జీన్స్‌తో నిద్రపోతే ఈ సమస్యలు తప్పవట!

ఆఫీస్‌కైనా, సరదాగా అలా బయటికి వెళ్లినా.. జీన్స్‌ వేసుకోవడం ఈ కాలపు అమ్మాయిలకు అలవాటైపోయింది. అయినా ఇంటికొచ్చాక ఈ దుస్తులు మార్చుకొని వదులుగా, సౌకర్యవంతంగా ఉండే నైట్‌వేర్‌ ధరిస్తుంటాం. కానీ ఒక్కోసారి అనుకోకుండా స్నేహితుల....

Published : 25 Jun 2023 12:31 IST

ఆఫీస్‌కైనా, సరదాగా అలా బయటికి వెళ్లినా.. జీన్స్‌ వేసుకోవడం ఈ కాలపు అమ్మాయిలకు అలవాటైపోయింది. అయినా ఇంటికొచ్చాక ఈ దుస్తులు మార్చుకొని వదులుగా, సౌకర్యవంతంగా ఉండే నైట్‌వేర్‌ ధరిస్తుంటాం. కానీ ఒక్కోసారి అనుకోకుండా స్నేహితుల ఇంటికి వెళ్లినా లేదంటే పనిమీద బయటికి వెళ్లాల్సి వచ్చినా అదే జీన్స్‌లో నిద్రపోవాల్సి రావచ్చు. దీనివల్ల అసౌకర్యమే కాదు.. ఆరోగ్యపరంగా పలు సమస్యలూ తప్పవంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

అందుకే ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు!

జీన్స్‌ డెనిమ్‌ ఫ్యాబ్రిక్‌తో తయారవుతుంది. ఇది గాలి చొరబడనంత చిక్కగా ఉంటుంది.. అంతేకాదు.. చెమటను పీల్చుకునే స్వభావం కూడా ఈ మెటీరియల్‌కు ఉండదు. ఫలితంగా జననేంద్రియాల వద్ద చెమట అలాగే ఉండిపోతుంది. ఈ తేమతోనే గంటల తరబడి ఉండిపోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా, ఫంగస్‌.. వంటివి వృద్ధి చెందుతాయి. ఫలితంగా ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఇది క్రమంగా ప్రత్యుత్పత్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి సాధ్యమైనంత తక్కువ సమయం జీన్స్‌ ధరించేలా చూసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కాలంతో సంబంధం లేకుండా చెమట ఎక్కువగా వచ్చే వారు ఈ విషయంలో మరింత అలర్ట్‌గా ఉండడం మంచిదంటున్నారు.

నిద్రకు అంతరాయం!

సాధారణంగా మనం నిద్రలోకి జారుకున్న కొన్ని గంటలకు శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతూ వస్తుంది. అయితే జీన్స్‌ ధరించి నిద్రపోయినప్పుడు గాలి ప్రసరణ సరిగ్గా జరగక శరీర ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. తద్వారా నిద్రకు అంతరాయం ఏర్పడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాదు.. జీన్స్‌ వంటి బిగుతైన దుస్తులు ధరించి పడుకోవడం వల్ల అసౌకర్యంగానూ అనిపిస్తుంటుంది. ఇది కూడా సుఖనిద్రను దూరం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

నెలసరి నొప్పి తీవ్రంగా..!

జీన్స్‌ వంటి బిగుతైన దుస్తులు ధరించి నిద్ర పోవడం వల్ల గర్భాశయం, పొత్తి కడుపు, జననేంద్రియాలపై ఒత్తిడి పడుతుంది. అలాగే ఆయా భాగాలకు రక్తప్రసరణ కూడా సాఫీగా సాగదు. వీటన్నింటి మూలంగా నెలసరి సమయంలో నొప్పి మరింత తీవ్రమవుతుంది. మరోవైపు ఇలాంటి బిగుతైన దుస్తుల వల్ల నడుంనొప్పి, కడుపుబ్బరం.. వంటి సమస్యలూ వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు.

ఇవి కూడా!

బిగుతైన దుస్తుల వల్ల ఆయా శరీర భాగాలకు గాలి ప్రసరణ సరిగ్గా జరగక.. అక్కడి చర్మంపై దద్దుర్లు, ఎరుపెక్కడం, దురద.. వంటి సమస్యలొస్తాయి.

జీన్స్‌ వంటివి ధరించి నిద్రపోవడం వల్ల శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌ కదిలించలేం. ఫలితంగా ఎక్కువ సేపు ఒకే భంగిమలో పడుకోవాల్సి రావచ్చు. తద్వారా కండరాలు, కీళ్లు బిగుసుకుపోతాయి.

అలాగే బిగుతైన దుస్తుల వల్ల నరాలపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా అలసట, నీరసం, మైకం కమ్మడం.. వంటి సమస్యలొచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు.

కాబట్టి పడుకునేటప్పుడైనా, ఇతర సమయాల్లోనూ సాధ్యమైనంత వరకు వదులుగా ఉండే కాటన్‌ దుస్తులకు ప్రాధాన్యమివ్వడం మంచిది. ఒకవేళ ఆయా సమస్యలు తీవ్రమైతే మాత్రం ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్