Guinness Record : అందరికీ 32 పళ్లైతే.. ఆమెకు 38 పళ్లు!

మీ నోట్లో ఎన్ని దంతాలున్నాయ్‌? అదేం ప్రశ్న.. పై దవడకు 16, కింది దవడకు 16 మొత్తం 32 పళ్లున్నాయి అంటారా? మనం చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నది కూడా ఇదే! అయితే మన దేశానికి చెందిన కల్పనా బాలన్‌ అనే మహిళకు మాత్రం మొత్తం 38 దంతాలున్నాయి.

Published : 23 Nov 2023 14:24 IST

మీ నోట్లో ఎన్ని దంతాలున్నాయ్‌? అదేం ప్రశ్న.. పై దవడకు 16, కింది దవడకు 16 మొత్తం 32 పళ్లున్నాయి అంటారా? మనం చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నది కూడా ఇదే! అయితే మన దేశానికి చెందిన కల్పనా బాలన్‌ అనే మహిళకు మాత్రం మొత్తం 38 దంతాలున్నాయి. ఈ అదనపు ఆరు దంతాలే ఆమెకు ప్రపంచ రికార్డును తెచ్చిపెట్టాయి. ‘ప్రపంచంలోనే అత్యధిక దంతాలున్న మహిళ’గా తాజాగా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకుందామె. ఒకప్పుడు ఈ అదనపు దంతాల్ని తొలగించుకోవాలని నిర్ణయించుకున్న ఆమె.. ఇప్పుడు గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకోవడంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.

తమిళనాడుకు చెందిన కల్పనా బాలన్‌కు యుక్తవయసులోకొచ్చే సరికి అందరిలాగే 32 దంతాలే ఉండేవి. అయితే రోజులు గడిచే కొద్దీ పలువరుస మధ్యలో పంటిని ఆనుకొని ఒక్కో దంతం పెరుగుతూ వచ్చింది. అలా ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న ఆమెకు.. నోట్లో మొత్తంగా 38 దంతాలున్నాయి. అయితే వీటి కారణంగా నొప్పేమీ లేకపోయినా.. కొన్ని సమస్యలు ఎదురయ్యాయని చెబుతోంది కల్పన.

‘నాకే ఎందుకిలా?’ అనిపించేది!

‘వయసు పెరిగే కొద్దీ ఒక్కో పన్నూ పుట్టుకురావడంతో నాకు నేనే ఆశ్చర్యపోయా. ఈ విషయం అమ్మానాన్నలకు చెప్తే ఇదేమైనా సమస్యేమోనని ఆందోళన పడ్డారు. అయితే ఇలా పలు వరుసను ఆనుకొని పెరిగిన ఈ అదనపు దంతాల కారణంగా నొప్పేమీ కలగకపోయినా.. ఆహారం నమిలేటప్పుడు మాత్రం నాలుక పంటి కింద పడడం, దంతాల మధ్యలో ఆహార అవశేషాలు ఇరుక్కుపోవడం.. వంటివి ఇబ్బందిగా అనిపించేవి. దీంతో వీటిని తొలగించుకోవాలనుకున్నా. ఈ ఆలోచనతోనే దంత వైద్య నిపుణుల్ని సంప్రదిస్తే.. బలవంతంగా తొలగించడం వల్ల పలు సమస్యలొస్తాయని చెప్పారు. పూర్తిగా పెరిగాక తొలగించే అవకాశం ఉందో, లేదో పరిశీలిద్దామన్నారు. కానీ పూర్తిగా పెరిగాక వీటిని తొలగించుకోవాలంటే నాకే భయమేసింది. అందుకే అలాగే ఉంచుకున్నా..’ అంటూ అదనపు దంతాల వల్ల తనకెదురైన ఇబ్బందులేంటో పంచుకుంది కల్పన.

‘గిన్నిస్‌’ రికార్డు!

అయితే ఒకప్పుడు తాను తొలగించుకోవాలనుకున్న ఈ అదనపు దంతాలే ఇప్పుడు ఆమెకు ప్రపంచ రికార్డును తెచ్చిపెట్టాయి. 38 దంతాలతో ‘ప్రపంచంలోనే అత్యధిక పళ్లున్న మహిళ’గా తాజాగా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకుంది కల్పన.

‘అందరి కంటే భిన్నంగా దంతాలు ఎక్కువగా రావడంతో తొలుత ఇబ్బంది పడ్డా.. ఆత్మన్యూనతకు గురయ్యా. కానీ ఈ ప్రత్యేకతే నాకు అరుదైన గుర్తింపు తెచ్చిపెట్టింది. గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదనపు దంతాలు తొలగించుకోకపోవడమే మంచిదైందనిపిస్తోంది. అయితే ప్రస్తుతం నా నోట్లో మరో రెండు దంతాలు పెరుగుతున్నాయి. దీంతో భవిష్యత్తులో 40 దంతాలతో నా రికార్డును నేనే బద్దలు కొట్టాలని ఎదురుచూస్తున్నా..’ అంటోంది కల్పన. ప్రస్తుతం ఆమె పై దవడకు రెండు అదనపు పళ్లు, కింది దవడకు నాలుగు అదనపు పళ్లున్నట్లు గిన్నిస్‌ నిర్వాహకులు గుర్తించారు. ఇక పురుషుల్లో ఈ రికార్డు కెనడాకు చెందిన ఎవానో మెల్లోన్‌ పేరిట ఉంది. ఆయన నోట్లో మొత్తం 41 దంతాలున్నాయి.

అసలేంటీ సూపర్‌ న్యూమరరీ టీత్‌?

నోట్లో సాధారణంగా 32కు మించి దంతాలుంటే ఈ పరిస్థితిని ‘Hyperdontia’ లేదా ‘Polydontia’ గా పిలుస్తారు. ఇలా అధికంగా ఉండే దంతాల్ని సూపర్‌ న్యూమరరీ టీత్‌గా పరిగణిస్తారు. ప్రపంచ జనాభాలో ఇలా ఒకటి లేదా అంతకుమించి సూపర్‌ న్యూమరరీ దంతాలున్న వారి సంఖ్య 3.8 శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. దంతాల నిర్మాణ ప్రక్రియలో లోపాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నా.. దీనికి కచ్చితమైన కారణమేంటో తెలుసుకోవడానికి ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. కొంతమందిలో ఇది వంశపారంపర్యంగా, పెదవి చీలిక వల్ల వచ్చే అవకాశాలున్నాయట! అలాగే Gardner Syndrome, Fabry Disease, Cleidocranial Dysostosis.. వంటి సమస్యలున్న వారిలోనూ ఈ పరిస్థితి తలెత్తే అవకాశాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్