Mamatha Guguloth: సరదాగా తీసిన ఫొటోకు ‘వోగ్’ గుర్తింపు!
మనకు ఆసక్తి ఉన్న అంశాల్ని కొత్తగా, క్రియేటివ్‌గా ప్రజెంట్ చేయాలనుకుంటాం.. కానీ ఈ ప్రయత్నానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కితే.. అటు సంతోషం, ఇటు ఆత్మవిశ్వాసం. ఒకే ఒక్క ఫొటోతో ఈ రెండింటినీ దక్కించుకుంది రాజన్న సిరిసిల్ల....
(Photos: Twitter)
మనకు ఆసక్తి ఉన్న అంశాల్ని కొత్తగా, క్రియేటివ్‌గా ప్రజెంట్ చేయాలనుకుంటాం.. కానీ ఈ ప్రయత్నానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కితే.. అటు సంతోషం, ఇటు ఆత్మవిశ్వాసం. ఒకే ఒక్క ఫొటోతో ఈ రెండింటినీ దక్కించుకుంది రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గిరిజన అమ్మాయి గుగులోత్ మమత. ఫొటోగ్రఫీ విద్యార్థిని అయిన ఆమె తీసిన ఓ ఫొటోను తాజాగా ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ పత్రిక ‘వోగ్ ఇటాలియా’ ఎంపిక చేసుకుంది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. మమత తీసిన ఫొటోను తాజాగా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆమె ప్రతిభను ప్రశంసించారు. మరి, ఒక గిరిజన విద్యార్థి తీసిన ఫొటో.. అసలు వోగ్‌కు ఎలా చేరింది? తెలుసుకుందాం రండి..
మమతది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బంజపల్లి గ్రామం. లంబాడీ గిరిజన బాలిక అయిన ఆమెది వ్యవసాయాధారిత కుటుంబం. చిన్నతనం నుంచి అక్కడి సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుకుంటోన్న ఆమె.. ప్రస్తుతం ‘తెలంగాణ గిరిజన సంక్షేమ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ’లో ‘ఫొటోగ్రఫీ’ విభాగంలో బీఏ (ఆనర్స్) రెండో సంవత్సరం చదువుతోంది. ఫంక్షన్ అయినా, ప్రత్యేక సందర్భమైనా సరదాగా ఫొటోలు తీయడమంటే ఆమెకు చాలా ఇష్టం. ఈ మక్కువే తాను ఫొటోగ్రఫీని ఎంచుకునేలా చేసిందంటోంది మమత.
‘ఫొటోగ్రఫీ’పై మక్కువతో..!
‘నాన్న వ్యవసాయం చేస్తారు. అమ్మ గృహిణి. నాకు అక్క, చెల్లి, తమ్ముడు ఉన్నారు. మేమంతా ఇక్కడి గిరిజన పాఠశాలలోనే చదువుకుంటున్నాం. అయితే నాకు చిన్నతనం నుంచి ఫొటోగ్రఫీ అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. ఈ మక్కువతోనే ఇంట్లో, చుట్టుపక్కల ఎలాంటి ప్రత్యేక సందర్భమైనా ఫొటోలు క్లిక్‌మనిపించేదాన్ని. ఇక స్కూల్లో ఎలాంటి అకేషన్ అయినా టీచర్లు కెమెరా నా చేతికిచ్చే వారు. ఈ ఆసక్తే నేను బీఏలో ఫొటోగ్రఫీని ఎంచుకునేందుకు ప్రేరేపించాయి. ఇక్కడి ‘తెలంగాణ గిరిజన సంక్షేమ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ’లో ఫొటోగ్రఫీ విభాగం మొదటి బ్యాచ్‌లో చేరిన 13 మందిలో నేనూ ఒకదాన్ని.. ఫొటోగ్రఫీకి సృజనాత్మకత జోడించాలన్నది నా కోరిక..’ అంటూ చెప్పుకొచ్చిందామె.
సరదాగా తీశాను.. కానీ!
సహజసిద్ధమైన లొకేషన్లలో ఫొటోలు క్లిక్‌మనిపించడం మమతకు ఇష్టం. ఈ క్రమంలోనే చుట్టుపక్కల గ్రామాలు, తండాలకు వెళ్లి.. అక్కడి ప్రజల జీవనశైలి, మహిళల వస్త్రధారణ.. వంటివి తన కెమెరాలో బంధిస్తుంటుందామె. ఇందులో భాగంగానే ఓ సందర్భంలో తన నానమ్మ ఫొటోను కెమెరాలో బంధించింది మమత. ఇప్పుడిదే ఫొటోను ప్రముఖ ఫ్యాషన్ పత్రిక ‘వోగ్ ఇటాలియా’ ఎంపిక చేసుకోవడంతో ఇంటర్నేషనల్ సెన్సేషన్‌గా మారిపోయింది మమత.
‘అది మా నానమ్మ కేస్లీ ఫొటో. కామారెడ్డి జిల్లా బంజపల్లి తండాలో ఓ వివాహ విందుకు ఇలా సంప్రదాయబద్ధంగా ముస్తాబై వెళ్తుంటే క్లిక్‌మనిపించా. కెమెరా లైటింగ్‌తో పనిలేకుండా సహజ వెలుతురులో పగటి పూట ఈ ఫొటో తీశాను. ఇలా సరదాగా తీసిన ఈ ఫొటోకు ఇంతటి గుర్తింపు వస్తుందని నేను ఊహించలేదు. ఇది నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.. మా కుటుంబంలో నేనొక్కదాన్నే భిన్నమైన రంగాన్ని ఎంచుకున్నా.. అరుదైన గుర్తింపు రావడంతో చాలా ఆనందంగా ఉంది..’ అంటూ చెప్పుకొచ్చిందీ యువ ఫొటోగ్రాఫర్. ఇక ఇటీవలే ‘తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో’ భాగంగా.. రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌లోనూ ఈ ఫొటో ప్రదర్శితమైంది.
బంజపల్లి నుంచి వోగ్ వరకు..!
మమత తీసిన ఫొటోను వోగ్ పత్రిక ఎంచుకోవడంతో.. ఆమె ప్రతిభను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా ప్రశంసించారు. ఇదే ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ఈ యువ ఫొటోగ్రాఫర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే తన ఫొటోకు అంతర్జాతీయ గుర్తింపు రావడం వెనుక తన గురువు, ప్రముఖ ఫొటోగ్రాఫర్ రఘు థామస్ ప్రోత్సాహం ఎంతో ఉందంటోంది మమత.
‘రఘు థామస్ మా ఫొటోగ్రఫీ టీచర్. తనది ముంబయి. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా తనకు పేరుంది. ముంబయిలో ఫ్రీలాన్సింగ్ చేసే సమయంలో వోగ్‌తో కలిసి పనిచేశారాయన. ఇతర ఫ్రీలాన్సర్లూ తాము తీసిన విభిన్న ఫొటోలు ఆయనకు పంపించేవారు. ఫొటోగ్రఫీపై మాకున్న మక్కువను గుర్తించిన రఘు మాస్టర్.. వోగ్ పత్రిక అవసరాల్ని బట్టి.. వాటికి సరిపోయే ఫొటోలను పంపిస్తుంటారు. అలా నా ఫొటో వోగ్ ఇటాలియాను చేరింది..’ అంటూ మురిసిపోతోందీ ఫొటోగ్రఫీ లవర్. ‘నిజానికి నాణ్యమైన కెమెరాలు తమ విద్యార్థుల వద్ద లేకపోయినా.. వారి ఆత్మవిశ్వాసమే వారు ఈ రంగంలో రాణించేలా చేస్తుంది.. మమతకు దక్కిన గుర్తింపు కూడా ఇలాంటిదే!’ అంటూ మమత ప్రతిభను ప్రశంసించారు ఆమె గురువు రఘు. ఏదేమైనా తనకు దక్కిన ఈ అరుదైన గుర్తింపు ఎంతో సంతోషాన్నిస్తుందంటోన్న మమత.. భవిష్యత్తులో వెడ్డింగ్ ఫొటోగ్రఫీ లేదంటే ఫ్యాషన్ ఫొటోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకుంటానంటోంది.
అమ్మ వద్దంటే వద్దంది!
నేను ఫొటోగ్రఫీని ఎంచుకుంటానన్నప్పుడు అమ్మ వద్దంటే వద్దంది. ఎందుకంటే ఈ రంగంలో అమ్మాయిలు ఉండరని, అబ్బాయిలతో కలిసి ఫొటోలు తీయాల్సి వస్తుందేమోనని కాస్త నెర్వస్ అయింది. కానీ నాన్న ఇందుకు భిన్నం. ‘నీకు ఆసక్తి ఉన్న రంగంలో ముందుకు సాగు..’ అని నా వెన్నుతట్టారు. అయితే ఓసారి వర్క్‌షాప్ కోసం అరకు వెళ్లినప్పుడు.. ఫొటోగ్రఫీపై నాకున్న అమితాసక్తి, నా ఫొటో వర్క్స్ గురించి అమ్మ అర్థం చేసుకుంది. దీనికి తోడు ఇలాంటి అరుదైన రంగాన్ని ఎంచుకుంటే బాగా రాణించచ్చని సందర్భం వచ్చినప్పుడల్లా నాన్న అమ్మకు నచ్చజెప్పేవాడు. ఇలా తనలో క్రమంగా మార్పు రావడం మొదలైంది. ఇప్పుడు నాకొచ్చిన గుర్తింపు చూసి వాళ్లు సంతోషపడడం చూస్తుంటే నా మనసు నిండిపోతుంది. భవిష్యత్తులో ఫ్యాషన్ ఫొటోగ్రఫీ/పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్నా.
- మమత గుగులోత్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.