‘సహజ’ సౌందర్యం.. కోట్ల వ్యాపారం!

అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి మార్కెట్లో ఎన్నో సౌందర్యోత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో రసాయనాలు మిళితమైనవే ఎక్కువ. వీటిని ఉపయోగించడం వల్ల అందానికే కాదు.. పర్యావరణానికీ నష్టం వాటిల్లుతుంది.

Updated : 01 Feb 2024 17:11 IST

(Photos: Instagram)

అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి మార్కెట్లో ఎన్నో సౌందర్యోత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో రసాయనాలు మిళితమైనవే ఎక్కువ. వీటిని ఉపయోగించడం వల్ల అందానికే కాదు.. పర్యావరణానికీ నష్టం వాటిల్లుతుంది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది సిక్కింకు చెందిన రింజింగ్‌ ఛోడెన్‌ భుటియా. ఈ క్రమంలో ఆమె వేసిన అడుగులే సహజ సౌందర్యోత్పత్తుల వ్యాపారానికి తెర తీసేలా చేశాయి. తన బ్యూటీ ఉత్పత్తులతో దేశవిదేశాల్లో పాపులారిటీ సంపాదించిన ఆమె.. సంస్థను లాభాల బాట పట్టిస్తూనే కోట్లకు పడగెత్తింది. మరోవైపు పేద మహిళలకూ ఉపాధి అవకాశాలు చూపిస్తోంది. వ్యాపారంలో వచ్చే లాభాల కంటే సాటి మహిళలు ఎదగడానికి ఓ దారి చూపించడమే సంతృప్తినిస్తుందంటోన్న రింజింగ్‌ వ్యాపార ప్రయాణమిది!

పుట్టింది సిక్కింలోనే అయినా.. కార్పొరేట్‌ వృత్తి రీత్యా కోల్‌కతా, దిల్లీ, బెంగళూరు.. వంటి మెట్రో నగరాల్లోనే ఎక్కువ రోజులు గడిపింది రింజింగ్‌. పెళ్లయ్యాక తన భర్తతో కలిసి దిల్లీలో స్థిరపడిన ఆమె.. అసిస్టెంట్‌ మేనేజర్‌గా, సేల్స్‌ మేనేజర్‌గా పలు సంస్థల్లో పని చేసింది. నిజానికి రింజింగ్‌కు పర్యావరణ పరిరక్షణపై మక్కువ ఎక్కువ! ఈ ఆసక్తితోనే కాలుష్యం ఎక్కువగా ఉండే దిల్లీని వదిలి తన సొంత రాష్ట్రానికి రావాలని పలుమార్లు ప్రయత్నించింది. కానీ కెరీర్‌ దృష్ట్యా కుదిరేది కాదు.

అమ్మయ్యాకే..!

ఎప్పటికైనా పుట్టిన ఊళ్లోనే స్థిరపడాలని నిర్ణయించుకున్న రింజింగ్‌.. 2013లో తొలి సంతానానికి జన్మనిచ్చాకే తిరిగి సొంతూరికి చేరుకుంది.

‘దిల్లీలో విపరీతమైన కాలుష్యం.. దీనికి తోడు ఇరుకైన ప్రదేశాల్లో కాలం గడపడం కాస్త కష్టంగానే అనిపించేది. అందుకే సొంత రాష్ట్రానికి వచ్చేయాలి.. అనుకునేదాన్ని. 2013లో తొలి సంతానానికి జన్మనిచ్చాక ఈ కోరిక నెరవేరింది. ఇన్నాళ్లూ నేనెలాగో కాలుష్యం కోరల్లోనే గడిపాను.. నా పిల్లల్నైనా పరిశుభ్రమైన వాతావరణంలో పెంచాలనుకున్నా. అందుకే సిక్కింకు తిరిగొచ్చేశా. ఇక్కడి కబి ప్రాంతంలో మా పూర్వీకుల స్థలమొకటి ఉండేది. అందులోనే పర్యావరణహితమైన మెటీరియల్‌తో ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నాం. అయితే ఇదే సమయంలో పశ్చిమబంగలోని ‘Petrichor’ అనే ఇంటి నిర్మాణం గురించి తెలుసుకున్నా. పచ్చని చెట్ల మధ్య పర్యావరణహితంగా నిర్మించిన ఈ నివాస స్థలం నాకు బాగా నచ్చింది. పైగా అందులో ఔత్సాహికులకు సహజసిద్ధమైన సబ్బుల తయారీలో కూడా శిక్షణ ఇస్తున్నట్లు గ్రహించి నేనూ ఆ కోర్సు నేర్చుకున్నా.. నా వ్యాపార జర్నీకి ఇదే నాంది..’ అంటూ చెప్పుకొచ్చిందీ బిజినెస్‌ లేడీ.

స్థానిక మొక్కలతో తొలి ప్రయోగం!

చేత్తో సహజసిద్ధంగా చేసే సబ్బుల తయారీలో శిక్షణ తీసుకున్న రింజింగ్.. ఈ నైపుణ్యాల్ని ఉపయోగించి తానే సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంది.

‘మొదట్లో నా కిచెన్‌లోనే ఎకో-ఫ్రెండ్లీ సబ్బుల తయారీ ప్రారంభించాను. అయితే అంతలోనే కరోనా విజృంభించడంతో నా వ్యాపార ప్రయత్నాలకు తాత్కాలిక బ్రేక్‌ పడింది. అయినా ఈ సమయాన్ని వృథా చేసుకోకుండా పరిశోధనలపై దృష్టి పెట్టాను. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతోన్న సౌందర్యోత్పత్తుల్లో రసాయనాలు ఎక్కువగా ఉన్నట్లు గ్రహించా. ఇదే సమయంలో అందాన్ని సంరక్షించుకోవడానికి తగిన సహజ ఉత్పత్తుల గురించీ ఆరా తీశా. అలాగే సబ్బుల తయారీలో మరిన్ని మెలకువలు నేర్చుకున్నా. స్థానికంగా దొరికే ఔషధ మొక్కల్ని సేకరించి.. వాటితో సబ్బులు, ఇతర సౌందర్యోత్పత్తులు తయారుచేయడం ప్రారంభించా..’ అంటోన్న ఈ బ్యూటీ క్వీన్‌.. 2019లో ‘అగాపీ సిక్కిం (Agapi Sikkim)’ పేరుతో ఓ బ్యూటీ బ్రాండ్‌ని ప్రారంభించింది.

ఆ ఘనత ఆమెదే!

తన సంస్థ వేదికగా స్థానికంగా దొరికే మొక్కలతో పాటు హిమాలయ ప్రాంతంలో దొరికే వివిధ రకాల ఔషధ మొక్కల్ని ఉపయోగించి విభిన్న సౌందర్యోత్పత్తుల్ని తయారుచేస్తోంది రింజింగ్‌. సబ్బులు, షాంపూ బార్స్‌, క్లే మాస్క్‌, బాడీ క్రీమ్స్‌, నొప్పుల్ని దూరం చేసే బాత్‌ ఆయిల్స్‌, స్క్రబ్స్‌, బాత్‌ సాల్ట్స్‌, ఫేషియల్‌ ఆయిల్‌, క్లెన్సింగ్‌ ఆయిల్, ఫ్రూట్‌ క్రీమ్స్‌, మసాజ్‌ ఆయిల్స్‌, ఫేషియల్‌ స్ప్రేస్‌.. ఇలాంటి ఎన్నో సహజసిద్ధమైన సౌందర్యోత్పత్తులకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది అగాపీ సిక్కిం సంస్థ. వీటిలో సబ్బులు, షాంపూలు.. వంటి పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తుల్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హోటల్స్‌కి అందిస్తోందామె.. అలాగే ఇతర సౌందర్యోత్పత్తుల్ని తన వెబ్‌సైట్‌, ఇతర ఈ-కామర్స్‌ వేదికలపై విక్రయిస్తోంది. ఇలా వ్యాపారంలో క్రమంగా అభివృద్ధి సాధిస్తోన్న రింజింగ్‌ కంపెనీలో పలు విదేశీ సంస్థలు పెట్టుబడి పెట్టడం విశేషం. ప్రస్తుతం ఈ సంస్థ విలువ రూ. 8 కోట్లకు పైమాటే! ఇలా సిక్కిం రాష్ట్రంలోనే.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షించిన తొలి మహిళా నేతృత్వ సంస్థగా అగాపీని నిలిపిన ఘనత రింజింగ్‌కే దక్కుతుంది.

గిరిజన మహిళల కోసం..!

తాను మాత్రమే ఎదగాలనుకోవడం స్వార్థం.. తనతో పాటు నలుగురూ ఎదిగేలా ప్రోత్సహించాలనుకోవడం మంచితనం. ఓవైపు వ్యాపారంలో రాణిస్తూనే.. మరోవైపు తన మంచితనంతోనూ ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిప్రదాత అయింది రింజింగ్‌. ఈ క్రమంలోనే చుట్టుపక్కల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో నివసించే పేద మహిళలకు సబ్బుల తయారీలో శిక్షణ ఇస్తూ వారికి ఉపాధి మార్గాల్ని చూపిస్తోంది.

‘గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నివసించే మహిళలకు చదువుకునే అవకాశం ఉండదు. దాంతో వారికి ఉపాధీ ఉండదు.. ఆర్థికంగా భర్త పైనే ఆధారపడాల్సిన పరిస్థితి! దీన్ని మార్చాలన్న ముఖ్యోద్దేశంతోనే వారికి సబ్బుల తయారీలో శిక్షణ ఇస్తున్నా.. తొలి ట్రైనింగ్‌ సెషన్‌లో 20 మంది మహిళలు ఆసక్తి చూపించారు. క్రమంగా వీళ్ల సంఖ్య పెరుగుతూ పోయింది. ఇప్పటివరకు సిక్కిం వ్యాప్తంగా 400 మందికి పైగా మహిళలకు సహజసిద్ధమైన సౌందర్యోత్పత్తుల తయారీలో ఉచితంగా శిక్షణ ఇచ్చా. ఈ మెలకువల్ని మరికొంతమందికి నేర్పించేలా వారిని ప్రోత్సహిస్తున్నా. అలాగే వీళ్లు తయారుచేసే ఉత్పత్తులు వాళ్లే నేరుగా మార్కెట్లో విక్రయించేలా మార్కెటింగ్‌ మెలకువలు, ఇతర నైపుణ్యాలు నేర్పిస్తున్నా. ఇప్పటికే చాలామంది మహిళలు ఈ నైపుణ్యాలతో సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థిక స్వాతంత్ర్యం సాధించగలిగారు. అలాగే రీహ్యాబిలిటేషన్‌ సెంటర్స్‌లో, స్వయం సహాయక బృందాల్లో భాగమైన మహిళలకూ ఉచిత శిక్షణ అందిస్తున్నా. వ్యక్తిగతంగా, వ్యాపారంలో సాధిస్తోన్న అభివృద్ధి కంటే.. నలుగురికీ ఉపాధి మార్గం చూపిస్తున్నానన్న సంతృప్తే నన్ను మరింత ఉత్సాహంగా ముందుకు నడిపిస్తోంది..’ అంటోన్న ఈ బిజినెస్‌ ఉమన్‌.. యూకేలోని ఆర్గానిక్ కాస్మెటిక్ ఫార్ములేషన్ స్కూల్ ‘ఫార్ములా బొటానికా’ నుంచి ఇటీవలే చర్మ సంరక్షణలో ఆన్‌లైన్ కోర్సును కూడా పూర్తిచేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్