంపతులిద్దరి మధ్య ఇలాంటి సానుకూల దృక్పథం అలవడాలన్నా, సఖ్యత నెలకొనాలన్నా ఈ చిట్కా మేలు చేస్తుందంటున్నారు.
ఈ ప్రతికూల పరిస్థితుల్లో దంపతులిద్దరూ దూరంగా ఉన్నా.. దగ్గరయ్యేందుకు ఎన్ని మార్గాలున్నాయో తెలుసుకున్నారుగా! అయితే వీటిని కరోనా సమయానికే పరిమితం చేయకుండా దగ్గరగా ఉన్నప్పుడు కూడా కొనసాగిస్తే సంసార సాగరంలోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదించచ్చని నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్