అందుకే ఈవిడ ఎప్పటికీ ‘యంగ్’ లేడీ!

‘మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి..’ అన్నట్లు సంపాదన కోసం కాకపోయినా.. ఉల్లాసం కోసమైనా నచ్చిన వ్యాపకాన్ని జీవితంలో భాగం చేసుకోవాలంటున్నారు మానసిక నిపుణులు. అలా నచ్చిన వ్యాపకంతో వయోభారం పెరుగుతోన్నా కొంతమంది ఉల్లాసంగా గడిపేస్తుంటారు.

Published : 17 Jan 2024 12:16 IST

(Photos: Instagram)

‘మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి..’ అన్నట్లు సంపాదన కోసం కాకపోయినా.. ఉల్లాసం కోసమైనా నచ్చిన వ్యాపకాన్ని జీవితంలో భాగం చేసుకోవాలంటున్నారు మానసిక నిపుణులు. అలా నచ్చిన వ్యాపకంతో వయోభారం పెరుగుతోన్నా కొంతమంది ఉల్లాసంగా గడిపేస్తుంటారు. అమెరికాకు చెందిన డ్వాన్‌ జాకబ్సెన్‌ యంగ్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటుంది. పేరుకు తగ్గట్లే- 90 ఏళ్లు పైబడినా కూడా స్కీయింగ్‌ చేస్తూ జీవితాన్ని ఎంతో ఉల్లాసంగా గడుపుతోంది ఈ ‘యంగ్’ లేడీ! ఈ క్రమంలో స్కీయింగ్‌ చేసిన పెద్ద వయస్కురాలిగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించుకుంది. మరి, ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా...

సరదాగా మొదలై..

అమెరికాకు చెందిన డ్వాన్‌ మొదట సాధారణ జీవితాన్నే గడిపింది. అయితే ఓసారి వేసవి సెలవుల్లో విహారయాత్ర కోసం సమీపంలోని బేర్ సరస్సు దగ్గర ఓ క్యాబిన్ తీసుకుంది. ఈ క్రమంలో స్కీయింగ్ చేయడానికి ఈ సరస్సు దగ్గరకు ఎంతోమంది రావడం గమనించింది. దాంతో తను కూడా సరదాగా స్కీయింగ్‌ చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఆమె వయసు 29 సంవత్సరాలు. అయితే అంతకుముందు ఎప్పుడూ స్కీయింగ్ చేయకపోవడంతో మొదట్లో చాలా ఇబ్బంది పడింది. అయినా సరే- పట్టు వదలక నేర్చుకుని సాధన చేసింది. అలా క్రమంగా స్కీయింగ్ కూడా తన జీవితంలో భాగమైంది.

ఆ లేక్‌ అంటే ఇష్టం..!

మొదట్లో రెండు స్కీలతో స్కీయింగ్‌ చేసిన డ్వాన్.. కాస్త పట్టు వచ్చాక ఒక్క స్కీతోనే స్కీయింగ్‌ చేసింది. అలా స్కీయింగ్‌పై మక్కువ పెంచుకున్న ఆమె ప్రతి వేసవిని అదే సరస్సు దగ్గర గడపడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో స్కీయింగ్‌ చేయడం వల్ల తెలియని సంతోషం కలుగుతుందంటుంది డ్వాన్‌. స్కీయింగ్‌ చేసేటప్పుడు డ్వాన్‌ పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. సరస్సులోని నీళ్లను బట్టి తన వేక్‌ బోర్డ్‌ను ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. ఒకవేళ బలమైన గాలులు వీచి, నీటి ప్రవాహం అస్థిరంగా ఉంటే వెంటనే స్కీయింగ్ ఆపేస్తుంటుంది. బేర్‌ సరస్సుతో పాటు ప్రపంచంలోని వివిధ సరస్సుల్లో స్కీయింగ్‌ చేసింది ఈ బామ్మ. అయితే తనకు మాత్రం స్విట్జర్లాండ్‌లోని జెనీవా లేక్‌ అంటే ఎంతో ఇష్టం అని చెబుతుంది.

మూడు తరాల వారితో...!

29 ఏళ్ల వయసులో స్కీయింగ్ ప్రయాణం మొదలుపెట్టిన డ్వాన్ ఇప్పటివరకు దానికి ఎప్పుడూ విరామం ప్రకటించలేదు. ఈ క్రమంలో తన పిల్లలతో పాటు మనుమలు, ముని మనవరాళ్లతో కూడా స్కీయింగ్ చేయడం విశేషం. ఈ క్రమంలో ప్రపంచంలోనే స్కీయింగ్‌ చేసిన పెద్ద వయస్కురాలిగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం గమనార్హం.
దీని గురించి పంచుకుంటూ- ‘ఇటీవలే మా కుటుంబమంతా కలిసి ఫ్యామిలీ పార్టీ జరుపుకొన్నాం. ఈ సందర్భంగా మా అమ్మాయి ‘నీ మనవరాలు నీకు ఒక సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతోంద’ని చెప్పింది. అది ఏంటా అనుకుంటుండగానే.. ఈ వేసవిలో నేను స్కీయింగ్‌ చేసిన వీడియోను నా మనవరాలు స్క్రీన్‌పై ప్లే చేసింది. ఆ తర్వాత గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో నాకు స్థానం లభించిందని చెప్పి నన్ను సర్‌ప్రైజ్‌ చేసింది. అది విని మొదట నా నోట మాట రాలేదు. చెప్పలేని సంతోషం కలిగింది. అయితే నేను సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఇంకా ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్నందుకు అదృష్టవంతురాలిని. ఇది జీవితాన్ని సంపూర్ణంగా గడపడానికి దోహదపడింది. మీరు కూడా వయసు పెరుగుతోందని వెనకడుగు వేయకండి. మీ ఆలోచనల కంటే ఎక్కువ శక్తి మీలో ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్