KGF 2 Love Story: సీరియల్లో కలుసుకుని.. జీవితంలో ఒక్కటయ్యారు!
ఓ అమ్మాయి-అబ్బాయి అనుకోకుండా కలుసుకోవడం, స్నేహితులుగా మారడం, ఒకరిపై ఒకరు కొండంత ప్రేమను పెంచుకోవడం, ముందు అబ్బాయి ప్రపోజ్ చేసినా.. అమ్మాయి అంత సులువుగా ఒప్పుకోకపోవడం.. ఈ తరహా లవ్‌స్టోరీని సినిమాల్లోనే....
(Photo: Instagram)
ఓ అమ్మాయి-అబ్బాయి అనుకోకుండా కలుసుకోవడం, స్నేహితులుగా మారడం, ఒకరిపై ఒకరు కొండంత ప్రేమను పెంచుకోవడం, ముందు అబ్బాయి ప్రపోజ్ చేసినా.. అమ్మాయి అంత సులువుగా ఒప్పుకోకపోవడం.. ఈ తరహా లవ్‌స్టోరీని సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ ఓ స్టార్ కపుల్ ప్రేమకథ కూడా అచ్చం ఇలాంటి సినిమా స్టోరీనే తలపిస్తుంది. మరి, వాళ్లెవరో కాదు.. నేషనల్ క్రష్ యష్, ఆయన ఇష్టసఖి రాధికా పండిట్. కేజీఎఫ్-2తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కన్నడ హీరో.. ప్రస్తుతం తన భార్యాపిల్లలతో కలిసి వెకేషన్‌లో చిత్ర సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు ‘క్యూట్ కపుల్’, ‘స్వీట్ ఫ్యామిలీ’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి, ఈ ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ ముచ్చటైన ప్రేమకథేంటో మనమూ తెలుసుకుందాం రండి..
సెట్స్‌లో కలుసుకొని.. క్యాబ్ పంచుకొని!
కన్నడ స్టార్ హీరో యష్, నటి రాధికా పండిట్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీళ్లిద్దరూ తొలిసారి 2004లో ‘నంద గోకుల’ అనే టీవీ సీరియల్ సెట్స్‌లో కలుసుకున్నారు. అయినా ఒకరితో ఒకరు పెద్దగా మాట్లాడుకున్నది లేదు. పైగా యష్ చాలా ఆడంబరమైన వ్యక్తి అనుకుంది రాధిక. యష్ మనసులోనూ రాధికపై అలాంటి అభిప్రాయమే ఉండేది. ఇక ఈ సీరియల్ షూటింగ్ పూర్తయ్యే వరకూ ఒకే క్యాబ్‌లో సెట్స్‌కి రావడం, పోవడం.. వంటివి చేసినా ఇద్దరూ కలిసి మాట్లాడుకుంది చాలా తక్కువే అని చెప్పాలి. ఆపై నాలుగేళ్ల తర్వాత ‘మొగ్గిన మనసు’, మరో నాలుగేళ్ల తర్వాత ‘డ్రామా’ అనే రెండు చిత్రాల్లో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఇలా ఏళ్ల పాటు కలిసి పనిచేయడం వల్ల వీళ్ల మధ్య స్నేహబంధం పెరిగింది. అది దృఢమై ప్రేమకు దారితీసింది.
పెదవి దాటని మాటొకటుంది!
అయితే ఇద్దరూ తమ మనసుల్లో ఒకరిపై ఒకరు కొండంత ప్రేమను నింపుకొన్నారు. ఇక ప్రపోజల్‌కు ముందు ‘తనే నా బలం, ఎమోషన్!’ అని తన మనసులో అనుకున్నానంటున్నాడీ స్టార్ హీరో. ‘యష్.. నా వన్ పీస్!’ అనుకున్నానని రాధిక చెబుతోంది. ఇలా ఒకరిపై ఒకరు సముద్రమంత ప్రేమను మనసులో నింపుకొన్నా చాలా కాలం పాటు పెదవి దాటనివ్వలేదు. అయినా ఒకరి మనసులో మరొకరికి ఎంత ప్రేముందో తెలుసుకోవడానికి చాలా ఎత్తులే వేశారట ఈ లవ్లీ కపుల్. ఇక ఆఖరికి యష్ ధైర్యం చేసి ఓ రోజు రాధికకు ఫోన్ చేశాడు. అయితే అప్పటికే తన పేరెంట్స్‌తో సినిమాకు వెళ్లే హడావిడిలో ఉన్న ఆమె.. అదే విషయం చెప్పేసరికి అప్పటికి ఆ ఐడియా వర్కవుట్ కాకపోవడంతో నిరాశ చెందాడు యష్.
ఫోన్ ప్రపోజల్!
అయినా సినిమా కోసం రాధిక వెళ్లిన మాల్కే వెళ్లిన యష్.. ఆమె సినిమా ఎంజాయ్ చేసేంత లోపు.. మాల్‌లో తన ఇష్టసఖికి నచ్చిన వస్తువులన్నీ కొనేశాడు. వాటిని సీక్రెట్‌గా ఆమె కార్లో పెట్టేసి.. ‘హ్యాపీ వేలంటైన్స్ డే’ అంటూ తన మనసులోని మాటల్ని సందేశంగా రాసి గిఫ్ట్స్‌కు జతచేశాడు. అది చూసిన రాధికకు మ్యాటర్ అర్థమైపోయింది. ఇదంతా యష్ పనే అని తెలిసినా.. మౌనం వీడలేదు. ఇలా వీళ్ల మూగ ప్రేమ మరికొన్నాళ్ల పాటు సాగింది. ఇలా అయితే లాభం లేదనుకున్న ఈ హ్యాండ్‌సమ్.. ఓ రోజు ధైర్యం చేసి రాధికకు ఫోన్ చేశాడు. ‘ఐలవ్యూ!’ చెప్పేశాడు. తన మనసులోని మాటలన్నీ ఆమెతో పంచుకున్నాడు. నిజానికి రాధిక మనసులో ఉన్నది కూడా అదే! కానీ వెంటనే బయటపడకుండా ఆరు నెలలు సమయం కావాలని అడగడంతో.. ‘నీ ప్రేమ కోసం ఆరు నెలలేంటి.. ఆరు యుగాలైనా ఎదురుచూస్తా..’నంటూ కళ్లల్లో వత్తులేసుకొని మరీ రాధిక రిప్లై కోసం ఎదురుచూశానని ఓ సందర్భంలో పంచుకున్నాడు యష్. మొత్తానికి రాధిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి ప్రేమకు శుభం కార్డు పడ్డట్లైంది.
మేమిద్దరం.. మాకిద్దరు!
ఇలా ఎట్టకేలకు తమ ప్రేమను పండించుకున్న ఈ జంట.. 2016, డిసెంబర్ 9న పెళ్లి పీటలెక్కింది. పెళ్లి అతికొద్ది మంది సమక్షంలో జరిగినా.. రిసెప్షన్ మాత్రం జామ్ జామ్‌గా చేసుకుందీ ముద్దుల జంట. అప్పట్లో వీళ్ల పెళ్లి, రిసెప్షన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇలా తమ ప్రేమకు గుర్తుగా 2018లో కూతురు ఐరా, ఆ మరుసటి ఏడాది యథర్వ్ అనే బాబును తమ జీవితాల్లోకి ఆహ్వానించి.. తమ కుటుంబాన్ని సంపూర్ణం చేసుకున్నామంటూ ఓ సందర్భంలో మురిసిపోయారు యష్-రాధిక దంపతులు. ఇక అప్పట్నుంచి ఇప్పటిదాకా తమ జీవితాల్లోని ప్రతి సందర్భాన్నీ ఎంజాయ్‌చేస్తూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ.. ఈ తరం దంపతులకు రిలేషన్‌షిప్ పాఠాలు నేర్పుతున్నారీ క్యూట్ కపుల్. అంతేకాదు.. ఆ స్పెషల్ మొమెంట్స్‌ని ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటూ మురిసిపోతోందీ ముద్దుల జంట.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.