డేటింగ్ యాప్స్‌లో ఇలాంటి కేటుగాళ్లూ ఉంటారు జాగ్రత్త!

ఆ అమ్మాయిది రాజమండ్రి. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటోంది. సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్. అలాగని ఎవరితోనూ అంత త్వరగా మాట కలిపే మనస్తత్వం కాదు.. అయినా సరే.. ఓ డేటింగ్ యాప్‌లో ఒకతని ఫొటో చూసి ఇష్టపడింది. అతనితో స్నేహం చేయడం ప్రారంభించింది.

Published : 15 Nov 2021 14:33 IST

ఆ అమ్మాయిది రాజమండ్రి. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటోంది. సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్. అలాగని ఎవరితోనూ అంత త్వరగా మాట కలిపే మనస్తత్వం కాదు.. అయినా సరే.. ఓ డేటింగ్ యాప్‌లో ఒకతని ఫొటో చూసి ఇష్టపడింది. అతనితో స్నేహం చేయడం ప్రారంభించింది. ఆ స్నేహం ప్రేమగా మారి పరిణయం దిశగా అడుగులు వేసే వేళ తాను మోసపోయానని గ్రహించింది. ఇప్పుడు కుమిలిపోతోంది.. ఇంతకీ ఎవరా అమ్మాయి? అసలు ఏం జరిగింది? హాయిగా సాగిపోతున్న ప్రేమ ప్రయాణంలో ఉన్నట్టుండి ఏం జరిగింది?? తెలియాలంటే ఇది చదవాల్సిందే...

హాయ్.. నా పేరు లహరి. మాది రాజమండ్రి. నేను ఎంసీఏ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా ఒక పేరున్న ఎమ్మెన్సీలో జాబ్ కూడా సంపాదించుకున్నా. అలా ఉద్యోగరీత్యా నేను రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా నాది కాస్త భిన్నమైన మనస్తత్వం. నేను ఎవరితోనూ అంత త్వరగా మాట కలపను. ఒకవేళ మనసుకు బాగా దగ్గరైతే వారిని అంత ఈజీగా వదులుకోలేను. బహుశా.. ఈ స్వభావం కారణంగానే ఏమో.. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. ఉన్న ఇద్దరుముగ్గురు స్నేహితులు కూడా రాజమండ్రిలోనే ఉన్నారు. స్వస్థలం వదిలి జాబ్ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మొదట్లో కొద్ది రోజులు బాగానే గడిచిపోయింది. తర్వాత పగటి సమయంలో ఆఫీసు కారణంగా పెద్దగా బోర్ అనిపించేది కాదు. కానీ రాత్రి సమయంలో మాత్రం ఒంటరిదాన్ననే ఫీలింగ్ వచ్చేది. దీని నుంచి బయటపడడానికే సోషల్ మీడియాను ఆశ్రయించా. మొదట్లో వీటిలో నేను అంత యాక్టివ్‌గా ఉండేదాన్ని కాదు. కానీ రాన్రాను వాటిల్లో ఉత్సాహంగా ఫొటోలు, సమాచారం.. వంటివి షేర్ చేసుకోవడం మొదలుపెట్టా. కేవలం ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే కాదు.. కొన్ని డేటింగ్ యాప్స్ కూడా అప్పుడప్పుడూ చూసేదాన్ని.

అలా ఓసారి నేను అనుకోకుండా చూసిన వ్యక్తి ఫొటో నన్ను బాగా ఆకర్షించింది. చూడడానికి అందంగా, చాలా మృదుస్వభావిలా కనిపించాడు. ఆ ఆసక్తితోనే అతని పేరు చూశా. లలిత్.. పేరులో ఉన్న సౌమ్యత అతనిలో ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకేమీ ఆలోచించకుండానే ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించా! ఆ తర్వాత నా పనిలో నేను నిమగ్నమైపోయా. మర్నాడు ఆఫీసుకు వెళ్లొచ్చిన తర్వాత ఎఫ్‌బీ తెరిచి చూడగానే ఇన్‌బాక్స్‌లో అతని నుంచి మెసేజ్ వచ్చినట్లు కనిపించింది. ఏంటా అని చాలా ఉత్సాహంగా తెరచి చూశా. 'హాయ్.. నా పేరు లలిత్. నేను మూడు నెలల ముందే మీ ప్రొఫైల్ చూశా.. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాలని అనిపించింది. కానీ వ్యక్తిగతంగా నేను ఎవరితోనూ అంత త్వరగా మాట్లాడే మనిషిని కాను.. అందుకే వెనకడుగు వేశా..' అంటూ తన గురించి చెప్పుకొచ్చాడు. అది చదువుతుంటే నా గురించి నేను చెప్పుకుంటున్నట్లే అనిపించింది. అందుకే ఆ మెసేజ్‌కు 'ఫర్వాలేదు.. నాది కూడా అచ్చం మీలాంటి మనస్తత్వమే..' అని రిప్త్లె ఇచ్చా..! ఆ తర్వాత దాదాపు రెండు వారాలపాటు ఇద్దరి మధ్యా హాయ్, హలో.. అంటూ సందేశాల ప్రవాహం బాగా కొనసాగింది. ఈ క్రమంలోనే మా కుటుంబాలు, నేపథ్యం గురించి కూడా పరస్పరం తెలియజేసుకున్నాం.]

*****

మా స్నేహం ఇలా కొనసాగుతున్న సమయంలోనే ఓసారి 'నిన్ను చూడాలని ఉంది.. నీ సెల్ఫీ పంపవూ..' అంటూ చాలా గోముగా అడిగాడు లలిత్. వెంటనే నమ్మకమైన వ్యక్తే కదా అని మరో ఆలోచన లేకుండా సెల్ఫీ పంపేశా. నేను అడగకుండానే లలిత్ కూడా తన సెల్ఫీ పంపించాడు. నేను అతడు ఎంత మృదు స్వభావి అని వూహించానో అతకంటే సౌమ్యంగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. అతని ఫొటో చూస్తుండగానే 'నువ్వు నాకు నచ్చావు.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను..' అంటూ మరొక మెసేజ్ పంపించాడు. అది చూసి మొదట కాస్త షాక్ అయ్యా. కానీ అతని రూపం, మనస్తత్వం నచ్చడంతో కాస్త టైం తీసుకుని నేను కూడా అతని ప్రేమను అంగీకరించా. మీకు చెప్పలేదు కదూ..! లలిత్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఉండేది బెంగళూరులో! మా ప్రేమ పట్టాలెక్కి రెండు నెలలు గడిచిపోయింది. ఒక్కో రోజు ఒక్కో క్షణంలా చాలా హాయిగా త్వరత్వరగా ముగిసిపోతున్న సమయంలో నేనే లలిత్‌ను చూడాలనిపించి ఆ విషయం తనకి చెప్పా. తను కూడా పట్టరానంత సంతోషంతో 'ఈ మాట నువ్వు ఎప్పుడెప్పుడు అంటావా అని ఎదురుచూస్తున్నాను..' అంటూ ఎగిరి గంతేసినంత పని చేశాడు. 'ఈ వారాంతంలోనే హైదరాబాద్‌కు వస్తున్నా..' అని చెప్పాడు. ఇప్పటివరకు ఫోన్, సామాజిక మాధ్యమాల్లో చూసుకున్న మేము ఇక నేరుగా కలిసి మాట్లాడుకోనున్నామన్న సంతోషంతో నేనూ ఉక్కిరిబిక్కిరైపోయా. వారాంతం కోసం వేయి కళ్లతో ఎదురుచూడడం ప్రారంభించా.

*****

ఇప్పటివరకు రోజొక క్షణంలా గడిచిపోయింది.. కానీ వారాంతం కోసం ఎదురుచూడడం ప్రారంభించిన తర్వాత క్షణం ఒక యుగంలా గడిచినట్లు అనిపించింది. ఈలోగా ఎంతో ఆశగా చూస్తున్న సమయం రానే వచ్చింది. శుక్రవారం 'నేను బయల్దేరా' అంటూ లలిత్ పంపే మెసేజ్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా. ఆ సమయంలోనే అతన్నుంచి ఫోన్ వచ్చింది. ఎంతో సంతోషంగా లిఫ్ట్ చేశా.. 'అమ్మకు ఒంట్లో బాలేదు.. ఆసుపత్రిలో చేర్పించాం.. నేను ఈరోజు రాలేకపోతున్నాను.. సారీ..' అంటూ బాధతో మాట్లాడాడు లలిత్. 'ఫర్వాలేదు.. మరోసారి ఇక్కడకు వద్దువుగానీ.. ఇప్పుడు అమ్మను జాగ్రత్తగా చూసుకో..' అని నేను కూడా బదులిచ్చా. సరేనని ఫోన్ కట్ చేశాడు. ఆ విషయం గురించే ఆలోచిస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయా. మళ్లీ అదే రోజు రాత్రి 11గం||ల సమయంలో లలిత్ ఫోన్ చేశాడు. 'అమ్మకు ఏవో వైద్య పరీక్షలు చేయాలట! దాదాపు లక్ష వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం నా వద్ద అంత డబ్బు లేదు.. ఏం చేయాలో పాలు పోవట్లేదు..' అంటూ ఏడ్చినంత పని చేశాడు. నేను వెంటనే 25వేల రూపాయలు అతని అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసి ధైర్యంగా ఉండమని చెప్పా. 'థ్యాంక్స్' అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మర్నాడు ఉదయాన్నే 'అమ్మకు ఎలా ఉంది?' అని అడిగా! 'అన్ని పరీక్షలు చేసి అమ్మకు క్యాన్సర్ ఉందని చెప్పారు. ఇప్పటికిప్పుడే చికిత్స ప్రారంభించాలని అంటున్నారు.' అంటూ మరోసారి బాధపడుతుంటే తట్టుకోలేకపోయా. నేను జాబ్ చేస్తూ దాచుకున్న సేవింగ్స్ 3 లక్షల రూపాయల్లో 2 లక్షలు తనకు పంపించా. చాలా థ్యాంక్స్ అంటూ సమాధానం చెప్పి ఫోన్ కట్ చేశాడు.

*****

ఆ తర్వాత అతని నుంచి నాకు ఎలాంటి ఫోన్ లేదా మెసేజ్‌లు రాలేదు. నేను పంపిన సందేశాలు, చేసిన ఫోన్ కాల్స్‌కు కూడా ఎలాంటి సమాధానం లేదు. రెండు రోజులు ఆఫీసుకు కూడా వెళ్లకుండా పిచ్చిదానిలా లలిత్ అమ్మగారికి ఏమైందా అని బాగా టెన్షన్ పడ్డా. మూడో రోజుకి కానీ నాకు అర్థం కాలేదు.. నేను మోసపోయా అని! అవును.. రెండు రోజులపాటు అతన్నుంచి ఎలాంటి సమాధానం లేకపోయేసరికి ఏమైందో తెలుసుకోవడానికి అతను పని చేస్తున్నానని చెప్పిన సంస్థకు ఫోన్ చేశా. నేను చెప్పిన వ్యక్తి పేరు, వివరాలతో అక్కడ ఎవరూ పని చేయట్లేదని చెప్పారు. అలాగే హాస్పిటల్‌కు కూడా ఫోన్ చేశా. ఆ హాస్పిటల్‌లో అసలు క్యాన్సర్‌తో ఎవరూ చేరలేదని స్పష్టం చేశారు. నేను మోసపోయానని తెలుసుకోవడానికి ఇంతకుమించి రుజువులేం కావాలి??

ఈ విషయం చెప్పి, నా బాధను పంచుకుందామంటే ఇక్కడ నాకు స్నేహితులంటూ ఎవరూ లేరు. పోనీ.. అమ్మానాన్నకు చెబుదామా అంటే.. 'వెలగబెట్టిన నిర్వాకం చాలు.. ఇంటికి వచ్చెయ్' అంటారని భయం. చేసేది లేక వారం రోజుల పాటు నాలో నేనే కుమిలిపోయా. చెప్పలేనంత బాధలో కూరుకుపోయా. ఆ సమయంలోనే 'అసలు ఇంతగా బాధపడడానికి నేనేం తప్పు చేశాను?' అని ఆలోచించా! వెంటనే తేరుకున్నా.. సైబర్ క్రైం ఆఫీసుకు వెళ్లి జరిగినదంతా చెప్పి ఫిర్యాదు చేశా. వాళ్లు పదిహేను రోజుల పాటు విచారణ చేయగా అందులో విస్తుపోయే నిజాలు తెలిశాయి. నాతో మాట్లాడిన వ్యక్తి పేరు లలిత్ కాదు.. ప్రశాంత్.. పైగా అతను సామాజిక మాధ్యమాల్లో ఉపయోగిస్తున్న ఫొటోలు, నాకు పంపిన సెల్ఫీ స్టిల్స్.. ఇవేవీ అతనివి కావట! ఇదంతా తెలిసి నేను నిర్ఘాంతపోయా. అతడు కేవలం నా దగ్గర్నుంచే కాదు.. మరో పది మంది అమ్మాయిల నుంచి కూడా అలా లక్షల్లో డబ్బు తీసుకొని అందరినీ మోసం చేశాడు. అదృష్టవశాత్తు అతడి నుంచి ఆ సొమ్మును పోలీసులు రాబట్టడంతో నా డబ్బు నాకు తిరిగి వచ్చింది. కానీ అతడు ప్రేమ పేరుతో నన్ను మోసం చేశాడు. హృదయాన్ని గాయపరిచాడు. నా ఆత్మవిశ్వాసంతో ఆ గాయానికి మందు పూసుకున్నా.. ఎన్నటికీ మాయని ఒక చిన్న మచ్చలా ఈ ఘటన నా జీవితంలో గుర్తుండిపోతుంది.

*****

మరి, ఇదంతా ఇప్పుడు మీతో ఎందుకు పంచుకుంటున్నానో తెలుసా? ఈ రోజుల్లో రకరకాల సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ అందుబాటులో ఉంటున్నాయి. వాటిని ఉపయోగించే అమ్మాయిల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అయితే వీటి వినియోగంలో మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనల్ని మోసగించే వ్యక్తులు చాలామంది ఉంటారని గుర్తుంచుకోవాలి! అందంగా ఉన్నారనో, ఆకర్షణీయంగా కనిపిస్తున్నారనో.. వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను అంగీకరిస్తే నాలానే మీరు కూడా మోసపోవచ్చు. అదీకాకుండా మనకు మాయ మాటలు చెబుతూనే వారి మైకంలో పడేలా చేసేవాళ్లు ఎందరో! ఒక్కసారి ఆ మైకంలో పడ్డామా.. మన విచక్షణను సైతం కోల్పోతాం అనడంలో ఎలాంటి సందేహం లేదు! అందుకే ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండండి.. ప్రతిదానికీ హద్దులు ఉంటాయని గుర్తుంచుకోండి! అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించండి..! అమ్మాయిలూ.. తస్మాత్ జాగ్రత్త..!

ఇట్లు,
లహరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్