నాలాగా ఎవరూ డ్రగ్స్‌కు బానిస కావొద్దు..!

బెంగళూరుకి చెందిన ఓ పన్నెండేళ్ల అమ్మాయి తెలియకుండానే మాదకద్రవ్యాలకు బానిసగా మారింది. తర్వాత అదొక ప్రాణాంతకమైన వూబి అని తెలిసినా దాని నుంచి బయటకు రాలేకపోయింది. ఫలితంగా తన కుటుంబానికి దూరం కావడంతోపాటు, సమాజంలో అవమానాలను, మాటల తూటాలను ఎదుర్కొంది.

Published : 16 Dec 2021 19:52 IST

బెంగళూరుకి చెందిన ఓ పన్నెండేళ్ల అమ్మాయి తెలియకుండానే మాదకద్రవ్యాలకు బానిసగా మారింది. తర్వాత అదొక ప్రాణాంతకమైన వూబి అని తెలిసినా దాని నుంచి బయటకు రాలేకపోయింది. ఫలితంగా తన కుటుంబానికి దూరం కావడంతోపాటు, సమాజంలో అవమానాలను, మాటల తూటాలను ఎదుర్కొంది. కానీ 22ఏళ్ల ప్రాయంలో తన తప్పు తాను తెలుసుకొని తిరిగి సాధారణ జీవితం సాగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అసలేం జరిగింది? మాదకద్రవ్యాలకు బానిసగా ఎలా మారింది.. మొదలైన విషయాలన్నీ తెలియాలంటే ఆమె హృదయరాగం వినాల్సిందే..!

హాయ్..

నా పేరు సౌందర్య. మాది బెంగళూరు. అమ్మానాన్నకి నేను ఒక్కదాన్నే సంతానం. అందుకే అల్లారుముద్దుగా పెంచారు. ఉన్నంతలోనే సంతోషంగా చూసుకునేవారు. నాకు నాణ్యమైన విద్య అందాలని చిన్నప్పుడు స్థానికంగా ఉన్న ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో చేర్పించారు. ప్రాథమిక విద్య బాగానే సాగింది. హైస్కూలుకి వచ్చిన తర్వాతే నాకు చదువు పట్ల ఆసక్తి తగ్గింది. పైగా అక్కడ నాకు ఎవరూ తెలియకపోవడంతో స్కూలుకి వెళ్లడానికి అంతగా ఆసక్తి చూపించేదాన్ని కాదు. తరగతి గదిలోకి వెళ్లినా అక్కడున్న విద్యార్థులంతా వారి వారి పనుల్లో బిజీగా ఉండేవారు. నాతో మాట్లాడేందుకు, స్నేహం చేసేందుకు ఆసక్తి చూపించేవారు కాదు. అలా నాకు తెలియకుండానే ఆత్మన్యూనతకు గురై డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. సరిగ్గా అదే సమయంలో స్కూలు పరిసరాల్లో చాక్లెట్లు అమ్మే ఓ పెద్దావిడతో నాకు పరిచయం అయింది. ఆమె పేరు రీనా. రోజూ నాకు చాక్లెట్స్ ఇచ్చేది. స్కూలుకి వచ్చి, చక్కగా చదువుకోవాలంటూ హితబోధ చేసేది. అలా ప్రేమగా రెండు మాటలు చెప్పేసరికి నాకేదో పెద్ద ఆసరా దొరికిందన్న భావన కలిగింది. దాంతో ఆమెను పూర్తిగా నమ్మడం ప్రారంభించా.

మొదట్లో మామూలు చాక్లెట్లు ఇచ్చే రీనా తర్వాత తాను ప్రత్యేకంగా తయారుచేశా అని చెబుతూ అదో రకమైన చాక్లెట్స్ తెచ్చి ఇచ్చేది. ఆమెపై ఉన్న నమ్మకంతో ఎలాంటి అనుమానం లేకుండా నేను కూడా అవి తీసుకొని తినేదాన్ని. కానీ అవి తిన్న కొద్ది రోజుల్లోనే నా ప్రవర్తనలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ చాక్లెట్లు తిన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపించేది. వేరే లోకంలోకి వెళ్లిపోయేదాన్ని. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే నేను తరగతి గదిలో అల్లరి చేయడం, అప్పుడప్పుడూ మత్తుగా మాట్లాడడం, తోటిపిల్లలను ఏడిపించడం.. వంటివి చేసేదాన్ని. ఈ క్రమంలోనే రీనా నాకు మరిన్ని చాక్లెట్స్ ఇచ్చి తరగతి గదిలో ఉన్న తోటిపిల్లలకు కూడా ఇవ్వమని చెప్పేది. అయితే చాక్లెట్లపై ఉన్న మక్కువతో చాలావరకు వాటిని నేనే తినేదాన్ని. ఒక్కోసారి మాత్రం ఆమె చెప్పినట్లు నాకు నచ్చిన కొందరు విద్యార్థులకు అవి ఇచ్చేదాన్ని. ఒక్కరోజు రీనా రాకపోయినా నాకు పిచ్చెక్కిపోయేది. నా ప్రవర్తనలో మార్పు గురించి స్కూలు యాజమాన్యం అమ్మానాన్నలకు తెలియజేయడంతో వారు స్కూలుకి రావడం, జరిగింది తెలుసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత అమ్మానాన్న ఏం జరిగిందంటూ నన్ను నిలదీయగా జరిగినదంతా వారికి చెప్పా. ఆ తర్వాత రీనా నాకు చాక్లెట్లలో మాదకద్రవ్యాలు కలిపి ఇచ్చిందని తెలిసి కౌన్సెలింగ్ నిమిత్తం నాన్న నన్నొక పునరావాస కేంద్రానికి పంపించారు. అప్పటికి నా వయసు కేవలం 14సం|| మాత్రమే.

*****

అక్కడ్నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నగరంలోని ఓ ప్రముఖ కళాశాలలో ఇంటర్‌లో చేర్పించారు. నేను అక్కడ చేరేటప్పటికే చాలామంది విద్యార్థులను మత్తుకు బానిసలుగా మార్చేస్తున్నారు కొందరు వ్యక్తులు. అంతకుముందే మాదకద్రవ్యాల బారిన పడి తిరిగి కోలుకున్న నేను ఈసారి వాటి మత్తులో పడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నా. కానీ నా సంకల్పం కంటే ఈసారి కూడా నా బలహీనతే నన్ను జయించింది. అందుకే ఆ కాలేజ్‌లో ఉన్న 'కూల్‌గర్ల్స్' అనే గ్రూప్‌తో నాకు పరిచయమైంది. వారంతా సంపన్న కుటుంబాలకు చెందిన అమ్మాయిలే. పార్టీలు, పబ్బులు అంటూ పాశ్చాత్య సంప్రదాయాలకు బాగా అలవాటు పడినవారు. వారితో కొద్ది రోజులు గడిపేసరికి నాకు కూడా దాదాపు ఆ తీరు అలవడిపోయింది. అయితే వాళ్లంతా మద్యం, పొగత్రాగడం, మాదకద్రవ్యాలు.. వంటి అలవాట్లకు బానిసలే కావడంతో చూస్తూచూస్తూనే మరోసారి ఆ వూబిలో కూరుకుపోయా. ఈసారి మరికొంత ముందుకెళ్లి రకరకాల డ్రగ్స్ రుచి చూసేదాన్ని. వాటిని కొనడం కోసం ఇంట్లో ఆ ఫీజు, ఈ ఫీజు.. అని చెబుతూ డబ్బు తీసుకునేదాన్ని. అలాగే నా వద్ద ఉన్న మొబైల్, వాచ్, యాక్సెసరీస్.. మొదలైనవి అమ్మేసేదాన్ని. అలా సమకూరిన సొమ్ముని డ్రగ్స్ కొనుక్కోవడానికి ఉపయోగించేదాన్ని. ఇంట్లో అడిగితే పోయాయని అబద్ధం చెప్పేదాన్ని.

స్కూల్లో చదువుకునే రోజుల్లోనే మాదకద్రవ్యాలకు నేను బానిసనైనప్పుడు ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు, మాకు తెలిసిన బంధువులు, సన్నిహితులు.. అంతా నన్ను, అమ్మానాన్నని నానా రకాల మాటలు అన్నారట! ఇక కాలేజ్‌లో కూడా మత్తుకి బానిసనయ్యా అని తెలిస్తే వూరుకుంటారా?? శుభకార్యం, పండగలు, పబ్బాలు.. వంటి ఏ సందర్భానికైనా మా కుటుంబాన్ని దూరం పెట్టేవారు. ఎప్పుడైనా రోడ్డు మీద ఎదురుపడినా 'వీళ్ల అమ్మాయి ఇలా చేసింది..' అని అనేవారు. అన్నింటికీ మించి ఇరుగుపొరుగు సైతం ఎవరూ మమ్మల్ని పట్టించుకునేవారు కాదు. చుట్టుపక్కల ఇంత నరకం ఉన్నా.. అందరూ సూటిపోటి మాటలతో పొడుస్తున్నా కన్న పాపానికి నన్ను ఆ డ్రగ్స్ మత్తు నుంచి బయటపడేయడానికి అమ్మానాన్నలు చేసిన ప్రయత్నాలు ఎన్నో. అయినా ఆ వూబి నుంచి బయటకు రావడం నా ఒక్కదాని వల్ల సాధ్యం కాలేదు. ఒక్కపూట ఆ మత్తు లేకపోతే.. మెదడులో నరాలు చిట్లిపోతున్నట్లు, కళ్లు మసకగా కనిపిస్తున్నట్లు, ఒళ్లంతా బలహీనంగా మారిపోయినట్లు.. పట్టరాని కోపం, ఆవేశం వచ్చి పిచ్చిదానిలా ప్రవర్తించేదాన్ని. దాంతో అమ్మానాన్నకి తెలియకుండా డ్రగ్స్ తీసుకునే దారులను ఆశ్రయించేదాన్ని.

*****

దాంతో అమ్మానాన్న కూడా విసిగిపోయారు. అందుకే ఈసారి మాదకద్రవ్యాల మత్తులోనే తూగాలనుకుంటే ఇంకెప్పుడూ ఇంటి ఛాయలకు రావద్దని అమ్మ ఖండింతంగా చెప్పేసింది. జీవితాన్ని నాశనం చేసే డ్రగ్స్ కావాలో లేక అమ్మానాన్న కావాలో తేల్చుకోమంది. ఆ మాటతోనే మరోసారి పునరావాస కేంద్రాన్ని ఆశ్రయించా. సుమారు ఆరు నెలలపాటు అక్కడ కౌన్సెలింగ్ తీసుకున్నా. కానీ ఆ ఆరునెలలు ప్రత్యక్షంగా నరకం అనుభవించా. డ్రగ్స్‌కి దూరంగా ఉండాలని నేను వంద ప్రయత్నాలు చేస్తే నాకు నరనరాన ఎక్కేసిన వాటి మత్తు మాత్రం లక్ష దారుల్లో నన్ను లొంగదీసుకోవడానికి ప్రయత్నించేది. అవన్నీ దాటుకొని మళ్లీ సాధారణ జీవితాన్ని గడిపేందుకు నాకు సుమారు ఏడాదికి పైనే పట్టింది. ఇప్పుడు ఇంటి పట్టునే ఉంటూ దూరవిద్య ద్వారా డిగ్రీ చదువుకుంటున్నా. అంతేకాదు.. నాకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. దానినే వృత్తిగా మలుచుకొని ఉపాధి సైతం పొందుతున్నా. ఇప్పుడు అమ్మానాన్నతో కలిసి చాలా సంతోషంగా జీవితం సాగిస్తున్నా.

*****

మరి, ఇదంతా మీతో ఎందుకు చెప్పాననేగా మీ సందేహం.. జీవితంలో నేను కొన్నిసార్లు తెలియక తప్పులు చేశా. ఇంకొన్నిసార్లు బలహీనత కొద్దీ తప్పని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితులు చూశా. జీవితాన్ని చేజేతులారా నాశానం చేసుకున్నా. ఇప్పుడు తిరిగి కోలుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నా. ప్రస్తుతం చాప కింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్ మాఫియా విద్యార్థులు, యువతీయువకులనే వారి మాదకద్రవ్యాలకు వాహకాలుగా మార్చుకుంటోంది. ఈ నేపథ్యంలో నా కథ తెలుసుకునైనా కొందరు జాగ్రత్తపడకపోతారా అనే ఆశతో ఇలా మీ ముందుకి వచ్చా. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే- 'సభ్యసమాజంలో మన కుటుంబం సంతోషంగా తలెత్తుకొని తిరగాలంటే అది మన ప్రవర్తన మీద కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే మనం నేడు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లే భవిష్యత్తులో మనకు వచ్చే అవకాశాలకు అడ్డుకట్టగా మారతాయి. జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. కాబట్టి చదువుకునే వయసులో జాగ్రత్తపడదాం.. ప్రత్యేకించి ఆకర్షణలకు లొంగిపోయి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా జాగ్రత్తపడదాం.. మాదకద్రవ్యాలకు దూరంగా సత్ప్రవర్తనతో మెలుగుదాం.. మత్తు మాయలో పడకుండా జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుందాం.

ఇట్లు,
సౌందర్య

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్