పెంపుడు జంతువులు చలికి తట్టుకునేలా..!

పగలంతా స్వెటర్‌ వేసుకున్నా, రాత్రుళ్లు దుప్పటి కప్పుకున్నా చలికి తట్టుకోలేకపోతున్నాం. మరి, మన పరిస్థితే ఇలా ఉంటే.. మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే పెంపుడు జంతువుల మాటేంటి? ఈ ప్రతికూల వాతావరణం వల్ల వాటికి ఏ చిన్న బాధ కలిగినా అవి నోరు తెరిచి చెప్పలేవు.

Published : 06 Jan 2022 17:26 IST

పగలంతా స్వెటర్‌ వేసుకున్నా, రాత్రుళ్లు దుప్పటి కప్పుకున్నా చలికి తట్టుకోలేకపోతున్నాం. మరి, మన పరిస్థితే ఇలా ఉంటే.. మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే పెంపుడు జంతువుల మాటేంటి? ఈ ప్రతికూల వాతావరణం వల్ల వాటికి ఏ చిన్న బాధ కలిగినా అవి నోరు తెరిచి చెప్పలేవు. అందుకే ఈ కాలంలో వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలంటున్నారు నిపుణులు. అదెలాగంటే..!

వెచ్చదనం పంచేలా!

పెంపుడు జంతువుల శరీరంలో కొవ్వులు, కండరాల శాతం తక్కువ! తద్వారా వాటి శరీరం చలికి తట్టుకోలేదు. అందుకే వాటి కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పెట్ హౌస్ లో తగిన ఏర్పాట్లు చేయాలి. వెచ్చదనం పంచేలా ఓ చిన్న పరుపు, బ్లాంకెట్‌.. వంటివి అమర్చాలి. ప్రస్తుతం ఇలాంటివి ఆన్‌లైన్‌లో సరసమైన ధరల్లోనే దొరుకుతున్నాయి. మరోవైపు వాటిని అలాగే వదిలేయకుండా.. కాస్త మందపాటి పెట్‌ టీషర్ట్స్‌, జాకెట్స్, క్యాప్‌, స్వెటర్స్‌.. వంటివి వేయచ్చు. ఇలా అమర్చిన పెట్ హౌస్ ను.. బయటి ఉష్ణోగ్రతను బట్టి వెచ్చగా సెట్‌ చేసుకున్న గదిలో ఉంచాలి.

మోతాదు పెంచండి!

చలికాలంలో మన శరీరంలో జీవక్రియలు మందగించడం వల్ల ఆకలేయదు. కానీ పెట్స్‌ ఇందుకు భిన్నమంటున్నారు నిపుణులు. వాటి శరీరంలో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి ఎక్కువ క్యాలరీలు, పోషకాలు అవసరమవుతాయట! అందుకే చలికాలంలో వాటి ఆకలి మరింతగా పెరుగుతుందంటున్నారు. ఈ క్రమంలోనే వాటికి అందించే ఆహారం మోతాదును పెంచడం.. వేడివేడిగా సూప్స్‌, మీట్ బ్రాత్.. వంటివి అందించడం.. మంచిది. అలాగే వాటి ఆహారం విషయంలో ఏ సందేహమున్నా సంబంధిత నిపుణుల్ని సంప్రదించచ్చు. అలాగే వాటికి ఏ ఆహారం పెట్టినా, నీళ్లు అందించినా గోరువెచ్చగా ఇవ్వడం మంచిది.

వ్యాయామం చేయించండి!

వ్యాయామం వల్ల శరీరంలో వేడి పుడుతుంది. తద్వారా వెచ్చదనాన్ని పొందచ్చు. పెట్స్‌కీ ఈ నియమం వర్తిస్తుంది. కాబట్టి మనతో పాటు వాటిని కూడా ఉదయాన్నే నడక, పరుగు, జాగింగ్‌కి తీసుకెళ్లడం మంచిది. అలాగే ఇంట్లో చేసే వ్యాయామాల్లోనూ వాటిని భాగం చేయండి. పిల్లల్ని వాటితో ఆడుకోనివ్వండి. తద్వారా ఇటు మీరు, అటు మీ పెట్స్‌ ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండచ్చు.

మర్దనతో ఫలితం!

చలికాలంలో మనలో చాలామందికి ఎలాగైతే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు.. వంటివి తలెత్తుతాయో.. పెంపుడు జంతువులకూ ఈ కాలంలో ఈ సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. అయితే వీటి నుంచి ఉపశమనం పొందాలంటే వాటి కోసం ప్రత్యేకంగా నొప్పిని తగ్గించే నూనెలు బయట లభిస్తాయి. వాటితో పెట్స్‌కి శరీరమంతా మర్దన చేయడం వల్ల కొంత వరకు ఉపశమనం కలుగుతుంది. అయినా అవి డల్‌గా కనిపించడం, ఒకే దగ్గర కూర్చుండిపోవడం.. వంటివి చేస్తే మాత్రం సంబంధిత నిపుణుల వద్దకు వాటిని తీసుకెళ్లి సకాలంలో చికిత్స అందించడం మంచిది.

ఇవి కూడా!

* పెంపుడు జంతువులకు వాటి శరీరంపై ఉండే దట్టమైన వెంట్రుకలు (Fur) వాటికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఈ కాలంలో చలికి తట్టుకునే శక్తిని వాటికి అందిస్తాయి. అందుకే శీతాకాలంలో పెంపుడు జంతువుల వెంట్రుకలు కత్తిరించకుండా పెరగనివ్వాలంటున్నారు నిపుణులు.

* మనలాగే పెంపుడు జంతువుల పాదాలూ చలికి పొడిబారిపోయి పగులుతుంటాయి. ఈ సమస్య నుంచి వాటిని కాపాడాలంటే మార్కెట్లో దొరికే Paw Balm ఉపయోగించడం మంచిది.

* ఇక ఈ కాలంలో పెట్స్‌కి రోజూ స్నానం చేయించాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. రెండు మూడు రోజులకోసారి చేయిస్తూ, పరిశుభ్రమైన ప్రదేశంలో అవి ఉండేలా చేస్తే సరిపోతుందంటున్నారు.

మరి, మీ ఇంట్లోనూ పెంపుడు జంతువులున్నాయా? అయితే ఈ చలికాలంలో మీరు వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? Contactus@vasundhara.net ద్వారా మాతో పంచుకోండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్