First Woman Sniper: చాటుమాటుగా శత్రువును మట్టుపెట్టేస్తుంది!

అసాధ్యమనుకున్న రంగాల్లోనూ రాణిస్తున్నారు ఈతరం అమ్మాయిలు. గ్లాస్‌ సీలింగ్‌ని బద్దలుకొడుతూ తొలి మహిళలుగా ఘనత సాధిస్తున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన సుమన్‌ కుమారి తాజాగా ఇలాంటి గుర్తింపునే సొంతం చేసుకుంది.

Updated : 16 Mar 2024 14:59 IST

(Photos: Twitter)

అసాధ్యమనుకున్న రంగాల్లోనూ రాణిస్తున్నారు ఈతరం అమ్మాయిలు. గ్లాస్‌ సీలింగ్‌ని బద్దలుకొడుతూ తొలి మహిళలుగా ఘనత సాధిస్తున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన సుమన్‌ కుమారి తాజాగా ఇలాంటి గుర్తింపునే సొంతం చేసుకుంది. చాటుమాటుగా/రహస్యంగా కదులుతూనే శత్రు సైన్యాన్ని మట్టుబెట్టే ‘స్నైపర్’ ట్రైనింగ్‌ని ఇటీవలే పూర్తిచేసుకుందామె. తద్వారా ‘బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)’ నుంచి స్నైపర్‌గా అర్హత సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కింది సుమన్‌. ఈ నేపథ్యంలో ఈ డేరింగ్‌ లేడీ గురించి కొన్ని ఆసక్తి విశేషాలు తెలుసుకుందాం..!

అందరిలా కాకుండా అరుదైన రంగాల్ని ఎంచుకోవాలనుకుంటున్నారు చాలామంది అమ్మాయిలు. సుమన్‌ కూడా చిన్నతనం నుంచి ఇలాంటి కలల్లోనే జీవించింది. దేశ సేవలో భాగమవుతూనే, సాహసోపేతమైన రంగాన్ని తన కెరీర్‌గా మలచుకోవాలనుకున్న ఆమె.. మూడేళ్ల క్రితం ‘సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)’లో చేరింది. ప్రస్తుతం ఈ దళంలో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోందామె.

సాహసాలే ఊపిరిగా!

విధుల్లో చేరాకే రెండు దేశాల మధ్య జరిగిన స్నైపర్‌ దాడుల్ని ప్రత్యక్షంగా చూసింది సుమన్. చెట్టు చాటున మాటువేసి, లేదంటే నేలపై రహస్యంగా పాకుతూ దూరం నుంచే శత్రువు పైకి గురి తప్పకుండా కాల్పులు జరిపే వారిని ‘స్నైపర్’లుగా పేర్కొంటారు. ఇలా ఈ సాహసకృత్యమే తనను స్నైపర్‌ ట్రైనింగ్‌ తీసుకునేందుకు ప్రేరేపించిందంటోందామె.
‘నేను ఉద్యోగంలో చేరాక ఓసారి రెండు దేశాల మధ్య జరిగిన స్నైపర్‌ దాడుల్ని ప్రత్యక్షంగా చూశా. అప్పుడే నాకూ ఈ నైపుణ్యాలు నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగింది. ఈ మక్కువతోనే ఇండోర్‌లోని ‘సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ వెపన్స్‌ అండ్‌ టాక్టిక్స్‌ (CSWT)’లో చేరాను. ఎనిమిది వారాల పాటు కఠోర శిక్షణ తీసుకున్నా. కఠినమైన వ్యాయామాలు, నిరంతర సాధనతో ఒళ్లు హూనమయ్యేది. అయినా ఇష్టపడితే కష్టమనిపించదన్నట్లు ఇష్టంతోనే నైపుణ్యాలు ఒంటబట్టించుకున్నా..’ అంటోన్న సుమన్‌ ‘ఇన్‌స్ట్రక్టర్‌’గా శిక్షణ పూర్తిచేసింది. ప్రస్తుతం స్నైపర్‌ ట్రైనర్‌గా మరింతమందిని ఈ విభాగంలో తీర్చిదిద్దనుందామె.

మధ్యతరగతి కుటుంబం!

ఎనిమిది వారాల పాటు శిక్షణ తీసుకున్న ఈ స్నైపర్‌ ట్రైనింగ్‌ బ్యాచ్‌లో మొత్తం 57 మంది శిక్షణ పొందగా.. అందులో సుమన్‌ ఒక్కర్తే మహిళ. తద్వారా బీఎస్‌ఎఫ్‌ నుంచి స్నైపర్‌గా అర్హత సాధించిన తొలి మహిళగా ఘనత సాధించిందామె. హిమాచల్ప్రదేశ్‌లోని మండి జిల్లాకు చెందిన ఆమెది మధ్య తరగతి కుటుంబం. ఆమె తండ్రి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు.. తల్లి గృహిణి.

‘ప్రస్తుతం బీఎస్‌ఎఫ్‌ కూడా స్త్రీపురుష సమానత్వాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులోనూ మహిళలు అన్ని విభాగాల్లో రాణిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే తొలిసారి ఓ మహిళకు స్నైపర్‌ ట్రైనింగ్‌ ఇచ్చాం. అలా సుమన్‌ బీఎస్‌ఎఫ్‌ తొలి మహిళా స్నైపర్‌గా ఘనత సాధించింది..’ అంటూ CSWT అధికారికంగా ట్వీట్‌ చేసింది. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ నేపథ్యంలో సుమన్‌ను బీఎస్‌ఎఫ్‌ తొలి మహిళా స్నైపర్‌గా ఎంపిక చేయడం మరో విశేషం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్