అందుకే వీటిని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోకూడదట!

ఇడ్లీ, దోసె, పోహా, ఉప్మా.. ఇలా మనకు ఎన్నో హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నా.. సమయం లేదంటూ వాటిపై దృష్టి పెట్టం. చిటికెలో చేసుకొని తినే బ్రెడ్‌, నూడుల్స్‌, పాస్తా.. అంటూ పాశ్చాత్య పోకడల వెంట పరుగులు పెడతాం. ఇంకొంతమందైతే సమయం లేదంటూ అసలు అల్పాహారం చేయడమే మానేస్తుంటారు. మన ఆరోగ్యానికి ఈ రెండు పద్ధతులూ హాని చేస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఉదయం పూట కొన్ని అనారోగ్యకరమైన పదార్థాలు తీసుకోవడం వల్ల రోజంతా నీరసంగా గడవడమే కాదు.. బరువూ పెరిగే ప్రమాదముందంటున్నారు.

Published : 22 Jun 2021 14:42 IST

లలితకు ఉదయాన్నే ఆఫీస్‌ హడావిడి. ఒక్కోసారి ఇంటి నుంచి పనిచేసినా తొమ్మిది కల్లా ల్యాపీ ముందు వాలిపోవాల్సిందే! దీంతో అల్పాహారం చేయడానికి సమయం లేక రోజూ బ్రెడ్‌తో సరిపెట్టేసుకుంటుంది.
విజితకు cerealsతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ అంటే మహా ఇష్టం. అందుకే రోజూ వాటిని పాలలో వేసుకొని అక్కడితో అల్పాహారం పని ముగించేసుకుంటుంది.
ఇడ్లీ, దోసె, పోహా, ఉప్మా.. ఇలా మనకు ఎన్నో హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నా.. సమయం లేదంటూ వాటిపై దృష్టి పెట్టం. చిటికెలో చేసుకొని తినే బ్రెడ్‌, నూడుల్స్‌, పాస్తా.. అంటూ పాశ్చాత్య పోకడల వెంట పరుగులు పెడతాం. ఇంకొంతమందైతే సమయం లేదంటూ అసలు అల్పాహారం చేయడమే మానేస్తుంటారు. మన ఆరోగ్యానికి ఈ రెండు పద్ధతులూ హాని చేస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఉదయం పూట కొన్ని అనారోగ్యకరమైన పదార్థాలు తీసుకోవడం వల్ల రోజంతా నీరసంగా గడవడమే కాదు.. బరువూ పెరిగే ప్రమాదముందంటున్నారు. అందుకే అవేంటో తెలుసుకొని వాటిని దూరం పెట్టమంటున్నారు. మరి, అల్పాహారంగా తీసుకోకూడని ఆ పదార్థాలేంటో, వాటి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుందో మనమూ తెలుసుకుందాం రండి..

మనం ఉదయం పూట ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటామో.. రోజంతా అంత యాక్టివ్‌గా ఉంటామని చెబుతుంటారు నిపుణులు. ముఖ్యంగా ఫైబర్‌, ప్రొటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులుండే పదార్థాల్ని బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకుంటే ఆ రోజంతటికీ కావాల్సిన శక్తి శరీరానికి అందుతుందట! అంతేకాదు.. కడుపు నిండుగా అనిపించి చిరుతిండ్ల పైకి మనసు మళ్లదు. అదే ఉదయాన్నే ఏది పడితే అది తింటే బరువు అదుపు తప్పడంతో పాటు పలు దీర్ఘకాలిక అనారోగ్యాలూ తప్పవంటున్నారు నిపుణులు.

‘మైదా’ వద్దే వద్దు!

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా కొంతమంది మైదాతో చేసిన వంటకాల చుట్టూనే తిరుగుతుంటారు. ప్యాన్‌కేక్స్‌, బోండాలు, కేక్స్‌, పిజ్జా, డోనట్స్‌.. ఇలా బయటి నుంచి తెప్పించుకున్నవే కాదు.. ఇంట్లోనూ చేసుకొని ఓ వేళాపాళా అంటూ లేకుండా ఆరగించేస్తుంటారు.. వీటిని ఉదయం పూట అల్పాహారంగా తీసుకునే వారూ లేకపోలేదు. నిజానికి మైదాతో చేసిన వంటకాలు ఎప్పుడు తిన్నా అనారోగ్యకరమే అంటున్నారు నిపుణులు. ఈ పదార్థంలో గ్లూటెన్‌ అధికంగా ఉంటుంది.. ఇది కడుపులోని పేగులకు అతుక్కుపోయి.. అంత సులభంగా జీర్ణం కూడా కాదు. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇక ఈ వంటకాల్లో అధికంగా ఉండే చక్కెరలు, కొవ్వులు.. బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని అల్పాహారంగానే కాదు.. ఇతర సమయాల్లోనూ తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ అంతగా తినాలనిపిస్తే.. ఎప్పుడో ఒకసారి అది కూడా తక్కువ మొత్తాల్లో తీసుకుంటూ మనసును తృప్తి పరచుకోవడం కొంతవరకు బెటర్‌ అంటున్నారు.

‘స్మూతీస్‌’ సాయంత్రానికే!

ఉదయాన్నే అల్పాహారం తయారుచేసుకునే సమయం లేని వారు, బరువు తగ్గాలనుకునే వారు, ఆరోగ్యంపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు.. బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో పండ్లరసాలు, పండ్లతో తయారుచేసిన స్మూతీస్‌ తీసుకోవడం మనకు తెలిసిందే! అయితే ఇవి ఆరోగ్యానికి మంచివన్న విషయం నిజమే అయినప్పటికీ అల్పాహారంగా మాత్రం వీటిని తీసుకోకపోవడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలో ఉండే అధిక చక్కెరలు రక్తంలో గ్లూకోజ్‌ స్థాయుల్ని పెంచుతాయట! తద్వారా దీర్ఘకాలంలో మధుమేహం బారిన పడే ప్రమాదం ఉంటుందట! అలాగని వీటిని మెనూ నుంచి పూర్తి దూరం పెట్టడం కాకుండా.. సాయంత్రం స్నాక్‌గా తీసుకోమని సలహా ఇస్తున్నారు.

రెగ్యులర్‌గా వద్దు!

పాలల్లో cereals వేసుకొని తినడం పెద్దలకే కాదు.. పిల్లలకూ మహా ఇష్టం! కొందరు తల్లిదండ్రులైతే తమ పిల్లలకు రోజూ ఇదే అల్పాహారంగా అందిస్తుంటారు. పైగా వీటి లేబుల్స్‌పై వాటిలో వివిధ రకాల పోషకాలున్నట్లుగా రాసి ఉంటుంది. కానీ అన్నిటి విషయంలోనూ అది నిజం కాదంటున్నారు నిపుణులు. cereals అనేవి తృణధాన్యాలను ఎక్కువగా ప్రాసెస్‌ చేసి తయారుచేసినవి. ఈ పద్ధతి ద్వారా వాటిలోని పోషకాలన్నీ నశించిపోతాయి. ఇక వీటిలో ఉండే పోషకాలన్నీ (లేబుల్‌పై రాసున్నవి) కృత్రిమంగా చేర్చినవే! ఈ పద్ధతిని ఫోర్టిఫికేషన్‌ అంటారు. కాబట్టి ఈ తరహా పదార్థాన్ని ఉదయాన్నే తీసుకుంటే లేనిపోని అనారోగ్యాలు తప్ప మరే ప్రయోజనం ఉండదు. అంతేకాదు.. ఇలా ఫోర్టిఫైడ్‌ చేసిన అల్పాహారాన్ని పిల్లలకు క్రమం తప్పకుండా అందిస్తే వారిలో రోజురోజుకీ రోగ నిరోధక శక్తి తగ్గిపోయి.. వారు త్వరగా జబ్బు పడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అలాగే వీటిలో ఉండే అధిక చక్కెరల కారణంగా భవిష్యత్తులో స్థూలకాయం, టైప్‌-2 డయాబెటిస్‌, గుండె సంబంధిత సమస్యల ముప్పు అధికంగా ఉంటుందట!

బ్రెడ్ తినాలనుకుంటే..

ఉదయాన్నే కప్పు టీలో ఓ రెండు బ్రెడ్డు ముక్కలు ముంచుకొని తినడం చాలామందికి అలవాటు! ఇక బ్రెడ్‌పై జామ్‌, చాక్లెట్‌ సాస్‌.. వంటివి అప్లై చేసుకొని ఈ రోజుకి ఇదే తమ బ్రేక్‌ఫాస్ట్‌ అని పని ముగించేసుకుంటారు. నిజానికి ఈ రెండు అలవాట్లు అంత ఆరోగ్యకరమైనవి కావంటున్నారు నిపుణులు. ఒకవేళ బ్రెడ్ తినాలనుకుంటే వైట్‌ బ్రెడ్‌కి బదులు గోధుమ బ్రెడ్‌, మల్టీ గ్రెయిన్‌ బ్రెడ్‌ మంచిదని సూచిస్తున్నారు. ఈ క్రమంలో వీటిపై తక్కువ కొవ్వులుండే బటర్‌, ఛీజ్‌, పీనట్‌ బటర్‌.. వంటివి రాసుకొని తీసుకోవడం ఉత్తమం.

ఇవి మంచివి!

* ఉడికించిన కోడిగుడ్లలో ప్రొటీన్‌ ఎక్కువగా ఉంటుంది. రోజూ దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే కడుపు నిండుగా ఉండి ఇతర పదార్థాల పైకి మనసు మళ్లదు. అంతేకాదు.. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయుల్ని అదుపులో ఉంచడానికి ఇది దోహదం చేస్తుంది.
* ఓట్స్‌లో ఉండే ఫైబర్‌ను ఓట్‌ బీటా గ్లూకాన్‌గా పిలుస్తారు. ఇది శరీరంలో అనవసర కొవ్వుల్ని కరిగించడంలో సహాయపడుతుంది. ఎక్కువ సమయం ఆకలేయకుండా ఉంటుంది. ఇక దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు బీపీని అదుపులో ఉంచడంలో తోడ్పడతాయి. కాబట్టి అల్పాహారంగా ఓట్‌మీల్ మంచిదని చెబుతున్నారు నిపుణులు.
* ప్రొటీన్‌ షేక్‌ని కూడా అల్పాహారం సమయంలో తీసుకోవడం మంచిదట! ఇందులో అధిక మొత్తంలో ఉండే ప్రొటీన్‌ ఎక్కువ సమయం ఆకలేయకుండా చేస్తుంది. అంతేకాదు.. ఈ పోషకం రక్తంలో గ్లూకోజ్‌ స్థాయుల్ని సైతం అదుపులో ఉంచుతుంది. ఈ క్రమంలో నట్స్‌తో ఇంట్లోనే ప్రొటీన్‌ పౌడర్‌ను తయారుచేసుకోవచ్చు.
* అల్పాహారం సమయంలో పండ్ల రసాలకు బదులు ఏదైనా ఒక పండు తినడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో విటమిన్‌ ‘సి’ అధికంగా ఉండే కమలాఫలమైతే మరీ మంచిదట! ఒక కమలాపండు ద్వారా ఆ రోజుకంతటికీ సరిపోయే విటమిన్‌ ‘సి’ని శరీరానికి అందించచ్చట! తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
* ప్రొటీన్లు అధికంగా ఉండే మినప్పప్పుతో చేసుకునే ఇడ్లీ, దోశ, వడ (వారానికోసారి).. వంటివి ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో వీటి నుంచి రోజంతటికీ కావాల్సిన ఐరన్‌, కాపర్‌, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, పొటాషియం, విటమిన్‌ ‘బి’.. వంటి పోషకాలు అందుతాయట!

సో.. ఇవండీ! అల్పాహారంలో భాగంగా తీసుకోకూడని, తీసుకోవాల్సిన కొన్ని ఆహార పదార్థాలు! మరి, మనమూ బ్రేక్‌ఫాస్ట్‌ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుందాం.. రోజంతా ఆరోగ్యంగా ఉందాం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్