రెస్టరంట్లో భోజనమా..?

రెస్టరంట్లో భోజనమంటే ఎవరికైనా సరదానే! ప్రత్యేక సందర్భాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి లంచ్‌, డిన్నర్లకు వెళ్తుంటాం. నచ్చిన వంటకాల రుచిని ఆస్వాదిస్తుంటాం. అయితే ఈ క్రమంలో చాలామంది ఎక్కువగా తినడానికి, అనారోగ్యకరమైన ఆహార పదార్థాల్ని ఎంచుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు పలు అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి.

Published : 07 Feb 2024 12:55 IST

రెస్టరంట్లో భోజనమంటే ఎవరికైనా సరదానే! ప్రత్యేక సందర్భాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి లంచ్‌, డిన్నర్లకు వెళ్తుంటాం. నచ్చిన వంటకాల రుచిని ఆస్వాదిస్తుంటాం. అయితే ఈ క్రమంలో చాలామంది ఎక్కువగా తినడానికి, అనారోగ్యకరమైన ఆహార పదార్థాల్ని ఎంచుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు పలు అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతమాత్రమూ మంచిది కాదంటున్నారు నిపుణులు. అందుకే బయట భోజనం చేసినా మితంగా, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్ని ఎంచుకుంటే సమస్యే ఉండదంటున్నారు. ఇందుకోసం కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం ఉత్తమం అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

⚛ రెస్టరంట్‌కి వెళ్లాలన్న ఆలోచన వచ్చినప్పుడు.. పరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేసే రుచికరమైన భోజనం దొరికే రెస్టరంట్ల గురించి వెతుకుతాం.. పనిలో పనిగా ఆన్‌లైన్‌లోనే మెనూ కూడా చూసేస్తే.. అక్కడ దొరికే విభిన్న వంటకాల గురించి ముందుగానే ఓ అవగాహన వచ్చేస్తుంది.

⚛ ఇక రెస్టరంట్లో అడుగుపెట్టగానే మనం చేసే మొదటి పని.. మెనూ చూడడం. ఈ క్రమంలో అందులో ఉన్న వెరైటీ ఆహారపదార్థాలు మన నోరూరిస్తుంటాయి. దీంతో అప్పటివరకు రుచి చూడని వాటిని ఆర్డర్‌ చేస్తుంటాం. వీటిలో చాలావరకు కొవ్వులు, నూనె పదార్థాలు ఎక్కువగా ఉన్నవే ఉంటాయి. ఇవి ఆరోగ్యకరం కాదు కాబట్టి.. తెలిసి తెలిసి పొరపాటు చేయకుండా.. ఆ మెనూలోనే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్ని ఎంపిక చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మసాలా, కొవ్వులు.. వంటివి ఎక్కువగా వాడిన వంటకాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

⚛ చాలామంది విపరీతరమైన ఆకలితో రెస్టరంట్లోకి అడుగుపెడుతుంటారు. దీనివల్ల నచ్చిన ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో లాగించచ్చన్నది వారి ఆలోచన. అయితే ఇది ఎంతమాత్రమూ కరక్ట్‌ కాదంటున్నారు నిపుణులు. బయట లంచ్‌కి, డిన్నర్‌కి వెళ్లే ముందు ఇంట్లోనే ఓ కప్పు పెరుగు, కొన్ని డ్రైఫ్రూట్స్‌.. వంటి ప్రొటీన్‌ ఎక్కువగా ఉన్న పదార్థాల్ని తీసుకుంటే.. రెస్టరంట్లో మితంగా ఆహారం తీసుకునే అవకాశం ఉంటుందంటున్నారు.

⚛ కొంతమంది రెస్టరంట్లో భోజనంతో పాటు శీతల పానీయాల్ని ఆర్డర్‌ చేస్తుంటారు. నిజానికి దీనివల్ల చక్కెరలు, అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరతాయి. అందుకే వీటికి బదులుగా నీళ్లు తాగమంటున్నారు నిపుణులు. బరువు అదుపులో పెట్టుకోవాలనుకునే వారు భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే.. శరీరంలోని అదనపు క్యాలరీలు కరుగుతాయని, సుమారు 44 శాతానికి పైగా బరువూ తగ్గే అవకాశం ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.

⚛ మనం ఫుడ్‌ మెనూను పరిశీలిస్తే.. ఆయా వంటకాల ముందు స్టీమ్‌డ్‌, గ్రిల్డ్‌, రోస్టెడ్‌, ఫ్రైడ్.. ఇలా రాసుంటుంది. దీని ద్వారా ఆయా పదార్థాల్ని ఎలా తయారుచేశారో అర్థమవుతుంది. అయితే వీటిలో స్టీమ్‌డ్‌, గ్రిల్డ్.. వంటి పద్ధతుల్లో తయారైన వంటకాలు ఎంపిక చేసుకోమంటున్నారు నిపుణులు. ఫలితంగా అందులో క్యాలరీలు, కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. అదే ఫ్రైడ్‌, క్రంచీ.. వంటి పదార్థాల్లో క్యాలరీలు, కొవ్వులూ ఎక్కువే! కాబట్టి ఆయా వంటకాల్ని ఎంచుకునే ముందు దాన్నెలా తయారుచేశారో అక్కడి వాళ్లను అడిగి తెలుసుకోవడంలోనూ తప్పు లేదు.

⚛ చాలామంది ఫుడ్‌ ఆర్డర్‌ చేసేటప్పుడు ఇతరుల నిర్ణయాలతో ప్రభావితమవుతుంటారు. ఒక్కోసారి ఇది కూడా అనారోగ్యకరమైన ఆహార ఎంపికలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి పదార్థాల్ని ఆర్డర్‌ చేసేటప్పుడు ఇతరుల నిర్ణయాలతో ప్రభావితం కాకుండా మీ అవసరాల్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం మంచిది.

⚛ నేరుగా భోజనంలోకి వెళ్తే ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. అదే ముందుగా ఏదైనా సూప్‌ లేదా కాయగూరలు/పండ్లతో చేసిన సలాడ్ తీసుకుంటే మితంగా తినచ్చు. ఈ క్రమంలో కాయగూరలు/మాంసంతో తయారుచేసిన బ్రాత్ సూప్‌ను ఎంచుకుంటే అటు ఆరోగ్యకరం.. ఇటు పోషకాలూ అందుతాయి. ఈ పద్ధతి ద్వారా శరీరంలోకి చేరే క్యాలరీలు 20 శాతం తగ్గుతాయని ఓ అధ్యయనం చెబుతోంది.

⚛ పిజ్జా, బర్గర్స్‌.. వంటివి ఆర్డర్‌ చేసినప్పుడు చాలామంది అదనంగా చీజ్‌తో టాపింగ్‌ చేయించుకుంటారు. దీనికి బదులుగా ఉడికించిన కాయగూర ముక్కల్ని ఎంచుకోవడం ఆరోగ్యకరం! అలాగే కొవ్వులు, ఉప్పు.. వంటివి ఎక్కువగా ఉండే సాస్‌లకు దూరంగా ఉండడం మరీ మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్