Arisa Trew: ‘720 ట్రిక్’తో.. ప్రపంచ రికార్డు!
శరీరాన్ని బ్యాలన్స్ చేస్తూ, గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా స్కేట్ బోర్డింగ్ క్రీడాకారులు చేసే పలు సాహస విన్యాసాలు అబ్బుర పరుస్తుంటాయి. అలాంటి ఓ క్లిష్టమైన ఫీట్‌తో తాజాగా ప్రపంచ రికార్డు సృష్టించింది ఆస్ట్రేలియాకు చెందిన....
(Photos: Instagram)
శరీరాన్ని బ్యాలన్స్ చేస్తూ, గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా స్కేట్ బోర్డింగ్ క్రీడాకారులు చేసే పలు సాహస విన్యాసాలు అబ్బుర పరుస్తుంటాయి. అలాంటి ఓ క్లిష్టమైన ఫీట్‌తో తాజాగా ప్రపంచ రికార్డు సృష్టించింది ఆస్ట్రేలియాకు చెందిన టీనేజ్ స్కేటర్ అరిసా ట్రూ. అయితే స్కేట్‌బోర్డ్‌పై వేగంగా కదిలే క్రమంలో గాల్లోకి ఎగిరి ఒక్క భ్రమణం చేయడమే గొప్ప విషయం అనుకుంటే.. రెండు పూర్తి భ్రమణాలు పూర్తి చేసి భూమిపై ల్యాండ్ అయిందామె. ‘720 ట్రిక్’గా పిలిచే ఈ ఫీట్‌ను పూర్తి చేసి.. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి మహిళా స్కేట్‌బోర్డర్‌గా చరిత్ర సృష్టించింది అరిసా. అమెరికన్ స్కేటర్ టోనీ హాక్‌ను ఈ అరుదైన ట్రిక్‌కు ఆద్యులుగా చెబుతారు. ఆయన తర్వాత ఈ ఫీట్ పూర్తి చేసిన ఖ్యాతిని సొంతం చేసుకుందీ ఆసీస్ టీనేజ్ స్కేటర్.
స్కేట్ పార్కుల్లో వివిధ ఆకృతుల్లో ఉండే ఉపరితలాలపై క్రీడాకారులు పలు విన్యాసాలు చేస్తూ ఆకట్టుకోవడం మనం చూస్తుంటాం. అయితే ఇందులోనూ సరికొత్త ట్రిక్స్ ప్రయత్నిస్తూ సాహసాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు యువ క్రీడాకారులు. ఇటీవల అమెరికాలోని ఉతా వేదికగా జరిగిన ‘వెర్ట్ అలర్ట్ పోటీల్లో’ భాగంగా ఇలాంటి ఓ అరుదైన ఫీట్‌ను ప్రయత్నించింది అరిసా.
ఇప్పటికీ నమ్మలేకపోతున్నా!
స్కేట్ బోర్డింగ్ క్రీడల్లో భాగంగా 720 ట్రిక్‌ను క్లిష్టమైన విన్యాసంగా పరిగణిస్తారు. ఈ ఫీట్‌లో భాగంగా.. బౌల్ స్కేట్ పార్క్‌లో స్కేట్ బోర్డింగ్ చేస్తూ.. గాల్లోకి ఎగిరి రెండుసార్లు భ్రమణం పూర్తి చేసుకొని.. తిరిగి భూమిపై ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. తాజాగా జరిగిన క్రీడల్లో ఈ అరుదైన ఫీట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది అరిసా. నిజానికి అమెరికన్ సీనియర్ క్రీడాకారుడు టోనీ హాక్స్ 1985లో తొలిసారి ఈ ఫీట్‌ను ప్రయత్నించి సక్సెసయ్యారు. ఇక అప్పట్నుంచి చాలామంది క్రీడాకారులు ఈ ట్రిక్‌ను ప్రయత్నించినా విఫలమయ్యారు. కానీ తాజాగా అరిసా ఈ అరుదైన విన్యాసంతో తన స్కేటింగ్ నైపుణ్యాల్ని మరోసారి ప్రపంచానికి చాటుకుంది. తద్వారా 720 ట్రిక్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తొలి మహిళా స్కేట్ బోర్డర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించిందామె. అంతేకాదు.. ఈ పోటీల్లో బంగారు పతకం సొంతం చేసుకున్న ఆమె.. జులైలో క్యాలిఫోర్నియాలో జరగనున్న ‘X Games’కూ అర్హత సాధించింది.
‘720 ట్రిక్‌ను విజయవంతంగా పూర్తిచేశానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అందులోనూ ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొదటి అమ్మాయిని నేను.. అని చెప్పుకోవడం గర్వంగా ఉంది..’ అంటూ ఇన్‌స్టాలో తన ఆనందాన్ని పంచుకుందీ ఆసీస్ టీన్.
ఏడేళ్ల వయసులోనే..!
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో పుట్టి పెరిగింది అరిసా. చిన్నతనం నుంచి ఆమెకు ఆటలంటే మక్కువ. ఈ ఇష్టాన్ని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు అరిసాను ఏడేళ్ల వయసు నుంచే క్రీడల్లో ప్రోత్సహించడం ప్రారంభించారు. ముఖ్యంగా సాహస క్రీడలపై ఆసక్తి చూపే ఆమెను.. ఆమె తండ్రి ప్రతిరోజూ స్కూల్ ముగిశాక సర్ఫింగ్ శిక్షణకు తీసుకెళ్లేవాడు. స్కేట్ పార్కులకూ వెంటపెట్టుకెళ్లేవాడు. అయితే అటు సర్ఫింగ్, ఇటు స్కేట్‌బోర్డింగ్.. రెండింట్లోనూ మెలకువలు నేర్చుకున్న అరిసా.. స్కేట్ బోర్డింగ్ వైపే మొగ్గు చూపింది.
‘స్కేట్‌బోర్డింగ్ సాధన చేస్తున్న క్రమంలోనే ఓసారి బౌల్ (బౌల్ తరహా స్కేట్‌పార్క్)లో పడిపోయా. ఇలా పడుతూ లేస్తూనే మెలకువలు నేర్చుకున్నా. ప్రతి రోజూ కొత్త ట్రిక్స్ ప్రయత్నించడం భలే సరదాగా అనిపిస్తుంటుంది. ఇక స్కేట్ పార్కుల విషయానికొస్తే.. వెర్ట్ ర్యాంప్స్ (‘U’ ఆకృతిలో ఉండే స్కేట్‌పార్క్), బౌల్ తరహా స్కేట్ పార్కుల్లో సాధన చేయడమంటే మరీ ఇష్టం. ఎందుకంటే.. వీటిపై కొత్త ట్రిక్స్ ప్రయత్నించడం, సాహసోపేతమైన ఫీట్స్ చేయడం భలే థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది..’ అంటూ చెప్పుకొచ్చింది అరిసా.
ఒలింపిక్సే.. నా టార్గెట్!
తన స్కేట్ బోర్డింగ్ కెరీర్‌లో భాగంగా.. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన అరిసా.. గతేడాది ‘బౌల్ జిల్లా’ పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది మేలో జరిగిన ‘WST: San Juan Park’ పోటీల్లో ఏడో స్థానంతో సరిపెట్టుకున్న ఈ ఆసీస్ స్కేట్ బోర్డర్.. ప్రపంచ స్కేట్ బోర్డింగ్ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న ‘స్కేట్ బోర్డ్ పార్క్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్’లో సత్తా చాటి.. తద్వారా వచ్చే ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్‌కు మార్గం సుగమం చేసుకోవడమే తన లక్ష్యమంటోంది అరిసా.‘స్కేట్ బోర్డింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నప్పుడే ఒలింపిక్స్‌లో పాల్గొనాలని, అందులో పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ప్యారిస్ ఒలింపిక్స్‌తో నా కల నెరవేర్చుకోవాలనుకుంటున్నా. అలాగే భవిష్యత్తులో క్రిస్ట్ ఎయిర్ (ఏరియల్ స్కేట్ బోర్డింగ్ ట్రిక్), స్టేల్ 540, రోడియో, 900.. వంటి కఠినమైన ట్రిక్స్ కూడా ప్రయత్నించాలనుంది. ఇక ఖాళీ సమయాల్లో స్నేహితులతో కలిసి స్కేట్ పార్కులకు వెళ్లడమన్నా, వాళ్లతో కలిసి సర్ఫింగ్ చేయడం, బీచ్‌లో ఈత కొట్టడమన్నా మక్కువే!’ అంటోందీ యువ స్కేటర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.